విశాఖలోని ఆర్టీసీ కాంప్లెక్స్ ప్రధాన రహదారి కూడలి వద్ద ధర్నా చేస్తున్న సచివాలయ ఉద్యోగులు
వెట్టి చాకిరీ చేయించుకోవడం తప్ప మా సమస్యలు పరిష్కరించరా?
బాబు సర్కారుపై భగ్గుమన్న గ్రామ/వార్డు సచివాలయ ఉద్యోగులు
విశాఖ బస్‌స్టేషన్ ముట్టడి.. కాంప్లెక్స్‌కు వచ్చే రహదారుల దిగ్బంధం
సమస్యలు పరిష్కరించేంత వరకు కదిలేదీ లేదని స్పష్టీకరణ
రోడ్డుపైనే బైఠాయింపు..వంటావార్పు
సాక్షి, విశాఖపట్నం/బీచ్‌రోడ్డు: సచివాలయ ఉద్యోగులు తమ సమస్యల పరిష్కారం కోసం విశాఖలోని జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద 3 రోజులుగా చేపట్టిన ఆందోళన తీవ్రరూపం దాల్చింది. జోన్–1 పరిధి ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, అనకాపల్లి, పార్వతీపురం మన్యం, అల్లూరి జిల్లాలకు చెందిన వందలాది మంది గ్రామ/వార్డు సచివాలయ ఉద్యోగులు ఈ ఆందోళనలో పాల్గొన్నారు. ఆదివారం గాంధీ విగ్రహం వద్ద ఉద్యోగులు ఆందోళన ప్రారంభించారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి సానుకూల ప్రకటనలు రాకపోవడంతో వారిలో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. అక్కడి నుంచి భారీ ర్యాలీగా వెళ్లి సమీపంలో ఉన్న ద్వారకా బస్‌స్టేషన్, ప్రధాన రహదారి కూడలిని ముట్టడించారు.
ఆర్టీసీ కాంప్లెక్స్‌కు వచ్చే కీలక దారులను దిగ్బంధించారు. రోడ్డుపైనే బైఠాయించి నిరసన తెలిపారు. చేతుల్లో ఖాళీ వాటర్ బాటిళ్లతో శబ్దాలు చేస్తూ.. ‘ఉద్యోగం చేస్తాం... ఊడిగం చెయ్యం’, ‘ఉయ్ వాంట్ జస్టిస్’అంటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ ఆందోళనతో భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. ఆందోళనకారులను అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు రావడంతో వారికి, ఉద్యోగులకు మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాట జరిగింది.

బకాయిలు చెల్లించాలి.. వేధింపులు ఆపాలి
ఈ సందర్భంగా సచివాలయ ఉద్యోగులు తమ ప్రధాన డిమాండ్లను ప్రభుత్వం ముందుంచారు. 2 రోజులుగా విధులు బహిష్కరించి.. రోడ్లపై ధర్నాలు, ఆందోళనలు చేస్తున్నా.. ప్రభుత్వం కనీçసం పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. వివాదాస్పద జీవో నం.11ను వెంటనే రద్దు చేయాలని, డిప్యూటేషన్లు విధానాన్ని నిలిపివేసి ప్రమోషన్లు వెంటనే కల్పించాలని డిమాండ్ చేశారు. రెండు నోషనల్ ఇంక్రిమెంట్లు మంజూరు చేసి ఆటోమేటిక్ అడ్వాన్స్‌మెంట్ స్కీమ్‌ని అమలు చేయాలని నినాదాలు చేశారు.
ప్రొబేషన్ కాలానికి సంబంధించిన 9 నెలల బకాయిలు, వార్షిక ఇంక్రిమెంట్లు చెల్లించాలని, ప్రతిరోజు సాయంత్రం 5 తర్వాత వాట్సప్ సందేశాలతో వేధించడం తక్షణమే ఆపాలని నినాదాలు చేశారు. ఆర్‌డీవో వచ్చి సచివాలయ ఉద్యోగులతో మాట్లాడారు. తమ డిమాండ్లను పరిష్కరించేంత వరకూ ఆందోళన విరమించబోమంటూ తెగేసి చెప్పడంతో.. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానంటూ ఆర్‌డీవో అక్కడి నుంచి వెళ్లిపోయారు.
తమ డిమాండ్లపై ప్రభుత్వం స్పందించకపోతే ఆందోళనను జోన్ స్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు ఉధృతం చేస్తామని ఉద్యోగులు హెచ్చరించారు. ట్రాఫిక్ జామ్ అవుతుండటంతో పోలీసులు ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా వాహనాల్ని మళ్లించారు. రాత్రి అవుతున్నా.. ఆందోళన విరమించకుండా.. వంటావార్పు చేపట్టారు. సెల్ ఫోన్‌లో లైట్లు ఆన్ చేసి నిరసన కొనసాగించారు. వీరికి వైఎస్సార్‌సీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు సంఘీభావం తెలిపారు.


