సాక్షి, తిరుపతి: ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సంస్థాగతంగా మరింత బలోపేతం చేయాలని తిరుపతి, చిత్తూరు జిల్లాలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు భూమన కరుణాకరరెడ్డి పిలుపునిచ్చారు. ప్రతి నియోజకవర్గం సమన్వయకర్త ఆయా నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటన చేయాలన్నారు.
స్థానిక సంస్థలు ఎన్నికలపై ఉమ్మడి చిత్తూరు జిల్లా నియోజకవర్గం ఇంచార్జ్‌లు, ముఖ్య నాయకులతో రీజినల్ కోఆర్డినేటర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, తిరుపతి, చిత్తూరు జిల్లాలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు భూమన కరుణాకరరెడ్డి, ఎంపీ గురుమూర్తి, ఎమ్మెల్సీలు సిపాయి సుబ్రమణ్యం, భరత్, మాజీ డిప్యూటి సీఎం నారాయణ స్వామి, మాజీ మంత్రి ఆర్‌కే రోజా, మాజీ ఎమ్మెల్యేలు వెంకటేగౌడ, బియ్యపు మధు సూధన్ రెడ్డి, డాక్టర్ సునీల్, మాజీ ఎంపీ రెడ్డప్ప, భూమన అభినయ్ రెడ్డి, చెవిరెడ్డి మోహిత్ రెడ్డి, కృపాలక్ష్మి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత వజ్ర భాస్కర్ రెడ్డి, చిత్తూరు పార్లమెంట్ నియోజకవర్గం పరిశీలకులు రాజశేఖర్ రెడ్డి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా భూమన కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ..‘వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఒక బ్రాండ్, ప్రతి ఒక్కరికీ గుర్తింపు కార్డులు కూడా మీకు అందుతాయి. ఓట్లు వేసిన ప్రజలను చంద్రబాబు వెన్నుపోట్లతో పొడుస్తూనే ఉన్నాడు. నమ్మకం ద్రోహం చేస్తూ, అనుకూల మధ్యమాల ద్వారా ప్రచారం చేసుకుంటున్నాడు. పచ్చ మీడియా, కూటమి మోసాలను ప్రజల ముందుకు తీసుకెళ్లాలి. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో కార్యకర్తలందరూ క్రియాశీల కార్యకర్తలుగా పనిచేయాలి. వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ పాదయాత్ర కూడా మొదలు అవుతుంది. ఆలోపే మనమంతా సమిష్టిగా పనిచేద్దాం. పరస్పర చర్చల ద్వారా సమస్యలు పరిష్కరించుకుందాం’ అని చెప్పుకొచ్చారు.
మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి మాట్లాడుతూ..‘స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయనే సంకేతాలు వస్తున్నాయి. ఉమ్మడి చిత్తూరు జిల్లా సర్‌లో మొదటి స్థానంలో ఉంది. ఈ ఎన్నికలలో అందరం సమిష్టిగా పనిచేసి, పార్టీని గెలిపించుకుందాం’ అని అన్నారు.
మాజీ మంత్రి రోజా మాట్లాడుతూ..‘వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు స్థానిక సంస్థలు ఎన్నికల్లో ఈ కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలి. ఎన్నికల ముందు హామీలు వర్షం కురిపించారు, అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఒక్క పథకం అమలు చేయలేదు. రాష్ట్రంలో అభివృద్ధి శూన్యం, 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రైవేటుపరం చేశారు. రాష్ట్రంలో ఫేక్ సర్టిఫికెట్స్‌తో ఉద్యోగాలు ఇచ్చారు. అనర్హులకు డీఎస్సీలో ఉద్యోగాలు ఇచ్చారు. దీనిపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్రంలో రైతులు పరిస్థితి దయనీయంగా ఉంది. చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ పాలనలో కరువు వచ్చింది. ఈవీఎంలు మేనేజ్ చేసుకుని ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది’ అని వ్యాఖ్యానించారు.


