తెలంగాణలో భారీ పెట్టుబడులకు మరో అడుగు పడింది. దేశంలోనే అతిపెద్ద డేటా సెంటర్లలో ఒకటిగా నిలిచే ప్రాజెక్టును రాష్ట్రానికి తీసుకురావడానికి ప్రభుత్వం కీలక ఒప్పందం చేసుకుంది. సుమారు రూ.70 వేల కోట్ల పెట్టుబడితో.. 1 గిగావాట్ సామర్థ్యంతో డేటా సెంటర్ ఏర్పాటు చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. హైదరాబాద్ సమీపంలోని.. కొంగరకలాన్ ఫ్యూచర్ సిటీలో ఈ ప్రాజెక్టును ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
సచివాలయంలో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి సమక్షంలో.. తెలంగాణ ప్రభుత్వం, టీసీఎస్, హైపర్ వాల్ట్ ప్రతినిధుల మధ్య అవగాహన ఒప్పందం (MoU) కుదిరింది. ఈ ప్రాజెక్టు ద్వారా తెలంగాణను దేశంలోని ప్రముఖ డేటా సెంటర్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) కేంద్రంగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోంది.
ప్రపంచ స్థాయి ప్రమాణాలతో..
తెలంగాణలో ఓపెన్ ఏఐకు అతిపెద్ద డేటా సెంటర్‌ను ఏర్పాటు చేసే దిశగా ఈ ప్రాజెక్టు కీలకంగా ఉండనుందని మంత్రి శ్రీధర్ బాబు వెల్లడించారు. వన్ గిగావాట్ సామర్థ్యం కలిగిన ఈ డేటా సెంటర్‌ను ప్రపంచ స్థాయి ప్రమాణాలతో నిర్మించనున్నట్లు తెలిపారు.
డేటా సెంటర్లకు.. ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్లౌడ్ కంప్యూటింగ్, డిజిటల్ సేవలు వంటి రంగాల నుంచి భారీగా డిమాండ్ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ఇంత పెద్ద డేటా సెంటర్ తెలంగాణలో ఏర్పాటు కావడం రాష్ట్ర డిజిటల్ ఎకానమీకి మరింత బలం చేకూరుస్తుందని ప్రభుత్వం భావిస్తోంది.
దావోస్ భేటీతో మొదలై..
ఈ ప్రాజెక్టు వెనుక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన ప్రయత్నాలు కీలకమని ప్రభుత్వం చెబుతోంది. ఎందుకంటే.. జనవరిలో దావోస్‌లో టీసీఎస్ చైర్మన్ ఎన్. చంద్రశేఖరన్‌తో ముఖ్యమంత్రి సమావేశమయ్యారు. ఆ సందర్భంగా తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని ఆయన కోరారు.
తెలంగాణ ప్రభుత్వం తీసుకొస్తున్న 'తెలంగాణ రైజింగ్' పాలసీ, అలాగే ఫ్యూచర్ సిటీ అభివృద్ధి ప్రణాళికలపై టాటా సన్స్ చైర్మన్ ఆసక్తి చూపారని ప్రభుత్వం తెలిపింది. ముఖ్యమంత్రి చేసిన చర్చల అనంతరం టాటా గ్రూప్ ఈ భారీ ప్రాజెక్టుకు సిద్ధమైనట్లు వెల్లడించింది. ప్రస్తుతం టాటా గ్రూప్‌కు చెందిన సంస్థల్లో.. తెలంగాణలోనే సుమారు 83 వేల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారని ప్రభుత్వం పేర్కొంది. ఈ కొత్త ప్రాజెక్టుతో రాష్ట్రంలో టాటా గ్రూప్ కార్యకలాపాలు మరింత విస్తరించే అవకాశం ఉంది.
ఏడువేల ఉద్యోగాలు
తెలంగాణలో ప్రారంభం కానున్న..ఈ భారీ డేటా సెంటర్ నిర్మాణాన్ని 18 నుంచి 24 నెలల్లో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రాజెక్టు పూర్తయిన తర్వాత సుమారు 7 వేల మందికి ఉద్యోగ అవకాశాలు లభించే అవకాశం ఉందని ప్రభుత్వం తెలిపింది. ముఖ్యంగా డేటా సెంటర్ నిర్మాణం, నిర్వహణ, సాంకేతిక సేవలు, విద్యుత్, భద్రత, మౌలిక వసతులు వంటి అనేక రంగాల్లో ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి అవకాశాలు పెరిగే అవకాశం ఉంది.
ఫ్యూచర్ సిటీకి ప్రాధాన్యం
రూ.70 వేల కోట్ల పెట్టుబడి.. ఫ్యూచర్ సిటీ అభివృద్ధిలో ఒక కీలక మైలురాయి అని ప్రభుత్వం చెబుతోంది. ప్రపంచ స్థాయి డేటా సెంటర్ ఏర్పాటు కావడం ద్వారా.. ఫ్యూచర్ సిటీ బ్రాండ్ అంతర్జాతీయ స్థాయికి చేరుకుంటుందని ప్రభుత్వం ఆశిస్తోంది.
కాగా.. ఇప్పటికే ఫ్యూచర్ సిటీని భవిష్యత్ టెక్నాలజీ, పరిశ్రమలు, ఆధునిక మౌలిక వసతులకు కేంద్రంగా అభివృద్ధి చేయాలని తెలంగాణ ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది. ఈ భారీ పెట్టుబడి మరిన్ని అంతర్జాతీయ, జాతీయ సంస్థలను తెలంగాణ వైపు ఆకర్షించే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు.
మెండుగా బ్లూ కాలర్ ఉద్యోగాలు
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేక ఉద్యోగాలను భర్తీ చేసే అవకాశం ఉన్నప్పటికీ, బ్లూ కాలర్ ఉద్యోగాలను పూర్తిగా భర్తీ చేయడం సాధ్యం కాదని పేర్కొన్నారు. కానీ, టాటా గ్రూప్ చేపడుతున్న ఈ ప్రాజెక్టు ద్వారా బ్లూ కాలర్ ఉద్యోగాలు పెరుగుతాయని అన్నారు. అందుకే.. తెలంగాణ ప్రభుత్వం స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేసిందని తెలిపారు. భవిష్యత్ పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాలు యువతలో పెంచడం ద్వారా వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించడమే లక్ష్యమని చెప్పారు.
రేడియల్ రోడ్డు.. రతన్ టాటాకు అంకితం
ఫ్యూచర్ సిటీకి మౌలిక వసతులను మరింత బలోపేతం చేయడానికి.. త్వరలోనే కొంగరకలాన్ ఫ్యూచర్ సిటీకి రేడియల్ రోడ్డును నిర్మించనున్నట్లు సీఎం తెలిపారు. ఈ రహదారిని భారతరత్న రతన్ టాటాకు అంకితం చేయాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. అంతే కాకుండా.. తెలంగాణను పెట్టుబడులకు అనుకూలమైన రాష్ట్రంగా మార్చి, భారీ పరిశ్రమలు, టెక్నాలజీ సంస్థలను ఆకర్షించడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు.
2047 నాటికి మూడు ట్రిలియన్ డాలర్లు
తెలంగాణను ఆర్థికంగా మరింత బలోపేతం చేయడంలో.. భారీ పెట్టుబడులు కీలక పాత్ర పోషిస్తాయని ప్రభుత్వం భావిస్తోంది. 2037 నాటికి ఒక ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా, 2047 నాటికి మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తెలంగాణను తీర్చిదిద్దాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ లక్ష్యాలను సాధించడానికి ప్రభుత్వం కష్టపడి పనిచేస్తోందని సీఎం తెలిపారు. టాటా, టీసీఎస్, హైపర్ వాల్ట్ వంటి సంస్థల భారీ పెట్టుబడులు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు ఊతమిస్తాయని ప్రభుత్వం ఆశిస్తోంది.
Hyderabad just landed India's Largest AI Data Centre.
1 GW capacity. ₹70,000 Cr investment. 7,000+ jobs.
HyperVault (@TataCompanies ) + @TCS bet big on Telangana's AI future. #TelanganaRising2047 #AI #Hyderabad @OpenAI @OffDSB @revanth_anumula https://t.co/xW4eJPpk42 pic.twitter.com/LSwf5juCtT— Telangana Rising 2047 (@TGRising2047) September 5, 2026


