మీడియాతో పాఠశాల విద్య కమిషనర్ అన్సారియా, శాప్ వైస్ చైర్మన్ భరణి
372 సర్టీఫికెట్లపై విచారణ సాధ్యం కాదు..
స్పోర్ట్స్ అసోసియేషన్లు ఇచ్చినవి ఒరిజినల్‌గానే పరిగణిస్తాం
ఎమ్మెల్యే కూన సంతకాన్ని ఆమోదించాలని ఫెడరేషన్ చెప్పింది
ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్లు సరైనవో కాదో రెవెన్యూ శాఖే తేల్చాలి
సర్టీఫికెట్లు చూపించాలని ఉపాధ్యాయులను అడిగితే కేసులు పెడతాం
అసలు జరగని టోర్నమెంట్‌లో.. సర్టీఫికెట్లు తెచ్చిన వారికి టీచర్ ఉద్యోగాలు ఎలా ఇచ్చారంటే మౌనమే సమాధానం
సాక్షి, అమరావతి: మెగా డీఎస్సీ 2025 అక్రమాలను కప్పిపుచ్చేందుకు చంద్రబాబు సర్కారు నానా తంటాలు పడుతోంది. అక్రమాల మయంగా మారిన నియామక ప్రక్రియలో రోజుకో కొత్త కోణం వెలుగులోకి రావడం.. స్పోర్ట్స్ కోటా ముసుగులో ఇష్టారాజ్యంగా జీవోలు.. ప్రతిభ, పారదర్శకతకు పాతర.. బాధిత అభ్యర్థులు తమకు జరిగిన అన్యాయాన్ని ఒక్కొక్కరుగా బహిర్గతం చేయడం.. విద్యాశాఖ మంత్రి లోకేష్ తక్షణమే రాజీనామా చేయడంతోపాటు సీబీఐ విచారణకు ఆదేశించాలనే డిమాండ్ సర్వత్రా వినిపిస్తుండటంతో బాబు సర్కారు కట్టు కథలు వినిపిస్తోంది.
సర్టీఫికెట్లు చూపించాలని అడిగితే కేసులు పెడతామంటూ బెదిరింపులకు దిగింది. ఉన్నతాధికారులను రంగంలోకి దించి తప్పులను కప్పిపుచ్చే యత్నం చేస్తోంది. ఇందులో భాగంగానే పాఠశాల విద్యాశాఖ కమిషనర్ తమీమ్ అన్సారియా, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (శాప్) వైస్ చైర్మన్ ఎస్.భరణి సోమవారం సచివాలయంలో మీడియాతో మాట్లాడారు. డీఎస్సీ కుంభకోణంపై వరుసగా వస్తున్న కథనాల్లో వాస్తవం లేదంటూనే, జూడో అసోసియేషన్ ఇచ్చిన ప్రతి సర్టీఫికెట్‌పైనా విచారణ జరుగుతుందని చెప్పారు. తద్వారా తప్పిదాలను పరోక్షంగా అంగీకరించారు! ముఖ్యంగా కర్నూలుకు చెందిన టీచర్ ప్రభాకర్‌పై వచ్చిన ఆరోపణల్లో కొంత గందరగోళం ఉందని, విచారణకు త్రిసభ్య కమిటీని నియమించామని చెప్పడం గమనార్హం.
మాట్లాడుతున్న భరణి, అన్సారియా
అసోసియేషన్లు చెప్పిందే వేదం..!
స్పోర్ట్స్ అసోసియేషన్లు జారీ చేసిన సర్టీఫికెట్ల ఆధారంగానే అభ్యర్థుల అర్హతలను పరిగణించినట్లు శాప్ వైస్ చైర్మన్ భరణి పేర్కొన్నారు. సర్టీఫికెట్లను పూర్తిస్థాయిలో పరిశీలించే అధికారం, వ్యవస్థ తమ పరిధిలో లేదని ఆమె చెప్పడం గమనార్హం. సాధారణంగా అసోసియేషన్లు జారీ చేసే ధ్రువపత్రాలను ఒరిజినల్‌గానే భావిస్తామని ఆమె స్పష్టం చేశారు.
అంటే.. టీడీపీ ఎమ్మెల్యే కూన రవికుమార్ అధ్యక్షుడిగా ఉన్న అసోసియేషన్‌కు కనీసం గుర్తింపు లేకపోయినా, నిబంధనల ప్రకారం అసోసియేషన్ సెక్రటరీ మాత్రమే అభ్యర్ధుల ధృవీకరణ లేఖపై సంతకం చేయాల్సి ఉన్నా, కూన సంతకం ఆధారంగా ఉద్యోగాలు ఇచ్చేస్తారా? అని మీడియా ప్రశ్నించగా.. కూన రవికుమార్‌ను తాము ఎమ్మెల్యేగా చూడటం లేదని, అసోసియేషన్ అధ్యక్షుడిగానే చూస్తున్నామని, ఆయన సంతకాన్ని ఆమోదించాలని ఫెడరేషన్ చెప్పిందని భరణి పేర్కొన్నారు.
అభ్యర్థి పెద అప్పలరాజు తన సర్టిఫికెట్లను ఆన్‌లైన్‌లో తప్పుగా అప్‌లోడ్ చేశారని, ఆయన సర్టిఫికెట్‌తో పాటు సోదరుడి సర్టీఫికెట్ కూడా ఇచ్చారని, ఇది కేవలం మానవ తప్పిదమని వెనకేసుకొచ్చారు. భార్యాభర్తలకు ఉద్యోగాలు రాకూడదా? 41 ఏళ్లు ఉన్న వారికి ఉద్యోగం ఇవ్వకూడదా? అని ప్రశ్నించారు. ఎలాంటి మార్కులు రాకపోయినా, స్పోర్ట్స్ మెరిట్ ఉంటే ఉద్యోగాలిస్తామని చెప్పారు.
జరగని టోర్నమెంట్‌పై దాటవేత..
‘ఖమ్మంలో టోర్నమెంట్ జరిగిందంటూ జూడో సర్టీఫికెట్లతో వచ్చిన నలుగురు అభ్యర్ధులకు ఉద్యోగాలిచ్చారు. కానీ అక్కడ అసలు ఆ టోర్నమెంట్ జరగలేదు. జరగని టోర్నమెంట్‌లో పాల్గొని, సర్టీఫికెట్లు ఎలా తెచ్చారని విచారణ జరిపారా?’ అని ప్రశ్నించగా.. ఈ అంశం న్యాయస్థానం పరిధిలో ఉన్నందున తాము ఏమీ మాట్లాడలేమని భరణి సమాధానం దాటవేశారు. 372 సర్టీఫికెట్లపై విచారణ చేయడం సాధ్యం కాదన్నారు.
సర్టీఫికెట్లు ఇచ్చేది మేం కాదు.. కేసులు పెడతాం!
టీచర్లందరికీ టెట్ తప్పనిసరి అని అన్సారియా స్పష్టం చేశారు. వల్లూరులో టీచర్‌గా నియమించిన ప్రభాకర్ టెట్‌లో అర్హత సాధించలేదు కదా? అని ప్రశ్నించగా.. టెట్ ఎన్నిసార్లయినా రాయవచ్చని, అతడు ఒకసారి రాసినప్పుడు 77 మార్కులతో అర్హత సాధించాడని, అయినప్పటికీ కమిటీ నివేదిక ఆధారంగా నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. కర్నూలులో ఉష అనే ఉపాధ్యాయురాలు టెట్‌లో తెలుగు సబ్జెక్ట్‌లో అర్హత సాధించలేదు. అలాంటప్పుడు ఆమెకు ఉద్యోగం ఎలా ఇచ్చారన్న ప్రశ్నకు స్పందిస్తూ.. ఏ సబ్జెక్ట్ బోధించే టీచర్ ఆ సబ్జెక్టులో టెట్ అర్హత సాధించాల్సిన అవసరం లేదని అన్సారియా పేర్కొన్నారు. ‘ఈడబ్ల్యూఎస్ సర్టీఫికెట్లలో చాలా వరకూ ఫేక్ అని ఇప్పటికే రుజువైంది.
ఆర్థికంగా బలంగా ఉన్నవారికి కూడా ఇచ్చి వాటి ఆధారంగా డీఎస్సీలో ఉద్యోగాలు కట్టబెట్టారు..’ అనే ప్రశ్నలపై అన్సారియా దాటవేత ధోరణి ప్రదర్శించారు. ఆ అంశం తమ పరిధిలోనిది కాదన్నారు. సర్టిఫికెట్లు ఇచ్చేది తహసీల్దార్లు కాబట్టి రెవెన్యూ విభాగానికి చెప్పి విచారణ చేయిస్తామంటూ తప్పించుకున్నారు. స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు పొందిన 372 మందికి ఫోన్లు చేసి సర్టీఫికెట్లు చూపించాలని అడుగుతున్నారని, అలా ఎవరైనా అడిగితే వారిపై చర్యలు తీసుకుంటామని అన్సారియా హెచ్చరించారు. కుప్పంలో ఇలాంటి ఘటన జరిగితే 24 గంటల్లోనే ఓ విలేకరి, కెమెరామెన్‌పై కేసు నమోదు చేశామన్నారు.


