మహిళ కడుపులోంచి తొలగించిన పెన్నులు, స్పూన్లు, కొవ్వొత్తి
మతిస్థిమితంలేని మహిళకు ఆపరేషన్ చేసి వెలికితీసిన వైద్యులు
నరసరావుపేట రూరల్: మతిస్థిమితం లేని మహిళకు అరుదైన శస్త్రచికిత్స ద్వారా 13 పెన్నులు, 5 స్పూన్లు, కొవ్వొత్తి వెలికితీసిన ఘటన పల్నాడుజిల్లా నరసరావుపేటలో చోటుచేసుకుంది. లాప్రోస్కోపి ద్వారా శస్త్ర చికిత్స నిర్వహించి మహిళ కడుపులో ఉన్న వాటిని వెలికితీసినట్లు మాతాశ్రీ ఆసుపత్రి వైద్యుడు డాక్టర్ పి.రామచంద్రారెడ్డి తెలిపారు.
ఆయన తెలిపిన సమాచారం ప్రకారం మండలంలోని పెట్లూరివారిపాలెంకు చెందిన కుటుంబం కొంతకాలంగా పట్టణంలో నివసిస్తుంది. వీరి కుమార్తెకు మతిస్థిమితం లేకపోవడంతో ఆమెకు చికిత్స చేయిస్తున్నారు. రెండు రోజులుగా ఎడమవైపు కడుపునొప్పితో బాధపడుతుండడంతో పలు పరీక్షలు నిర్వహించి కడుపులో పెన్నులు, స్పూన్లు, కొవ్వొత్తి ఉన్నట్టు గుర్తించారు. మతిస్థిమితం లేని వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని డాక్టర్ రామచంద్రారెడ్డి ఈ సందర్భంగా సూచించారు.


