సాక్షి,అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం డీఎస్సీ ద్వారా చేపట్టిన ఉపాధ్యాయ నియామకాల్లో అవకతవకలకు సంబంధించి రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తోంది. ముఖ్యంగా స్పోర్ట్స్ కోటాలో బయటపడుతున్న అక్రమాలు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాయి. ఈ క్రమంలో డీఎస్సీలో అక్రమాలు జరిగినట్లు ప్రభుత్వం అంగీకరించింది జూడో సర్టిఫికెట్లపై విజిలెన్స్ విచారణ చేపడుతున్నట్లు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (శాప్ - SAAP) ప్రకటించింది.
ఈ వివాదంపై శాప్ వైస్ చైర్మన్ భరణి స్పందిస్తూ కీలక విషయాలు వెల్లడించారు. ‘స్పోర్ట్స్ సర్టిఫికెట్ల పూర్తి స్థాయి పరిశీలన మా పరిధిలో సాధ్యం కాదు. స్పోర్ట్స్ అసోసియేషన్లు జారీ చేసే సర్టిఫికెట్లను మేము ప్రాథమికంగా ఒరిజినల్‌గానే భావిస్తాము’ అని స్పష్టం చేశారు. అయినప్పటికీ, అక్రమాల ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో చర్యలు వేగవంతం చేశామని తెలిపారు. కర్నూలుకు చెందిన ఉపాధ్యాయుడు ప్రభాకర్‌పై వస్తున్న ఆరోపణలపై ప్రస్తుతం విచారణ జరుగుతోందని చెప్పారు.
మరోవైపు, స్కూల్ ఎడ్యుకేషన్ కమిషనర్ అన్సారియా ఆదేశాల మేరకు ముగ్గురు సభ్యులతో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసి విచారణ జరుపుతున్నామని, ఆ నివేదిక రాగానే తగిన నిర్ణయం తీసుకుంటామని శాప్ వైస్ చైర్మన్ భరణి వెల్లడించారు.


