రూ. 70 వేల కోట్లతో ఏఐ డేటా సెంటర్‌ | CM Revanth Reddy Comments On AI Data Center with 70 thousand crores | Sakshi
Sakshi News home page

రూ. 70 వేల కోట్లతో ఏఐ డేటా సెంటర్‌

Sep 6 2026 1:10 AM | Updated on Sep 6 2026 1:10 AM

CM Revanth Reddy Comments On AI Data Center with 70 thousand crores

సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రులు శ్రీధర్‌బాబు, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్‌ సమక్షంలో ఒప్పంద పత్రాలు మార్చుకుంటున్న టీసీఎస్‌ ఎండీ, సీఈవో కృతివాసన్‌–ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్‌ జాజు. చిత్రంలో హైపర్‌వాల్ట్‌ సీఈఓ దీపేష్‌ కిరణ్, ప్రెసిడెంట్‌ రాజన్న, టీజీఐఐసీ ఎండీ శశాంక

ఫ్యూచర్‌సిటీలో అతిపెద్ద పెట్టుబడి 

టీసీఎస్‌ అనుబంధ సంస్థ హైపర్‌వాల్ట్‌ భాగస్వామ్యం

ఒక గిగావాట్‌ డేటా సెంటర్‌.. ఏడు వేల మందికి ఉపాధి 

ముఖ్యమంత్రి సమక్షంలో ఒప్పందంపై సంతకాలు 

నా కల నెరవేరింది: సీఎం రేవంత్‌రెడ్డి  

ఓఆర్‌ఆర్‌–ఫ్యూచర్‌ సిటీ రోడ్డుకు రతన్‌ టాటా పేరు పెడతామని వెల్లడి 

మాటల్లో కాదు.. చేతల్లో పెట్టుబడులు సాధిస్తున్నాం: మంత్రి శ్రీధర్‌బాబు

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ మౌలిక సదుపాయాల రంగానికి ఊతమిచ్చేలా టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ (టీసీఎస్‌) అనుబంధ సంస్థ హైపర్‌ వాల్ట్‌ రూ.70 వేల కోట్ల పెట్టుబడితో భారీ ప్రాజెక్టును ప్రకటించింది. ఈ ప్రాజెక్టు కోసం హైపర్‌వాల్ట్, దాని భాగస్వామ్య సంస్థలు కలిపి దేశంలోనే అతిపెద్ద భారీ కేంద్రాన్ని ఏర్పాటుచేయనున్నట్లు వెల్లడించింది. ఈ కేంద్రం నిర్మాణాన్ని 18 నుంచి 24 నెలల్లో పూర్తి చేయనున్నట్లు చెప్పింది. ఈ మేరకు శనివారం సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రులు శ్రీధర్‌బాబు, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి. కోమటిరెడ్డి     వెంకట్‌రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్‌ సమక్షంలో టీసీఎస్‌ ఎండీ, సీఈవో కృతివాసన్‌– ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్‌ జాజు ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. ఫ్యూచర్‌ సిటీలో ఒక గిగావాట్‌ సామర్థ్యంతో అంతర్జాతీయ ప్రమాణాలతో భారీ ఏఐ డేటా సెంటర్‌ క్యాంపస్‌ను ఏర్పాటు చేసేందుకు సంస్థ 250 ఎకరాల భూమిని సేకరించింది.  

ఏఐలో ముందు వరుసలో: సీఎం రేవంత్‌రెడ్డి 
తెలంగాణలో ఈస్థాయిలో భారీ పెట్టుబడి రావడంపై సీఎం రేవంత్‌రెడ్డి స్పందిస్తూ. .‘నా కల నెరవేరింది. ఫ్యూచర్‌ సిటీలో రూ. 70 వేల కోట్లతో ఏఐ డేటా సెంటర్‌ ఏర్పాటు కానుండటం గర్వకారణం. నేను టీసీఎస్‌ చైర్మన్‌ చంద్రశేఖర్‌ను దావోస్‌లో కలిసి తెలంగాణలో భారీ పెట్టుబడి పెట్టాలని కోరాను. అప్పుడు ఆయన నవ్వుతూ సరేనన్నారు. ఇప్పుడు కార్యరూపం దాల్చింది. ఈ డేటా సెంటర్‌ ద్వారా 7000 మందికి ఉపాధి లభిస్తుంది. ఇప్పటికే టాటా సంస్థ తరపున రాష్ట్రంలో 85 వేల మంది ఉద్యోగులు తెలంగాణలో పనిచేస్తున్నారు. కొత్తగా ఏడువేలతో అది 92 వేలకు చేరుతుంది. ఔటర్‌ రింగ్‌ రోడ్డు నుంచి ఫ్యూచర్‌సిటీ వరకు నిర్మిస్తున్న మొత్తం 50 కి.మీ. రహదారికి భారతరత్న రతన్‌టాటా పేరు పెడుతున్నాం. 2034 నాటికి ఒక ట్రిలియన్‌ ఎకానమీగా తెలంగాణను నిలపాలన్న స్వప్నం సాకారం కావాలంటే ఫారŠూచ్యన్‌ 500 కంపెనీలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలి. 2047 నాటికి మూడు ట్రిలియన్‌ ఎకానమీని సాధించాలి. దేశ జనాభాలో 2.5 శాతం ఉన్న తెలంగాణ ఇప్పుడు దేశానికి 5 శాతం జీడీపీని అందిస్తోంది. దానిని పది శాతానికి పెంచాలన్నది నా తాపత్రయం. ప్రపంచ ఏఐ విప్లవంలో హైదరాబాద్‌ ఇప్పుడు ముందు వరసలో నిలిచింది’అని రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. రాజకీయ పార్టీల మధ్య విధానాల్లో భిన్నాభిప్రాయాల్లో ఉండవచ్చు కానీ, రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే వారి విషయంలో మాత్రం అలాంటివేమీ ఉండవని స్పష్టం చేశారు. ఏఐతో ఉద్యోగాలు పోతాయన్న భావన ఉందని, ఇందులో ఇంజనీరింగ్‌ టెకీలకు తాను ఎలాంటి గ్యారంటీ ఇవ్వలేనని, కానీ బ్లూకాలర్‌ జాబ్స్‌ వాళ్లకు మాత్రం ఉద్యోగాలకు ఎలాంటి ఢోకా లేదని రేవంత్‌రెడ్డి చెప్పారు. 

మావి మాటలు కాదు...పెట్టుబడులు :శ్రీధర్‌బాబు 
సీఎం రేవంత్‌రెడ్డి భవిష్యత్‌ తరాలను దృష్టిలో పెట్టుకుని ప్రారంభించిన ఫ్యూచర్‌సిటీలో పెట్టుబడుల వెల్లువ ప్రారంభమైందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి డి.శ్రీధర్‌ బాబు చెపప్పారు. తాము కేవలం మాటలు చెప్పడం లేదని. పెట్టుబడుల రాక నిజమని వ్యాఖ్యానించారు. టీసీఎస్‌ ఆతిథ్య, పర్యాటక, పరిశ్రమలు, సేవారంగం,అటవీ రంగాల్లో పెట్టుబుడులు పెడుతోందన్నారు. తెలంగాణవైపు దిగ్గజ సంస్థలు పెట్టుబడులు పెట్టడానికి చూస్తున్నాయన్నారు. తెలంగాణతో ఉన్న అనుబంధాన్ని మరింత బలోపేతం చేసుకున్నామని టీసీఎస్‌ ఎండీ, సీఈవో కె.కృతివాసన్, చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న మద్దతు, ప్రతిపాదించిన పెట్టుబడులపై ఇస్తున్న సహకారానికి హైపర్‌వాల్ట్‌ ప్రెసిడెంట్‌ రాజన్న, సీఈఓ దీపేష్‌ కిరణ్‌ నందాలు కృతజ్ఞతలు తెలిపారు. అధిక సామర్థ్యమున్న కంప్యూటింగ్‌ వ్యవస్థలు, లిక్విడ్‌ కూలింగ్‌ వంటి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఈ కేంద్రాన్ని తీర్చిదిద్దనున్నట్లు చెప్పారు. దేశంలోని అత్యంత అధునాతన, అతిపెద్ద ఏఐ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ క్యాంపస్‌లలో ఇది ఒకటిగా నిలవనుందన్నారు. ఈ కార్యక్రమంలో ఓపెన్‌ ఏఐ చీఫ్‌ టెక్నాలజీ ఆఫీసర్‌ ఉదయ్‌ రుద్రరాజు అమెరికా నుంచి వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొనగా, ప్రభుత్వ సలహాదారు కె.రామకృష్ణారావు, ఇన్వెస్ట్‌ తెలంగాణ సీఈఓ బి. అజిత్‌రెడ్డి, టీజీఐఐసీ ఎండీ కె. శశాంక, పరిశ్రమల శాఖ ప్రత్యేక కార్యదర్శి కృష్ణాదిత్య, డైరెక్టర్‌ ఆఫ్‌ ఇండస్ట్రీస్‌ నిఖిల్‌ చక్రవర్తి పాల్గొన్నారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement