సెంటర్‌ అ‘టెన్షన్‌’ | NTA collaborates with AICTE to establish testing centres | Sakshi
Sakshi News home page

సెంటర్‌ అ‘టెన్షన్‌’

Sep 6 2026 3:35 AM | Updated on Sep 6 2026 3:35 AM

 NTA collaborates with AICTE to establish testing centres

లీకేజీలకు ఆస్కారం లేని పరీక్ష కేంద్రాల కోసం వేట 

ఏఐసీటీఈకి లేఖ రాసిన ఎన్‌టీఏ  

సెంటర్ల వసతులపై పూర్తి సమాచారం ఈ నెల 15లోగా ఇవ్వండి 

అన్ని వర్సిటీలు, కాలేజీలకు ఏఐసీటీఈ ఆదేశాలు 

పది అంశాలపై స్పష్టమైన ఆరా

సాక్షి, హైదరాబాద్‌: జాతీయ స్థాయిలో నిర్వ హించే పరీక్షలకు పక్కా ఏర్పాట్లు చేయాలని కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తోంది. నీట్‌ పేపర్‌ లీక్, తాజాగా జైపూర్‌లో పీజీ నీట్‌ కేంద్రంలో గందరగోళం, పలు కేంద్రాల్లో తరచూ సాంకేతిక అంతరాయాలు విమర్శలకు దారి తీస్తోంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని పరీక్ష కేంద్రాల ఎంపికపై నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ ప్రత్యేక దృష్టి పెట్టింది. దేశవ్యాప్తంగా 14 వేల విద్యా కేంద్రాల నుంచి సమగ్ర సమాచారం తెప్పించాలని నిర్ణయించింది. ఈ ప్రక్రియకు సహకరించాలని అఖిల భారత సాంకేతిక విద్యా మండలిని కోరింది.

కంప్యూటర్‌ ఆధారిత పరీక్షల నిర్వహణకు అనువుగా మౌలిక వసతులున్న విద్యా సంస్థలను గుర్తించి, తమకు జాబితా పంపాలని విజ్ఞప్తి చేసింది. దీంతో ఏఐసీటీఈ దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాలు, కాలేజీలకు తాజాగా లేఖలు రాసింది. ఈ నెల 15వ తేదీలోగా సమగ్ర సమాచారం ఇవ్వాలని ఆదేశించింది. ఏఐసీటీఈ పాలసీ అండ్‌ ప్లానింగ్‌ అకాడమీ బ్యూరో సలహాదారు ఎన్‌హెచ్‌ సిద్ధ లింగస్వామి ఈ వ్యవహారాన్ని పరిశీలిస్తున్నారు. 

ఇవీ ఏఐసీటీఈ కోరిన వివరాలు  
పరీక్ష ప్రారంభం నుంచి పూర్తయ్యే వరకూ ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ఉండే కేంద్రాలనే నీట్, జేఈఈ వంటి పరీక్షలకు ఎంపిక చేయాలని ఎన్‌టీఏ భావించింది. గత కొన్నేళ్లుగా ఎదురవుతున్న సమస్యలను ఈ సంస్థ విశ్లేషించింది. వీటి ఆధారంగా మొత్తం పది మౌలిక వసతుల కల్పన ఉన్న సంస్థలనే గుర్తించాలని నిర్ణయించింది. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా 14 వేల కాలేజీలు, వర్సిటీలకు పది అంశాలతో కూడిన సమాచార సేకరణ ప్రతులు అందాయి. ఇందులో ముఖ్యమైన సమాచారం ఈ విధంగా ఉంది.  

» సంస్థలో పనిచేస్తున్న కంప్యూటర్ల సంఖ్య 
» ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఐటీ మౌలిక వసతులు 
» కంప్యూటర్‌ సిస్టమ్స్‌ వివరాలు 
» నెట్‌వర్కింగ్‌ సదుపాయాల పరిస్థితి 
» ఇంటర్నెట్‌ కనెక్టివిటీ సామర్థ్యం 
» విద్యుత్‌ బ్యాకప్‌ సదుపాయాలు 
» సీసీ కెమెరాలు, ఇతర అనుబంధ భద్రతా సౌకర్యాలు 
» ఖాళీగా లేదా ప్రస్తుతం వినియోగంలో లేని స్థలం 
»  ఆ స్థలాన్ని ప్రత్యేక సీబీటీ పరీక్షా కేంద్రంగా అభివృద్ధి చేసే అవకాశం ఏ మేర ఉంది 

తరచూ ఎదురయ్యే సమస్యలు 
ఈ మధ్య ఎన్‌టీఏ నిర్వహించిన పలు జాతీయ స్థాయి పరీక్షల్లో అభ్యర్థులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పరీక్ష కేంద్రాల్లో విద్యుత్‌ అంతరాయాలు, సాంకేతిక సమస్యలు, సాఫ్ట్‌వేర్‌ లోపాలు వంటి కారణాలతో పరీక్షలు వాయిదా పడటం లేదా కొందరు అభ్యర్థులకు మళ్లీ పరీక్ష నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పడింది.  
» ఆగస్టు 22న జైపూర్‌లో జరిగిన పీజీ నీట్‌లో విద్యుత్‌ వైఫల్యం కారణంగా 49 మంది అభ్యర్థులు పరీక్ష రాయలేకపోయారు. వీరికి రీటెస్ట్‌ నిర్వహించాల్సి వచ్చింది.  
» సీయూఈటీ–యూజీ 2026లో సాఫ్ట్‌వేర్‌ సాంకేతిక లోపం కారణంగా 3,765 మంది విద్యార్థులు పరీక్షకు దూరమయ్యారు. వారికి కూడా మళ్లీ పరీక్ష నిర్వహించారు.  కంప్యూటర్లు మాత్రమే కాకుండా నిరంతర విద్యుత్, నెట్‌వర్క్‌ సామర్థ్యం, ఇంటర్నెట్‌ వేగం, పర్యవేక్షణ వ్యవస్థలు అందుబాటులో లేకపోవడమే ఇలాంటి పరిస్థితికి కారణంగా తెలుస్తోంది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement