22ఏపై శ్వేతపత్రం విడుదల చేయాలి | Ponguleti should resign says BJP Legislature Party leader Yeleti | Sakshi
Sakshi News home page

22ఏపై శ్వేతపత్రం విడుదల చేయాలి

Sep 6 2026 4:03 AM | Updated on Sep 6 2026 4:03 AM

 Ponguleti should resign says BJP Legislature Party leader Yeleti

మంత్రి పొంగులేటి రాజీనామా చేయాలి: బీజేపీ శాసనసభా పక్ష నేత ఏలేటి 

సిగ్గు లేకుండా ధర్నా చౌక్‌లో మంత్రులే ధర్నా చేస్తారట... 

ఆదివారం ఇందిరా పార్క్‌ దగ్గర పిక్నిక్, దావత్‌ చేసుకుంటారట 

భూ భారతిపై మహాధర్నాలో వెల్లడి 

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వం నిషేధిత 22ఏ జాబితాలో చేర్చిన భూములపై వెంటనే ఫోరెన్సిక్‌ ఆడిట్‌ నిర్వహించి, అధికారుల ప్రమేయంతో జరిగిన మార్పులపై శ్వేతపత్రం విడుదల చేయాలని బీజేపీ శాసనసభా పక్ష నేత ఏలేటి మహేశ్వర్‌ రెడ్డి డిమాండ్‌ చేశారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రజాదరణ కోల్పోయి అవినీతికి, భూమాఫియాకు అడ్డాగా మారిందని ఆరోపించారు. కోట్లాది రూపాయల ప్రైవేట్, ప్రభుత్వ భూములను ఉద్దేశపూర్వకంగా 22ఏ జాబితాలో పెట్టి, రెవెన్యూ శాఖను వ్యాపార సంస్థగా మార్చేశారని మండిపడ్డారు. తన కుటుంబ సంస్థల పేరిట ఉన్న రూ. 15 వేల కోట్ల ఆస్తులపై తన ప్రశ్నలకు బదులు ఇవ్వలేక పారిపోయిన రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. 

శనివారం ఇందిరాపార్క్‌ ధర్నాచౌక్‌ వద్ద... భూభారతి– 22ఏ ద్వారా రైతుల భూములను అక్రమంగా నిషేధిత జాబితాలో చేర్చడాన్ని నిరసిస్తూ ‘భూభారతి, 22ఏపై మహాధర్నా’ను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌.రాంచందర్‌రావు ప్రారంభించారు. ఏలేటి, ఎంపీ ఈటల రాజేందర్, ఇతరనేతలు ఒకరోజు దీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మహేశ్వర్‌ రెడ్డి మాట్లాడుతూ రేవంత్‌ రెడ్డి అధికారంలోకి వచ్చాక భూ భారతి పేరుతో గతంలోని దోపిడీ, అవినీతి కొనసాగుతోందని ఆరోపించారు. రాష్ట్రంలో కోటి ఎకరాలను 22ఏలో పెట్టి దోచుకుంటున్నారని ధ్వజమెత్తారు.

అధికార కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో సిగ్గు లేకుండా మంత్రులే ఆదివారం ధర్నా చౌక్‌లో ధర్నా చేస్తామంటున్నారని ఎద్దేవాచేశారు. బీజేపీ రెండురోజుల ధర్నాకు పరి్మషన్‌ ఇవ్వకుండా ఆదివారం ఇందిరా పార్క్‌ వద్ద కాంగ్రెస్‌ పిక్నిక్, దావత్‌ చేసుకుంటుందని విమర్శించారు. రాష్ట్రంలోని భూదందాలతోపాటు గత ప్రభుత్వంలో జరిగిన ధరణి, కాళేశ్వరం, ఫార్ములా ఈ–రేసింగ్, ఫోన్‌ ట్యాపింగ్‌ తదితర కుంభకోణాలపై సమగ్ర విచారణకు వెంటనే సీబీఐకి లేఖ రాయాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.  

సర్కార్‌ను దింపే దాకా విశ్రమించం
ప్రజల ఉసురు పోసుకుంటున్న రేవంత్‌ సర్కార్‌ను గద్దె దింపేవరకు విశ్రమించేది లేద ని శపథం చేస్తున్నామని ఎంపీ ఈటల రాజేందర్‌ చెప్పారు. ‘రేవంత్‌ నీకు కేసీఆర్‌ కంటే దుర్మార్గమైన గతి పడుతుంది. రాహుల్, సోనియా గాంధీలకు రేవంత్‌ నెలకు 400 కోట్లు పంపిస్తున్నారు’అని ఆరోపించారు. 22ఏ సమస్యతో నష్టపోయిన ఒక బాధిత రైతు చేతుల మీదుగా నిమ్మరసం తాగి మహేశ్వర్‌ రెడ్డి, ఈటల తమ దీక్షను విరమించారు. కార్యక్రమంలో మాజీ గవర్నర్‌ బండారు దత్తాత్రేయ, ఎంపీలు డా.కె.లక్ష్మణ్, డీకే అరుణ, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, రఘునందన్‌రావు, గోడం నగేష్, ఎమ్మెల్యేలు పాయల్‌శంకర్, కాటిపల్లి వెంకటరమణారెడ్డి, పైడి రాకేష్‌ రెడ్డి, రామారావు పటేల్‌ తదితరులు పాల్గొన్నారు.  

ఆర్‌ఆర్‌ రియల్‌ ఎస్టేట్‌గా...: కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి 
తెలంగాణను రేవంత్‌ రెడ్డి, రాహుల్‌ గాంధీ ప్రైవేట్‌ లిమిటెడ్‌ రియల్‌ ఎస్టేట్‌ కంపెనీ’గా (ఆర్‌ఆర్‌ రియల్‌ ఎస్టేట్‌)గా మార్చేశారని కేంద్ర మంత్రి జి. కిషన్‌రెడ్డి ఎద్దేవా చేశారు. 22ఏ జాబితా, భూముల అమ్మకాలు, ప్రైవేట్‌ సెటిల్మెంట్ల ద్వారా దోచుకున్న వేలకోట్లు ఢిల్లీకి కప్పం కడుతున్నారన్నారు. 22ఏ కింద నిషేధిత జాబితాలో చేర్చిన రైతులు, ప్రజల భూములను బేషరతుగా తొలగించాలని డిమాండ్‌చేశారు. 

బీజేపీ అధ్యక్షుడు రాంచందర్‌ రావు మాట్లాడుతూ... రైతుల భూములను 22ఏ నిషేధిత జాబితాలో చేర్చడం మానవ హక్కుల ఉల్లంఘనే అని అన్నారు. ఈ జాబితా పేరుతో ప్రజలు, ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబాలను రైతులను ప్రభుత్వం తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోందన్నారు. తప్పు జరిగిందని సీఎం, మంత్రులే స్వయంగా ఒప్పుకుంటున్నప్పుడు అందుకు బాధ్యులైన ప్రభుత్వానికి శిక్ష పడాల్సిందేనన్నారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement