సాక్షి,హైదరాబాద్: తెలంగాణ మంత్రివర్గం నుంచి తన తల్లి కొండా సురేఖను తప్పించడంపై ఆమె కుమార్తె కొండా సుష్మిత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నా తల్లికి జరిగిన అవమానాన్ని జీర్ణించుకోలేకపోతున్నానంటూ భోరున విలపిస్తూ ఒక వీడియో సందేశాన్ని విడుదల చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తనపై ఉన్న కోపాన్ని తన తల్లిపై చూపించి బలిచేశారని ఆరోపించారు.
మా అమ్మను ఇంతగా అవమానిస్తారని తెలిస్తే నేను ఆ రోజు ఆ విధంగా మాట్లాడేదాన్ని కాదు. నేను మాట్లాడిన దానికి మా అమ్మను బలి చేయడం ఎంతవరకు కరెక్ట్? నేను అన్న మాటల్లో తప్పులేదు, కానీ సీఎం రేవంత్ రెడ్డి నాపై ఈ స్థాయిలో పగ పెంచుకుంటారని ఊహించలేదు అని ఆవేదన వ్యక్తం చేశారు.
మా అమ్మ చేసిన ఒక్క తప్పునైనా చూపించగలరా? 'పార్టీలో నేనైనా ఉండాలి, లేదా ఆమె అయినా ఉండాలి అనే స్థాయికి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి దిగజారుతారా? అని రేవంత్ రెడ్డి తీరును నిలదీశారు. ఎంపీపీగా రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన కొండా సురేఖ దివంగత నేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఆశీస్సులతోనే ఈ స్థాయికి వచ్చారని గుర్తుచేశారు. దశాబ్దాలుగా ప్రజాసేవలో ఉన్న తమ కుటుంబాన్ని ఇప్పుడు తీవ్రంగా వేధింపులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు.
మంత్రి వర్గం నుంచి కొండా సురేఖను బర్తరఫ్ చేసిన తరుణంలో కొండా సుష్మిత ఇటీవల సీఎం రేవంత్ రెడ్డిపై, ఆయన కుటుంబంపై తీవ్ర విమర్శలు చేశారు. తన తల్లికి అన్యాయం జరిగిందని, ఆమె గొంతు నొక్కలేరని పేర్కొన్నారు. సీఎం రేవంత్‌ను శపిస్తున్నట్లు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తాజాగా, తన వ్యాఖ్యల వల్లే తల్లి పదవికి ముప్పు వచ్చిందనే భావనతో సుష్మిత భావోద్వేగానికి గురవుతూ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర కలకలం రేపుతున్నాయి.
బోరున ఏడ్చిన మాజీ మంత్రి కొండా సురేఖ కూతురు కొండా సుష్మిత
నా వల్లే మా అమ్మకు ఇంత అవమానం
నేను మాట్లాడిన మాటలకు మా అమ్మను ఇంతలా అవమానిస్తారా?
–కొండా సుష్మిత pic.twitter.com/2njDtBF1G0— Mirror TV (@MirrorTvTelugu) September 6, 2026


