అప్పుడు ఓనర్‌.. ఇప్పుడు డ్రైవర్‌! | Disappearing single lorry owner system | Sakshi
Sakshi News home page

అప్పుడు ఓనర్‌.. ఇప్పుడు డ్రైవర్‌!

Sep 6 2026 1:45 AM | Updated on Sep 6 2026 1:45 AM

Disappearing single lorry owner system

కనుమరుగవుతున్న సింగిల్‌ లారీ ఓనర్ల వ్యవస్థ 

4–5 ఏళ్లకోసారి కొత్త లారీ కొంటేనే మనుగడ 

25 సంవత్సరాలలో డ్రైవర్లుగా మారిన 50 వేల మంది ఓనర్లు  

ఐదు లారీల యజమానిని. పిల్లలను ప్రైవేటు స్కూళ్లో చదివించాను. మంచిగా బతికాం. కాలం గిర్రున తిరిగింది. లోడింగ్, అన్‌లోడింగ్, డీజిల్, టైర్లు, బీమా రేట్లు పెరిగాయి. కానీ బండి కిరాయి మాత్రం పెరగలేదు. క్రమంగా నష్టాలు మొదలయ్యాయి. చదువు మానేసి నా కొడుకు డ్రైవర్‌గా మారాడు. నేనూ డ్రైవింగ్‌ చేశాను. ఆదాయం లేక ఈఎంఐలు కట్టలేదు. ఫైనాన్స్‌ ఏజెంట్లు లారీలు తీసుకెళ్లిపోయారు. అప్పులు కట్టేందుకు బంగారం, ఊర్లో భూమి, హైదరాబాద్‌లో స్థలం అమ్మేశాను. రూ.80 లక్షల నష్టం వచ్చింది. అప్పుల భారంతో ఆత్మహత్యకు యత్నించాను. నా పిల్లలు ఇప్పుడు ప్రభుత్వ సంక్షేమ వసతి గృహంలో ఉండి చదువుతున్నారు. డ్రైవర్‌గా పనిచేస్తూనే కొద్దిపాటి భూమిలో వ్యవసాయం చేస్తున్నాను. మా ఊర్లో 14 మంది లారీలు అమ్ముకుని రోడ్డుపాలయ్యారు.’’ 

– ఇది ఒక పేర్ల భద్రాచలం వ్యథ మాత్రమే కాదు. ఆయనలాంటి లారీ యజమానులు ఎందరో...  

నూగూరి మహేందర్‌
సొంతంగా ఒక లారీ కొనుక్కొని, దాన్నే నమ్ముకుని జీవిస్తున్న సింగిల్‌ లారీ ఓనర్ల వ్యవస్థ కనుమరుగవుతోంది. ఆటోమొబైల్‌ తయారీ సంస్థలు అనుసరిస్తున్న వ్యాపార వ్యూహాలు, ప్రతి 3–4 సంవత్సరాలకే కొత్త మోడళ్లను మార్కెట్లోకి ప్రవేశపెట్టడం సామాన్య లారీ యజమానులకు మోయలేని ఆర్థిక భారంగా మారుతోంది. మారుతున్న మార్కెట్, కస్టమర్ల డిమాండ్లతో పాత బండ్లను పక్కనపెట్టి, భారీ అప్పులు చేసి మరీ కొత్త మోడళ్లను కొనాల్సిన పరిస్థితి. పాత బండి అప్పు తీరకముందే, మరో కొత్త వాహనాన్ని కొనాల్సి రావడం ఒంటరి లారీ యజమానులను తీవ్ర ఆర్థిక సంక్షోభంలోకి నెట్టేస్తోంది. దీంతో చేసేదేమీలేక వేలాది మంది యజమానులు తమ వాహనాలను విక్రయించి డ్రైవర్లుగా మిగిలిపోతుండడం ఆందోళన కలిగిస్తోంది. తెలంగాణ జిల్లాల్లో ఇలాంటి వారి సంఖ్య ఈ రెండున్నర దశాబ్దాల్లో 50,000 మందికిపైమాటే. రాష్ట్రంలో ఏటా 2–3 వేల మంది తమ వాహనాలను అమ్ముతున్నట్టు సమాచారం. సరుకు రవాణా వాహనాలు తెలంగాణలో 1.80 లక్షలు, ఆంధ్రప్రదేశ్‌లో 2 లక్షల లారీలు ఉంటాయి. 1 లేదా 2 లారీలు ఉన్న యజమానులు 60 శాతం ఉంటారు. మూడు దశాబ్దాల క్రితం మార్కెట్‌ అంతా 6 టైర్ల లారీలదే. ఇప్పుడు అధిక వాటా 16 టైర్లున్న లారీలది. 

క్రెడిట్‌ స్కోర్‌ లేక.. 
వాహన యజమానులు, డ్రైవర్లలో మెరుగైన క్రెడిట్‌ స్కోర్‌ లేనివారు 70 శాతంపైనే ఉండడం వారి ఆర్థిక పరిస్థితికి అద్దం పడుతోంది. క్రెడిట్‌ స్కోర్‌ లేకపోవడంతో ప్రభుత్వ, ప్రైవేటు రంగ బ్యాంకులు రుణం ఇచ్చేందుకు ముందుకు రావడం లేదు. దీంతో చేసేదీమీ లేక 24–36 శాతం అధిక వడ్డీ అయినా, ఎన్‌బీఎఫ్‌సీలను ఆశ్రయిస్తున్నారు. ఎన్‌బీఎఫ్‌సీల నుంచి రుణం తీసుకునేవారి సంఖ్య సగం ఉంటోంది.  

వాటికే మొదటి ప్రాధాన్యం 
మార్కెట్‌ అంతా పెద్ద పెద్ద కార్పొరేట్‌ లాజిస్టిక్స్‌ కంపెనీల చేతుల్లోకి వెళ్తోంది. ఈ కంపెనీలు, సరుకు రవాణా చేసే క్లయింట్లు ఎప్పుడూ కొత్త మోడల్, ఎక్కువ మైలేజ్, మెరుగైన సేఫ్టీ ఫీచర్లు , అధిక బరువు మోయగలిగే వాహనాలకే మొదటి ప్రాధాన్యం ఇస్తున్నారు. ప్రస్తుతం 16కుపైగా చక్రాలు ఉన్న వాహనాలకే సుదూర ప్రాంతాలకు సరుకు రవాణా గిరాకీ ఉంటోంది. 14, 12, 10, 6 టైర్ల లారీలు తక్కువ దూరాలు, లేదా ఒకట్రెండు రాష్ట్రాలకే పరిమితం అవుతున్నాయి.  

ఈఎంఐ తీరకముందే.. 
వాహనానికి సంబంధించిన నెలవారీ వాయిదాలు చెల్లించి, అది పూర్తిగా సొంతం కావడానికి కనీసం 4–5 ఏళ్ల సమయం పడుతుంది. కానీ ట్రక్కుల తయారీ కంపెనీలు ప్రతి 3–4 ఏళ్లకే మెరుగైన మైలేజీ ఇచ్చే నూతన మోడళ్లను రంగంలోకి దించుతున్నాయి. పాత బండి లోన్‌ పూర్తిగా తీరకముందే, మార్కెట్‌లో పోటీ తట్టుకోవడానికి పాత వాహనాన్ని తక్కువ ధరకు అమ్ముకొని, మళ్లీ కొత్త మోడల్‌ కోసం అప్పుల ఊబిలోకి కూరుకుపోవాల్సి వస్తోందని లారీ యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  

అప్‌గ్రేడేషన్‌కు రాయితీలు.. 
ఒకవైపు డీజిల్‌ ధరల పెరుగుదల, టోల్‌ ప్లాజా చార్జీలు, ఇన్సూరెన్స్‌ ప్రీమియం భారం ఉండగా, మరోవైపు కంపెనీల కొత్త మోడళ్ల ఒత్తిడి తోడైంది. పాత బండ్లకు రీసేల్‌ వాల్యూ (అమ్మకం ధర) దారుణంగా పడిపోతోంది. కంపెనీలు క్రమం తప్పకుండా మోడళ్లను మార్చడం వల్ల స్పేర్‌ పార్ట్స్‌ కొరత కూడా తలెత్తుతోంది. ఈ వ్యూహాత్మక మార్కెట్‌ మాయాజాలంలో కార్పొరేట్‌ ఫ్లీట్‌ ఆపరేటర్లు తట్టుకోగలుగుతున్నా, కేవలం ఒకటో రెండో బండ్లు ఉన్న సాధారణ యజమానులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.  

డ్రైవర్లు కావలెను.. 
సరుకు రవాణా రంగాన్ని డ్రైవర్ల కొరత పట్టిపీడిస్తోంది. వాహనాల సంఖ్యతో పోలిస్తే 40 శాతం డ్రైవర్ల కొరత ఉందని మార్కెట్‌ వర్గాలు చెబుతున్నాయి. 10 ఏళ్ల క్రితం డ్రైవర్‌ బత్తా నెలకు రూ.25 వేలు. ఇప్పుడు రూ.50 వేలు దాటింది. అయినా డ్రైవింగ్‌ను వృత్తిగా ఎంచుకోవడానికి యువత ఆసక్తి చూపడం లేదు.  

ప్రభుత్వం రేట్‌ ఫిక్స్‌ చేస్తేనే.. 
వాహన సామర్థ్యం, కిలోమీటర్‌ను బట్టి ప్రభుత్వమే కిరాయి నిర్ణయించాలి. అప్పుడే సింగిల్‌ లారీ ఓనర్లు బతుకుతారు. డ్రైవర్లు, సింగిల్‌ లారీ యజమానుల కోసం సంక్షేమ బోర్డు ఏర్పాటు కావాలి. బీమా, పెన్షన్, పిల్లలకు ఉచిత విద్య, సంక్షేమ పథకాల్లో భాగం చేయాలి. ప్రభుత్వానికి భారీ ఆదాయం, లక్షలాది మందికి ఉపాధి కల్పిస్తున్న ఈ రంగం ఇది. ఒక వాహనంతో 6–10 మందికి ఉపాధి లభిస్తుంది. అయినా మాపట్ల ఎవరికీ గౌరవం లేదు. అందుకే ఈ రంగం వ్యవస్థీకృతం కావాలి  
– మంచిరెడ్డి రాజేందర్‌రెడ్డి, ప్రెసిడెంట్, తెలంగాణ లారీ ఓనర్స్‌ అసోసియేషన్‌. 

నిలదొక్కుకునేది ఎప్పుడు? 
12 చక్రాల లారీ ఖరీదు 2014లో రూ.23 లక్షలు. ఇప్పుడు రూ.33 లక్షలు. వాయిదాల్లో వాహనం కొంటే వడ్డీ రూ.8–10 లక్షలు అదనం. 1.5 లక్షల కిలోమీటర్లు తిరిగి, మంచి కండీషన్లో ఉంటే 5 ఏళ్ల పాత లారీకి రీసేల్‌ ధర రూ.15 లక్షలు వస్తోంది. నాలాంటి సింగిల్‌ లారీ ఓనర్లు ఈఎంఐలు తీరిపోయి జీవితంలో నిలదొక్కుకోవచ్చు అనుకునే సమయానికి కొత్త బండి కొనాల్సిన పరిస్థితి. లేదంటే ఈ రంగం నుంచి తప్పుకోవాల్సిందే.  
– పోరెడ్డి మల్లారెడ్డి, బాలాపూర్, హైదరాబాద్‌   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement