సాక్షి, తూర్పుగోదావరి జిల్లా: డీఎస్సీలో అక్రమాలు గురించి గతం నుంచి చెబుతూనే వచ్చామని.. మూడున్నర లక్షల మంది అభ్యర్థులను కూటమి ప్రభుత్వం మోసం చేసిందని వైఎస్సార్‌సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నైతిక బాధ్యత వహించాలన్న ఆలోచన మాత్రం ప్రభుత్వానికి రావటం లేదన్నారు. డీఎస్సీలో అక్రమాలపై ప్రభుత్వం ప్రజలకు సంజాయిషి చెప్పాలని డిమాండ్ చేశారు.
‘‘దేశ చరిత్రలో కానీ విని ఎరుగని రీతిలో గత ప్రభుత్వ హయాంలో ఒకటిన్నర లక్షల ఉద్యోగాల రిక్రూట్‌మెంట్ నిర్వహించాం. హెరిటజ్‌లో పాలు, పెరుగు అమ్మినట్టు రాష్ట్రంలో టీచర్ ఉద్యోగాలు అమ్మేశారు. లోకేష్ విద్యాశాఖ మంత్రిగా రావటం విద్యార్థులకు శాపం. టెట్‌కి, డీఎస్సీకి ఒకరినే కన్వీనర్‌గా పెట్టడం దగ్గర నుంచి.. సంతలో బర్రెలు అమ్మినట్టు టీడీపీ నేతలు ఉద్యోగాలు అమ్మేసేంతవరకు ప్రతి విషయాన్ని ప్రజలకు వివరించాం. మీకు చిత్తశుద్ధి ఉంటే సీబిఐ విచారణ జరిపించండి’’ అని జక్కంపూడి రాజా డిమాండ్ చేశారు.
కుల విద్వేషాలు, మత విద్వేషాలు రెచ్చగొట్టి రాజకీయంగా లాభం పొందే ప్రయత్నం చేస్తున్నారు. లోకేష్ వ్యవహారంపై ఎందుకు సీబిఐ విచారణ జరపటం లేదు. సీబీఐ విచారణ జరిపితే వాస్తవాలు బయటికి వస్తాయి. యువగళం పాదయాత్రలో పాల్గొన్న వారిలో ఎవరెవరికి ఉద్యోగాలు ఇచ్చారో బయట పడుతుంది. ఊచలు లెక్క పెట్టాల్సి వస్తుందని ఉద్దేశంతోనే ధైర్యం చేయడం లేదు. కనీసం గ్రౌండ్‌లో అడుగుపెట్టని వారికి సైతం స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు ఇచ్చేశారు.. డబ్బు కోసం అక్రమ సంపాదన కోసం ఎటువంటి నీచమైన పని చేయడానికైనా ప్రభుత్వం దిగజారి పోతుంది. ఆడియో టేపులు బయటకు వచ్చినా ప్రభుత్వంలో స్పందన ఉండటం లేదు.
డీఎస్సీ వ్యవహారంలో ఎందుకు ఒక్కరిపై కూడా కేసు నమోదు చేయలేకపోయారు. సోషల్ మీడియా హ్యాండిల్స్ నిలుపు చేస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన గ్రూప్ సర్వీసెస్ పరీక్షలపై మీరు చేసిన ఆరోపణలపై, ప్రస్తుత డీఎస్సీపై సిబీఐ విచారణకు ఆదేశాలు ఇవ్వండి. మీరు చేసిన తప్పుడు నియామకాలు బయటపడతాయి. సాక్ష్యాలు ఉన్నా ప్రభుత్వం అడ్డగోలుగా వ్యవహరించడం దారుణం. లోకేష్ మంత్రిగా కొనసాగేందుకు అర్హత లేదు. తక్షణమే లోకేష్ రాజీనామా చేయాలి. ఈ వ్యవహారంలో కోర్టులు కూడా జోక్యం కల్పించుకోవాలి’’ అని జక్కంపూడి రాజా పేర్కొన్నారు.


