కానిస్టేబుల్‌ పాసింగ్‌ అవుట్‌ పరేడ్‌ వాయిదా | Constable passing out parade postponed | Sakshi
Sakshi News home page

కానిస్టేబుల్‌ పాసింగ్‌ అవుట్‌ పరేడ్‌ వాయిదా

Sep 7 2026 5:23 AM | Updated on Sep 7 2026 5:23 AM

Constable passing out parade postponed

పీవోపీ కోసం సీనియర్‌ అధికారులను అతిథులుగా నియమిస్తూ తొలుత డీజీపీ మెమో

తమ పిల్లలను ఖాకీ దుస్తుల్లో చూసేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్న తల్లిదండ్రులు

నేడు జరగాల్సిన పీవోపీ ఆఖరి నిమిషంలో వాయిదాపై సోషల్‌ మీడియాలో తీవ్ర విమర్శలు

6,100 కానిస్టేబుళ్ల రిక్రూట్‌మెంట్‌కు గత ప్రభుత్వంలోనే నోటిఫికేషన్, ఫిజికల్, రన్నింగ్‌ టెస్టులు పూర్తి

బాబు సర్కారు రాగానే 2022 నోటిఫికేషన్‌ రివైజ్‌ చేస్తూ 2025లో మరో జీవో విడుదల

3 శాతం స్పోర్ట్స్‌ కోటాతోపాటు క్రీడల సంఖ్య 20 నుంచి 67కు పెంచుతూ ఉత్తర్వులు

ఇంటర్‌ యూనివర్శిటీ, జోనల్‌ స్థాయిలో గెలుపు కాకుండా.. పాల్గొన్నా అర్హతగా నిర్ణయిస్తూ జీవో

స్పోర్ట్స్‌ కోటా 183 పోస్టులలో 150కి పైగా పోస్టులు యువగళం టీమ్‌కే దక్కినట్లు ఆరోపణలు

సాక్షి ప్రత్యేక ప్రతినిధి, అమరావతి బ్యూరో: రాష్ట్రవ్యాప్తంగా శిక్షణ పూర్తి చేసుకున్న వేల మంది కానిస్టేబుళ్ల పాసింగ్‌ అవుట్‌ పరేడ్‌ను చంద్రబాబు సర్కారు చివరి నిమిషంలో హఠాత్తుగా వాయిదా వేయడంపై పలు అనుమానాలు ముసురుకుంటున్నాయి. శిక్షణ ముగిసిన కానిస్టేబుళ్లకు ఈనెల 7వ తేదీన పాసింగ్‌ అవుట్‌ పరేడ్‌ నిర్వహించనున్నట్లు తొలుత డీజీపీ మెమో కూడా జారీ చేశారు. అయితే ఆకస్మికంగా దీన్ని వాయిదా వేస్తూ తాజాగా నిర్ణయం తీసుకోవడం వెనుక మతలబు ఏమిటనే చర్చ సర్వత్రా జరుగుతోంది. దీనికోసం సన్నద్ధమైన అభ్యర్థులు, వారి తల్లితండ్రులు ప్రభుత్వం తీరుపై తీవ్రంగా మండిపడుతున్నారు. 

గత ప్రభుత్వంలోనే నోటిఫికేషన్‌.. ఫిజికల్‌ టెస్టులు
రాష్ట్రవ్యాప్తంగా 6,100 కానిస్టేబుళ్ల రిక్రూట్‌మెంట్‌ కోసం 2022 నవంబర్‌ 28న మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం నోటిఫికేషన్‌ జారీ చేసింది. అప్పట్లోనే అభ్యర్థులందరికీ ఫిజికల్‌ టెస్టులు, పరుగు పందెం పకడ్బందీగా నిర్వహించారు. ఈ క్రమంలో నిరుద్యోగ జేఏసీ పేరుతో ఎస్‌.హేమంత్‌కుమార్‌ కోర్టులో కేసు వేయడంతో రాతపరీక్ష నిలిచిపోయింది. అనంతరం టీడీపీ కూటమి సర్కారు అధికారంలోకి రాగా 2025 జూన్‌ 1న రాత పరీక్ష నిర్వహించారు. అర్హత సాధించిన వారికి రాష్ట్రవ్యాప్తంగా పీటీసీ, డీటీసీలు ఉన్న 21 ప్రాంతాల్లో 9 నెలల పాటు శిక్షణ కూడా పూరై్తంది. 5,757 మందికి శిక్షణ పూర్తి కాగా పాసింగ్‌ అవుట్‌ పెరేడ్‌ నిర్వహించేందుకు డీజీపీ మెమో కూడా ఇచ్చారు. ఈ కార్యక్రమానికి సీనియర్‌ ఐపీఎస్‌లను ముఖ్య అతిథులుగా ఆహ్వానిస్తూ మెమోలో వారి పేర్లు కూడా పేర్కొన్నారు.

క్రెడిట్‌ చోరీ కోసం పరేడ్‌ రద్దు..!
గత ప్రభుత్వంలోనే రిక్రూట్‌మెంట్‌ నోటిఫికేషన్‌ వెలువడి రాత పరీక్ష మినహా కీలక దశలు పూర్తయిన కానిస్టేబుల్‌ పోస్టుల భర్తీ ప్రక్రియలోనూ క్రెడిట్‌ చోరీకి చంద్రబాబు సర్కారు తాపత్రయపడుతోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాత పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులందరినీ గతంలో మంగళగిరిలోని ఏపీఎస్‌పీ 6వ బెటాలియన్‌కు రప్పించి సీఎం చంద్రబాబు హడావుడి చేశారు. తాజాగా ఎక్కడికక్కడ పీవోపీ (పాసింగ్‌ అవుట్‌ పరేడ్‌) నిర్వహించేందుకు డీజీపీ ఉత్తర్వులు జారీ చేయడంతో 21 సెంటర్లలో ఏర్పాట్లు జరిగాయి. అయితే పీవోపీని వాయిదా వేస్తూ ఈ నెల 4న చంద్రబాబు సర్కారు ఆకస్మికంగా నిర్ణయం తీసుకుంది. మళ్లీ ఎప్పుడు నిర్వహిస్తారో ప్రకటించలేదు. అభ్యర్థులందరినీ మరోసారి మంగళగిరికి పిలిపించి ముఖ్యమంత్రి సమక్షంలో పాసింగ్‌ అవుట్‌ పెరేడ్‌ నిర్వహించాలనే యోచనతో వాయిదా వేసినట్లు పోలీసు అధికారులు చర్చించుకుంటున్నారు. ముఖ్యమంత్రి సూచనలతో హోంమంత్రి అనిత ఈ కార్యక్రమాన్ని వాయిదా వేసినట్లు తెలుస్తోంది.

మండిపడుతున్న అభ్యర్థులు, తల్లిదండ్రులు..
నేడు జరగాల్సిన పరేడ్‌ ఆకస్మికంగా రద్దుపై సోషల్‌ మీడియాలో తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కానిస్టేబుళ్లుగా ఎంపికైన వారిలో ఎక్కువ మంది పేద వర్గాలకు చెందిన వారే ఉన్నారు. తమ పిల్లలు ప్రభుత్వ ఉద్యోగం సాధించడం, ఖాకీ దుస్తులు ధరించటాన్ని కళ్లారా చూడాలని ఆరాటంతో ఎంతోమంది టిక్కెట్లు బుక్‌ చేసుకుని హోటళ్లు రిజర్వేషన్‌ కూడా చేసుకున్నారు. దీనికోసం ఇతర కార్యక్రమాలన్నీ వాయిదా వేసుకున్నారు. ఈ  తరుణంలో హఠాత్తుగా పీవోపీ వాయిదా వేయడంతో హతాశులయ్యారు. ‘నోటిఫికేషన్‌ ఇచ్చింది గత ప్రభుత్వం.. ఇప్పటికే ఒకసారి అందరం సీఎం కోసం మంగళగిరి వచ్చాం. మళ్లీ ఈ పబ్లిసిటీ పిచ్చి ఏమిటి?’ అని పోస్టులు పెడుతూ మండిపడుతున్నారు.

కానిస్టేబుల్‌ రిక్రూట్‌మెంట్‌లో యువగళం కోటా?
అకస్మాత్తుగా పాసింగ్‌ అవుట్‌ పరేడ్‌ వాయిదా వేయడంపై అటు పోలీసు వర్గాలతోపాటు ఇటు టీడీపీ ప్రజాప్రతినిధుల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. మెగా డీఎస్సీ తరహాలోనే ఇందులో కూడా అర్హత లేనివారికి యువగళం కోటా కింద అవకాశం కల్పించారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. దీనికి నిదర్శనంగా పలు అంశాలను ఉదహరిస్తున్నారు. మచ్చుకు అందులో కొన్ని ఇలా ఉన్నాయి..

కానిస్టేబుల్‌ పోస్టుల భర్తీకి 2022లో జారీ అయిన నోటిఫికేషన్‌ను చంద్రబాబు ప్రభుత్వం రాగానే రివైజ్‌ చేసింది. స్పోర్ట్స్‌ కోటాలో 20 క్రీడలు మాత్రమే ఉంటే అదనంగా మరో 47 ఆటలను చేర్చి మొత్తం 67 గేమ్స్‌లో పాల్గొన్నవారికి రాతపరీక్ష లేకుండా నేరుగా రిక్రూట్‌ చేసేలా నిర్ణయం తీసుకుంది.

⇒ స్పోర్ట్స్‌ కోటాలో 3 శాతం ఉద్యోగాలు ఇవ్వాలని చంద్రబాబు సర్కారు జీవో జారీ చేసింది. కేటగిరీ ఏ, బీ, సీ పేరుతో అర్హతలను మూడు విభాగాలుగా విభజించింది. కేటగిరీ – ఏలో అంతర్జాతీయ స్థాయిలో గెలిచిన లేదా పాల్గొన్నవారు, కేటగిరీలో–బీలో జాతీయస్థాయిలో ఆడిన వారు, జాతీయస్థాయిలో యూనివర్శిటీ పరిధిలో, స్కూలు గేమ్స్‌లో గెలుపొందిన, పాల్గొన్నవారిని చేర్చింది. కేటగిరీ– సీలో జోనల్‌స్థాయిలో యూనివర్శిటీ టోర్నమెంట్‌లో గెలుపొందిన లేదా పాల్గొన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొంది.

⇒ మొత్తం 6,100 కానిస్టేబుల్‌ పోస్టులకుగానూ 3 శాతం అంటే 183 ఉద్యోగాలను స్పోర్ట్స్‌ కోటాలో చంద్రబాబు సర్కారు భర్తీ చేసింది.

⇒ గేమ్స్‌ కోటాను ఏకంగా 67 క్రీడలకు పెంచడం... యూనివర్శిటీ స్థాయిలో పాల్గొన్నవారు కూడా అర్హత సాధించటాన్ని చూస్తుంటే, యువగళం టీమ్‌ కోసం ఫేక్‌ సర్టిఫికెట్లు సృష్టించారా? మెగా డీఎస్సీలో ఎలాంటి కుంభకోణం జరిగిందో అచ్చం అదే తంతు పోలీసు కానిస్టేబుల్‌ రిక్రూట్‌మెంట్‌లోనూ చోటు చేసుకుందా? అని పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement