విశాఖపట్నం: సచివాలయ ఉద్యోగులు రోడ్డెక్కారు. ద్వారకా బస్‌స్టేషన్ ఎదుట రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. ఆర్టీసీ కాంప్లెక్స్ పరిసరాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఆర్టీసీ కాంప్లెక్స్‌కు వచ్చే అన్ని దారులను ఉద్యోగులు దిగ్బంధించారు. పోలీసులు, ఉద్యోగుల మధ్య తోపులాట చోటుచేసుకుంది. తమ సమస్యలు పరిష్కరిచాలని ఉద్యోగులు డిమాండ్ చేశారు. జీవో నం.11ను వెంటనే రద్దు చేయాలని చెప్పారు.
డిప్యూటేషన్లు వద్దు.. ప్రమోషన్లు కావాలి అంటూ నినదించారు. 2 నోషనల్ ఇంక్రిమెంట్లు వెంటనే మంజూరు చేయాలని సచివాలయ ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. అలాగే, ఆటోమేటిక్ అడ్వాన్స్‌మెంట్ స్కీమ్‌ను వెంటనే అమలు చేయాలని అంటున్నారు. ప్రొబేషన్ కాలానికి సంబంధించిన 9 నెలల బకాయిలతో పాటు ఒక వార్షిక ఇంక్రిమెంట్ మంజూరు చేయాలని చెప్పారు. ప్రతి ఉద్యోగికి కనీస మూల వేతనం రూ.30 వేలకు తగ్గకుండా ప్రమోషన్ విధానాన్ని అమలు చేయాలని అన్నారు.
మృతిచెందిన ఉద్యోగుల కుటుంబాలకు మూడు నెలల్లోగా అన్ని ప్రయోజనాలు అందించడంతో పాటు కుటుంబంలో ఒకరికి కారుణ్య నియామకం చేపట్టాలని వారు కోరారు. అలాగే, సాయంత్రం 5 గంటల తర్వాత వాట్సాప్ సందేశాల ద్వారా ఉద్యోగులను వేధించడం ఆపాలని అనన్నారు. సెలవు రోజుల్లో విధులు నిర్వహించినప్పుడు పరిహార సెలవు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి తమ సమస్యలను పరిష్కరించకపోతే జోన్ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఆందోళనను ఉద్ధృతం చేస్తామని వార్నింగ్ ఇచ్చారు.


