సాక్షి, మంచిర్యాల: జెన్‌జీ.. జెన్ ఆల్ఫా ఎవరైనా కావొచ్చు.. అందరి చేతుల్లోనూ సెల్‌ఫోన్ ఆరో వేలుగా మారింది. యువత సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా ఉంటూ తమ అభిప్రాయాలు, సలహాలనూ పంచుకుంటోంది. ఇటీవల కాలంలో ఇన్ స్టాగ్రాం వినియోగం విపరీతంగా పెరిగింది. అందుకే వివిధ రాజకీయ పార్టీల నాయకులు, ప్రజాప్రతినిధులు తమ వ్యక్తిగత ఖాతాల ద్వారా నియోజకవర్గాల ప్రజలకు దగ్గరయ్యేందుకు ఇన్‌స్టాగ్రాంను విస్తృతంగా వినియోగిస్తున్నారు. అధికారిక కార్యక్రమాలు ఏం చేసినా.. ఎక్కడికి వెళ్లినా.. ఎవరిని కలిసినా క్షణాల్లో తమ ఖాతాల్లో పోస్టు చేయిస్తున్నారు.
ప్రత్యేక సిబ్బంది
ఇన్‌స్టాగ్రాంతోపాటు ఇతర సామాజిక మాధ్యమాల నిర్వహణకు ప్రజాప్రతినిధులు ప్రత్యేకంగా సిబ్బందిని ఏర్పాటు చేసుకున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పది మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎంపీలు, ఎమ్మెల్సీలు ఉన్నారు. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్‌ఎస్ తదితర పార్టీల నాయకులూ భారీసంఖ్యలోనే ఉ న్నారు. అందరూ సోషల్‌మీడియా ఖాతాల నిర్వహణకు ప్రాధాన్యం ఇస్తున్నారు. వీరిలో చాలామంది సోషల్ మీడియాపై అవగాహన ఉన్నవారితో ఖాతాలు నిర్వహిస్తున్నారు. పర్యటనల్లో రాజకీయకా ర్యక్రమాలు చిత్రీకరణకు ఫొటో, వీడియోగ్రాఫర్లు వెంటే ఉంటున్నారు. ఎప్పటికప్పుడు ఆయా కార్యక్రమాలు, ఫొటోలు, వీడియోలు పోస్టు చేస్తున్నారు.

వ్యాపారంలోనూ..
వ్యాపారం ఏదైనా సరే విభిన్నమైన ప్రచారం చేస్తే ఆకట్టుకోవచ్చు. అందుకే చాలామంది వ్యాపారులు తమ వస్తువులకు సంబంధించిన వివరాలతో వీడియోలు చేస్తూ ఇన్‌స్టాగ్రాంలో అప్‌లోడ్ చేస్తున్నారు. పలు సందర్భాల్లో ఆఫర్లు ప్రకటిస్తూ వ్యాపారాన్ని పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు.
పదివేలలోపు..
ఇన్‌స్టాగ్రాంలో ప్రజాప్రతినిధులు, ఆయా పార్టీల నాయకులను ప్రజలు భారీ సంఖ్యలోనే అనుసరిస్తున్నారు. బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్, సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్‌బాబు, ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి, ముధోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్, మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప, మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావును 10వేలలోపు మంది ఫాలో అవుతున్నారు.
ఇది జెన్‌జీ యుగం. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఒడిసిపట్టుకుని వినియోగించుకోకపోతే కాలం చెల్లినవారవుతారు(అవుట్‌డేట్). ఇప్పుడు యువత ఇన్‌స్టాగ్రాంలో హల్‌చల్ చేస్తోంది. మనం కూడా ఆ బాట పట్టాలి. ఇన్‌స్టాగ్రాం ఖాతాలు తెరిచి ప్రభుత్వ, పార్టీ కార్యక్రమాలను ప్రచారం చేయాలి.
– ఇదీ ఇటీవల మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలకు సీఎం రేవంత్‌రెడ్డి దిశానిర్దేశం


