ఖరీఫ్ ఆశలు ఆవిరి.. సెప్టెంబర్‌లోనూ లోటు వర్షపాతమే
జాతీయ స్థాయిలో 14 శాతం లోటు వర్షపాతం
ఏపీలో మాత్రం అత్యధికంగా 54.73 శాతం లోటు
నీరులేక ఎండుతున్న పంటలు
కరువు మండలాలను ప్రకటించని చంద్రబాబు ప్రభుత్వం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో చినుకు జాడలేక వ్యవసాయ క్షేత్రాల్లో కాడి కదలడం లేదు. తీవ్రమైన కరువు ప్రభావానికి చంద్రబాబు సర్కారు నిర్లక్ష్యం తోడవడంతో రైతులు ఖరీఫ్‌పై ఆశలు వదులుకుంటున్నారు. పనుల్లేక వ్యవసాయ కూలీలు బలైపోతున్నారు. సీజన్ చివరి దశకు చేరుకున్న తరుణంలోనూ వరుణుడు కరుణించకపోవడంతో ఖరీఫ్ ముందుకు సాగని పరిస్థితి నెలకొంది. పచ్చని పైరుతో కళకళలాడాల్సిన పొలాలు చినుకు జాడలేక నెర్రలు తీస్తున్నాయి. సాగైన పంటలు సైతం ఆరు తడుల్లేక నిలువునా ఎండిపోతున్నాయి. అప్పులు చేసి ఎకరాకు రూ.15 వేల నుంచి రూ.25 వేల వరకు పెట్టిన పెట్టుబడులు కళ్లెదుటే ఆవిరైపోతుండటంతో రైతన్నలు గుండెలవిసేలా రోదిస్తున్నారు. పరిస్థితి ఇంత దయనీయంగా ఉన్నా ప్రభుత్వంలో చలనం లేదు. ప్రత్యామ్నాయ పంటల ప్రణాళిక లేదు. కరువు మండలాల ప్రకటన లేదు. ప్రత్యేక కరువు ప్యాకేజీ ఊసు కూడా లేకపోవడంతో రైతులు, కూలీల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైంది.
ఏపీలోనే లోటు తీవ్రం
జాతీయ స్థాయిలో 14 శాతం లోటు వర్షపాతం నమోదు కాగా.. ఏపీలో మాత్రం రికార్డు స్థాయిలో 54.73 శాతంగా నమోదైంది. దేశంలో మరే ఇతర రాష్ట్రాల్లోనూ లేనివిధంగా ఏపీలో 28 జిల్లాల్లో లోటు వర్షపాతం నమోదైంది. 11 జిల్లాల్లో 50–59 శాతం మధ్య, 10 జిల్లాల్లో 40–49 శాతం మధ్య, ఐదు జిల్లాల్లో 60 శాతం లోటు వర్షపాతం నమోదుకాగా.. నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో 30–39 శాతం మధ్య లోటు వర్షపాతం నమోదైంది. రిజర్వాయర్లు అడుగంటడంతో రైతులు కోలుకునే పరిస్థితి కనిపించడం లేదు. మరోవైపు భూగర్భ జలాలు కూడా అడుగంటిపోయాయి. భూమిలో తేమ శాతం మచ్చుకైనా కనిపించడం లేదు.
సాగు దయనీయం
జాతీయ స్థాయిలో 102.38 శాతం విస్తీర్ణంలో పంటలు సాగవుతుండగా.. తెలంగాణలో 91.84 శాతం విస్తీర్ణంలో ఖరీఫ్ పంటలు వేశారు. ఏపీలో ఖరీఫ్ సాధారణ విస్తీర్ణం 77.10 లక్షల ఎకరాలు కాగా.. ఈ ఏడాది కనీసం 80 లక్షల ఎకరాల్లో సాగు చేయాలని లక్ష్యంగా నిర్దేశించారు. కానీ సీజన్ ప్రారంభమై దాదాపు 100 రోజులు దాటినా సాధారణ విస్తీర్ణంలో 69 శాతం విస్తీర్ణంలో కూడా వరి సాగు చేయని పరిస్థితి నెలకొంది. పప్పుధాన్యాలు 82 శాతం, పత్తి 79 శాతం, మొక్కజొన్న 65 శాతం, వేరుశనగ కనిష్టంగా 37 శాతం విస్తీర్ణంలో మాత్రమే సాగైంది. మరో 3 వారాల్లో ఖరీఫ్ సీజన్ పూర్తి కానుంది. అయినా ఈసారి 75 శాతం కూడా దాటే పరిస్థితి కనిపించడం లేదు.
జిల్లాల్లో ఇదీ పరిస్థితి
ఖరీఫ్‌లో ఇప్పటివరకు 52.84 లక్షల ఎకరాల్లో పంటలు వేయగా.. కేవలం నాలుగు జిల్లాల్లోనే 20 లక్షల ఎకరాల్లో సాగైంది. అనకాపల్లి, ప్రకాశం, అన్నమయ్య, పోలవరం, మార్కాపురం, చిత్తూరు జిల్లాల్లో సాధారణ విస్తీర్ణంలో 30 శాతానికి మించి పంటలు సాగవలేదు. ఆ తర్వాత విశాఖలో 35, వైఎస్సార్ కడపలో 38, పల్నాడులో 44, బాపట్లలో 47 శాతానికి మించి సాగవని పరిస్థితి. అత్యధికంగా కర్నూలులో 8.13 లక్షల ఎకరాలు, అనంతపురంలో 5.41 లక్షల ఎకరాలు, నంద్యాలలో 3.8 లక్షల ఎకరాలు, శ్రీసత్యసాయి జిల్లాలో 2.57 లక్షల ఎకరాల్లో సాగు జరిగింది. ఇవన్నీ వర్షాధారంగా సాగు చేసిన మెట్ట పంటలే. ఈ 4 జిల్లాల్లో తీవ్ర వర్షాభావ పరిస్థితులతో పంటలు తీవ్రంగా దెబ్బతింటున్నాయి. ఇప్పటికే దాదాపు 50–60 శాతం విస్తీర్ణంలో పంటలు ఎండిపోయాయి. దాదాపు రూ.2వే ల కోట్లకు పైగా పెట్టుబడులు ఆవిరైపోయినట్టు అంచనా. మరోవైపు కృష్టా, గోదావరి డెల్టాల్లోనూ పరిస్థితి దారుణంగానే ఉంది.


