అసెంబ్లీలో ‘వెయ్యి రోజుల’ సమరం! | Telangana Monsoon meetings from tomorrow | Sakshi
Sakshi News home page

అసెంబ్లీలో ‘వెయ్యి రోజుల’ సమరం!

Sep 6 2026 4:19 AM | Updated on Sep 6 2026 4:19 AM

Telangana Monsoon meetings from tomorrow

రేపటి నుంచి వర్షాకాల సమావేశాలు.. 

కాంగ్రెస్‌ వెయ్యి రోజుల పాలనపై దాడికి బీఆర్‌ఎస్, బీజేపీ వ్యూహం 

విపక్షం దాడి చేయడానికి ముందే.. ఎదురుదాడికి అధికార పార్టీ ప్రణాళిక 

ఫీజు రీయింబర్స్‌మెంట్, 22ఏ జీవో, రైతులు, నిరుద్యోగంపై వాడీవేడి పోరు 

క్యూర్‌ బిల్లు, హేట్‌ స్పీచ్‌ బిల్లు.. 21 ఏళ్లకే చట్టసభల్లో పోటీపై తీర్మానానికి అవకాశం

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర రాజకీయాలు వేడెక్కుతున్న వేళ తెలంగాణ శాసనసభ, మండలి వర్షాకాల సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. సమావేశాలు కేవలం బిల్లులు, ప్రశ్నోత్తరాలకే పరిమితం కాకుండా వెయ్యి రోజుల కాంగ్రెస్‌ పాలనపై అధికార–ప్రతిపక్షాల మధ్య హోరాహోరీకి వేదికగా మారే అవకాశముంది. 

ఒకవైపు ప్రభుత్వం తన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు, పెట్టుబడులు, సాగునీటి ప్రాజెక్టులు, నియోజకవర్గాల అభివృద్ధిని ముందుకు తెచ్చేందుకు సిద్ధమవుతుండగా.. మరోవైపు బీఆర్‌ఎస్, బీజేపీలు ప్రజా సమస్యలు, ఎన్నికల హామీలు, రైతులు, విద్యార్థులు, నిరుద్యోగులు, ఫీజు బకాయిలు, భూ వివాదాలు, జలవనరుల అంశాలతో సర్కారును ఇరుకున పెట్టేందుకు సిద్ధమవుతున్నాయి. అసెంబ్లీ సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహించాలన్నది తొలిరోజు స్పీకర్‌ అధ్యక్షతన జరిగే బీఏసీ భేటీలో ఖరారు కానుంది. నాలుగైదు పనిదినాలకే సమావేశాలు పరిమితమయ్యే అవకాశముంది. 

కాంగ్రెస్‌ అ్రస్తాలేంటి? 
అధికార కాంగ్రెస్‌ ప్రతిపక్షంపై, ప్రధానంగా ప్రతిపక్ష నాయకుడు సభకు హాజరుకాకపోవడంపై ఇప్పటికే ఆందోళన కార్యక్రమాలను నిర్వహించడమేకాక.. ఆయన రాజీనామా చేయాలంటూ డిమాండ్‌ చేస్తోంది. తమ వెయ్యిరోజుల పాలన, బీఆర్‌ఎస్‌ పదేళ్ల పాలనపై గణాంకాలతో చర్చించడానికి సిద్ధమని సవాల్‌ విసురుతోంది. బీఆర్‌ఎస్‌ హయాంలో అన్ని వ్యవస్థలు నాశనమయ్యాయని, వాటిని చక్కదిద్దుతున్నామని ఎదురుదాడి చేస్తోంది. మరోవైపు కాంగ్రెస్‌ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలన వైఫల్యాల పేరిట బీఆర్‌ఎస్, బీజేపీలు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు నిర్వహిస్తున్నాయి.  

విపక్షాల అ్రస్తాలివీ... 
కాంగ్రెస్‌ వెయ్యి రోజుల పాలనను కేంద్రంగా చేసుకుని బీఆర్‌ఎస్, బీజేపీలు ఇప్పటికే చార్జిïÙట్‌ను విడుదల చేశాయి. రేవంత్‌ ప్రభుత్వం ఎన్నికల హామీల అమలు, రైతు రుణమాఫీ, ఎరువుల కొరత, రుణమాఫీ పూర్తిస్థాయిలో అమలుపై బీఆర్‌ఎస్‌ ఇప్పటికే క్షేత్ర స్థాయిలో నిలదీస్తోంది. ఉద్యోగాల భర్తీ, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు, సంక్షేమ పథకాలు, సాగునీరు, కృష్ణా–గోదావరి జలాల అంశాలను ఆ పార్టీ ప్రధానంగా ప్రస్తావిస్తోంది. అసెంబ్లీ వేదికగా వీటిపై ప్రభుత్వాన్ని నిలదీయాలని బీఆర్‌ఎస్‌ వ్యూహం సిద్ధం చేసుకుంది. 

బీజేపీ కూడా 22ఏ జీవో, ఫీజు రీయింబర్స్‌మెంట్, రైతుల సమస్యలను ప్రధాన ఎజెండాగా తీసుకుంది. తాజాగా ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి నిరసన, అరెస్టు నేపథ్యంలో ఈ అంశం సభలో మరింత వేడెక్కే అవకాశం ఉంది. పాలిటెక్నిక్‌ విద్యార్థుల సమస్యలు, కల్యాణలక్ష్మి నిధుల విడుదలలో జాప్యం, ఇందిరమ్మ ఇళ్ల బిల్లులు, యూరియా కొరత, రైతుల ఇబ్బందులు కూడా అసెంబ్లీలో ప్రశ్నోత్తరాలు, జీరో అవర్‌తోపాటు వివిధ రూపాల్లో ప్రస్తావనకు వచ్చే అవకాశముంది.  

ఏయే బిల్లులంటే... 
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న కోర్‌ అర్బన్‌ రీజియన్‌ (క్యూర్‌) బిల్లు ఈ సమావేశాల్లో కీలకంగా మారనుంది. ఔటర్‌ రింగ్‌ రోడ్డు పరిధిలోని పట్టణ ప్రాంతాల పాలనను సమగ్రంగా మార్చే ఉద్దేశంతో ఈ బిల్లును తేనున్నారు. అయితే ఆస్తి పన్ను, భూములు–భవనాల విలువ నిర్ధారణ వంటి అంశాలపై ఇప్పటికే అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. మరోవైపు హేట్‌ స్పీచ్, హేట్‌ క్రైమ్స్‌ నిరోధక బిల్లు కూడా చర్చకు రావచ్చు. అలాగే, చట్టసభల ఎన్నికల్లో పోటీ చేసే కనీస వయసును 25 నుంచి 21 ఏళ్లకు తగ్గించాలని కేంద్రాన్ని కోరుతూ అసెంబ్లీలో తీర్మానం చేసే అవకాశముంది. 22ఏపై ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలను తిప్పికొట్టేలా పూర్తి వివరాలతో అధికారపక్షం సన్నద్ధం అవుతున్నట్లు సమాచారం.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement