కొత్తవి ఇద్దామా.. వద్దా! బాబు పెన్షన్‌.. అర్హుల్లో టెన్షన్‌ | Chandrababu Govt: Portal closed without even chance to apply new pensions | Sakshi
Sakshi News home page

కొత్తవి ఇద్దామా.. వద్దా! బాబు పెన్షన్‌.. అర్హుల్లో టెన్షన్‌

Sep 7 2026 5:17 AM | Updated on Sep 7 2026 5:17 AM

Chandrababu Govt: Portal closed without even chance to apply new pensions

రెండేళ్లుగా మానవత్వం మరిచి అవ్వా తాతలను ఏడిపిస్తున్న సర్కార్‌.. 

కొత్త పింఛన్లకు కనీసం దరఖాస్తు చాన్స్‌ కూడా లేకుండా పోర్టల్‌ బంద్‌

అవకాశం ఇచ్చామని చెప్పుకునేందుకు నేటి నుంచి సచివాలయాల్లో దరఖాస్తుల స్వీకరణ  

అది కూడా కేవలం ఏడు పని దినాలు మాత్రమే అవకాశం

ఎంపీడీవోలకు మంజూరు అధికారం తొలగింపు 

ప్రతి పింఛన్‌... రాష్ట్ర స్థాయిలోనే మంజూరు 

మరి మంజూరైన పింఛన్లకు డబ్బులు ఎప్పుడిస్తారన్న దానిపై స్పష్టత కరువు

నిధుల లభ్యత, బడ్జెట్‌ విడుదలను బట్టి ఆధారపడి ఉంటుందని మెలిక 

చంద్రబాబు వచ్చాక ఇప్పటికే ఉన్న పింఛన్లలో 6.42 లక్షలకుపైగా తగ్గుదల 

ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన 50 ఏళ్లకే పింఛన్‌ హామీకి మంగళం 

నాడు వైఎస్‌ జగన్‌ ప్రభుత్వంలో అర్హుల నుంచి నిరంతరం దరఖాస్తుల స్వీకరణ, మంజూరు  

బాబు సర్కార్‌ది స్థానిక ఎన్నికల స్టంట్‌ అంటూ రాజకీయ విశ్లేషకుల విమర్శ

సాక్షి, అమరావతి: చంద్రబాబు సర్కారు అవ్వాతాతలు, వితంతువులు, దివ్యాంగులు, పేదల సంక్షేమం పూర్తిగా విస్మరించిందనే విమర్శలు వెల్లువెత్తుతుండటంతో దరఖాస్తుకు అవకాశం ఇచ్చామని చెప్పుకునేందుకు సరికొత్త డ్రామాకు తెరలేపింది. దరఖాస్తులు స్వీకరిస్తున్నామంటూనే కొర్రీలు వేస్తోంది. కేవలం వారం రోజులే గడువు ఇవ్వడం ఇందుకు నిదర్శనమని అధికార వర్గాల్లో చర్చ నడుస్తోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అర్హులు కనీసం కొత్త పింఛన్ల మంజూరుకు దరఖాస్తు కూడా చేసుకునే వీలు లేకుండా ఆన్‌లైన్‌ పోర్టల్‌ను మూసివేసి నిర్దాక్షిణ్యంగా వ్యవహరించింది. రెండేళ్లుగా మానవత్వం అనేది మరిచిపోయి పింఛన్లను ఎడాపెడా ఏరివేసిన బాబు సర్కారుపై తీవ్ర విమర్శలు, ఆగ్రహావేశాలు వెల్లువెత్తుతుండటంతో ఇప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో తూతూమంత్రంగా ప్రక్రియను ముగించేందుకు సిద్ధమైంది. గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా ఈ నెల 7వ తేదీ నుంచి 16వ తేదీ వరకు కేవలం ఏడు పని దినాల్లో మాత్రమే కొత్త పింఛన్ల దరఖాస్తుల స్వీకరణ, ఆన్‌లైన్‌ నమోదు, ఈ కేవైసీ ప్రక్రియకు అనుమతిస్తూ ప్రభుత్వం ఆదివారం మెమో జారీ చేసింది. అయితే దరఖాస్తు చేసుకున్న వారికి పింఛన్లు మంజూరు చేస్తే.. ఎప్పటి నుంచి డబ్బులు పంపిణీ చేస్తారనే విషయాన్ని అందులో స్పష్టంగా ప్రస్తావించకపోవడం గమనార్హం. ప్రభుత్వానికి నిధుల లభ్యత, బడ్జెట్‌ విడుదలను బట్టి కొత్త పింఛన్ల మంజూరు, డబ్బుల విడుదల ఆధారపడి ఉంటుందని మెలిక పెట్టింది. దరఖాస్తు తేదీ నుంచి గానీ అర్హత పొందిన తేదీ నుంచి గానీ పింఛన్‌ డబ్బుల చెల్లింపు ఉండదని స్పష్టం చేసింది. ఇంత హడావుడిగా పింఛన్ల మంజూరు ప్రక్రియ మొదలెట్టడం చూస్తుంటే.. ఇదంతా స్థానిక ఎన్నికల స్టంట్‌ అని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు.  

ఎంపీడీవోలకు అధికారం తొలగింపు.. 
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో అవ్వాతాతలు, వితంతు, దివ్యాంగ తదితర పింఛన్లు మంజూరు అధికారం స్థానిక ఎంపీడీవోలకే ఉండగా.. ప్రస్తుతం చంద్రబాబు ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాల్లో ఎంపీడీవోలకు ఆ అధికారాన్ని తొలగిస్తున్నట్లు పేర్కొంది. ఎంపీడీవోలు కొత్తగా ఎటువంటి పింఛన్లు అయినా సరే మంజూరు చేయకూడదంటూ ప్రభుత్వం ఆ ఆదేశాల్లో స్పష్టంగా పేర్కొంది. ఎంపీడీవోలు గానీ మున్సిపల్‌ కమిషనర్లు గానీ కేవలం పింఛనుదారుడి అర్హతను పేర్కొంటూ కేవలం సిఫార్సు మాత్రమే చేయాలంటూ ఆదేశాల్లో స్పష్టం చేసింది. ఆయా పింఛన్‌ దరఖాస్తులను రాష్ట్ర స్థాయిలో గ్రామ, వార్డు సచివాలయ శాఖ, ఆర్‌టీజీఎస్, సెర్ప్‌ పూర్తి స్థాయిలో పరిశీలించిన అనంతరం తుది ఆమోదం తెలపాలని పేర్కొంది.  

6.42 లక్షలకుపైగా తగ్గిన పింఛన్లు... 
మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ హయాంలో దేశంలో మరే రాష్ట్రంలోనూ లేని విధంగా అత్యధికంగా 66,34,742 మంది లబ్ధిదారులకు పింఛన్లు ఇచ్చారు. సాధారణంగా పెన్షన్ల సంఖ్య ఏటా పెరగాలి. కానీ చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక దీనికి విరుద్ధంగా పింఛన్ల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. ఈ ఏడాది సెప్టెంబరులో 1 నుంచి 3 తేదీ మధ్య రాష్ట్రంలో కేవలం 59,91,857 మందికి మాత్రమే పింఛన్ల డబ్బుల పంపిణీ జరిగింది. అంటే గత ప్రభుత్వంతో పోలిస్తే పింఛన్ల సంఖ్య తాజాగా ఏకంగా 6.42 లక్షలకుపైగా తగ్గిపోవడం గమనార్హం. ఇక లక్ష మందికిపైగా దివ్యాంగులపై బాబు సర్కారు అనర్హత కత్తిని వేలాడదీసింది. మరోవైపు 2019–24 మధ్య వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం 29.51 లక్షల కొత్త పింఛన్లు మంజూరు చేసినట్లు పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని పర్యవేక్షించే గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే.  
 
50 ఏళ్లకే పింఛన్ల హామీ ఏమైంది? 
మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం తెచ్చిన నిబంధనల ప్రకారం 60 ఏళ్ల నిండిన పేదలు వృద్ధాప్య పింఛను పొందేందుకు అర్హులు. రాష్ట్రంలో రెండేళ్లుగా అన్ని అర్హతలున్న లక్షల మంది కొత్త పింఛన్ల మంజూరు కోసం పడిగాపులు కాస్తున్నా చంద్రబాబు సర్కారు మొర ఆలకించలేదు. ఇప్పటి వరకు పింఛన్లు పొందని పేద కుటుంబాల్లో వితంతువులు సైతం కొత్త పింఛన్ల కోసం ఆశగా నిరీక్షిస్తున్నారు. తాజాగా స్థానిక సంస్థల ఎన్నికల భయంతో తూతూమంత్రంగా దరఖాస్తుల ప్రక్రియను ముగించేందుకు సన్నద్ధమైంది. హడావుడిగా కేవలం ఏడు పనిదినాలు మాత్రమే దరఖాస్తుల నమోదుకు అవకాశం కల్పించడంపై అధికార వర్గాలోనే చర్చ సాగుతోంది. ఇక గత ఎన్నికల సమయంలో ఎస్సీ, బీసీ, మైనార్టీలకు 50 ఏళ్లకే రూ.నాలుగు వేల చొప్పున పింఛన్‌ ఇస్తామన్న హామీని నెరవేర్చకుండా ఆ వర్గాలను చంద్రబాబు దారుణంగా దగా చేశారు. 

జగన్‌ హయాంలో నిరంతరం అవకాశం.. 
రాష్ట్రంలో అర్హులంతా అన్ని గ్రామ, వార్డు సచివాలయాల్లో కొత్త పింఛన్ల కోసం నిరంతరం దరఖాస్తు చేసుకునేందుకు వీలు కల్పిస్తూ గత ప్రభుత్వం ప్రత్యేకంగా ఆన్‌లైన్‌ పోర్టల్‌ అందుబాటులో తెచ్చింది. ఆన్‌లైన్‌ పోర్టల్‌ అందుబాటులోకి తేవడంతోపాటు వలంటీర్లే అర్హుల ఇళ్లకు వెళ్లి దరఖాస్తులు తీసుకుని సచివాలయాల్లో నమోదు చేసేలా చర్యలు తీసుకుంది. చంద్రబాబు అధికారంలోకి రాగానే పింఛన్ల మంజూరుకు కనీసం దరఖాస్తు కూడా చేసుకునే వీలు లేకుండా ఆన్‌లైన్‌ పోర్టల్‌ను పూర్తిగా మూసి వేసింది.      

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement