సాక్షి, వైఎస్సార్ జిల్లా: ఏపీలో నిర్వహించిన మెగా డీఎస్సీలో మరో భాగోతం బయటపడింది. వైఎస్సార్ జిల్లాలో తప్పుడు కుల ధృవీకరణతో ఉద్యోగం పొందిన రసూల్‌పై చర్యలు తీసుకోకపోవడంపై సర్వత్రా నిరసన వ్యక్తమవుతోంది. రసూల్ తప్పుడు కుల దృవీకరణ పెట్టాడని బద్వేలు ఆర్డీవో చంద్ర మోహన్ తేల్చడంతో రసూల్ బండారం బయపడింది. దీనికి సంబంధించిన విచారణ నివేదికను ఆర్డీవో.. కలెక్టర్‌కు పంపారు.
అయితే ఆ నివేదికను కూటమి ప్రభుత్వం తొక్కిపెట్టింది. అయితే ‘సాక్షి’ చేతికి ఆర్డీవో విచారణ రిపోర్ట్ చిక్కింది. నకిలీ కుల ధృవీకరణతో రసూల్ ఉద్యోగం పొందాడని స్పష్టంగా ఆ రిపోర్ట్ తెలియజేస్తున్నది. దీంతో రసూల్‌ను జిల్లా అధికారులు కాపాడుతున్నారని తెలియవస్తోంది. రసూల్ నకిలీ కుల ధృవీకరణతో తనకు రావాల్సిన ఉద్యోగాన్ని కొట్టేశాడని జమీల్ ఫిర్యాదు చేశారు. 2008, 2012, 2018 డీఎస్సీలలో బీసీ ఈ సరిఫికేట్ రసూల్ పెట్టాడని తేలింది. అయితే 2025 మెగా డీఎస్సీలో మాత్రం తాను ఓసీ ఈడబ్ల్యూఎస్‌గా రసూల్ నమోదు చేసుకున్నాడు. దీంతో జమీల్ కు రావాల్సిన ఉద్యోగం రసూల్‌కి దక్కింది.
జమీల్ పిర్యాదుపై విచారణకు జిల్లా అధికారులు ఆదేశించారు. విచారణలో స్పష్టంగా తప్పుడు సర్టిఫికెట్ పెట్టాడని రుజువైంది. అయితే తాను ఆర్ధిక స్థితిని తెలిపేందుకే ఓసీ ఈడబ్ల్యూఎస్ ఇచ్చానని తహసీల్దార్ తెలిపారు. ఆయన ఇచ్చిన సర్టిఫికెట్‌ను అక్రమంగా మెగా డీఎస్సీ కి వాడారని ఆర్డీవో చంద్ర మోహన్ నివేదిక తేల్చి చెప్పింది. ఈ నేపథ్యంలో తదుపరి చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌కు ఆర్డీవో చంద్ర మోహన్ ఈ నివేదిక పంపారు. డిసెంబర్ 2025లో నివేదిక సమర్పిచినప్పటికీ ఇప్పటి వరకు చర్యలు తీసుకోలేదు. దీంతో ఇప్పటికీ సుండుపల్లి మండలంలో రసూల్ ఉద్యోగం చేస్తుండటంతో విద్యార్థులు,స్థానికులు నిరసన వ్యక్తం చేస్తున్నారు.
ఇది కూడా చదవండి: కూటమి ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదా?: మాజీ మంత్రి శైలజానాథ్


