కొడంగల్‌లో సర్వేపల్లి రాధాకృష్ణ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పిస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి, స్పీకర్ ప్రసాద్‌కుమార్, మంత్రి దామోదర రాజనర్సింహ తదితరులు
ప్రజాపాలనలో వికాసం వైపు నడిపిద్దాం: సీఎం రేవంత్‌రెడ్డి
టీచర్ల సమస్యల పరిష్కారానికి రెండేళ్ల సమయం ఇవ్వండి
ఆర్థిక వెసులుబాటును బట్టి అన్నింటినీ పరిష్కరిస్తా
లేదంటే ఎన్నికల పరీక్షలో నన్ను ఫెయిల్ చేయండి
ప్రతిపక్షాల మాయలో పడి రోడ్లపైకి రావొద్దు
కొడంగల్‌లో ఉత్తమ ఉపాధ్యాయులకు అవార్డుల ప్రదానం సందర్భంగా వెల్లడి
వికారాబాద్: ‘పదేళ్లు ఓ కుటుంబం విద్యా వ్యవస్థను విధ్వంసం చేసింది. రెండేళ్లు డెడికేటెడ్‌గా పనిచేసి వికాసం వైపు నడిపించి, దేశానికే దిక్సూచిగా తీర్చిదిద్దుకుందాం’అని సీఎం ఎనుముల రేవంత్‌రెడ్డి చెప్పారు. శనివారం కొడంగల్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నిర్వహించిన ఉపాధ్యాయ దినోత్సవంలో రేవంత్‌రెడ్డి మాట్లా డారు. ‘నాకు రెండేళ్ల సమయం ఇవ్వండి.. విద్యాశాఖ మంత్రిగా మీకు విజ్ఞప్తి చేస్తున్నా.. ఆర్థిక వెసులుబాటును బట్టి ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరిస్తా.. రెండేళ్ల తర్వాత మీరు ఆశించిన ఫలితం రాకపోతే ఎన్నికల పరీక్షలో వంద మార్కులేస్తారో.. సున్నా మార్కులేస్తారో మీ ఇష్టం.
మీ ఉద్యోగులు ఒక్కసారి పరీక్ష రాస్తే 35 ఏళ్లు ఉంటుంది.. మా సర్వీస్ ఐదేళ్లే. ప్రతీ ఐదేళ్లకోసారి పరీక్ష రాయాల్సి ఉంటుంది.. మా పనితీరును బట్టి ఆ పరీక్షలో పాస్ చేస్తారో.. ఫెయిల్ చేస్తారో మీ ఇష్టం’అని రేవంత్ అన్నారు. ప్రతిపక్షాల మాయలో పడి ఉపా«ధ్యాయులు రోడ్ల మీదకు రావద్దని, మీ సమస్యలు పరిష్కరించడానికి విద్యా కమిషన్ వేశామని, కేశవరావును సలహాదారుగా నియమించామని తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్రస్థాయిలో ఎంపిక చేసిన 123 మంది ఉత్తమ ఉపాధ్యాయులకు రేవంత్‌రెడ్డి స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్, మంత్రి దామోదర రాజనర్సింహతో కలిసి అవార్డులు అందజేశారు.
28 నుంచి 17వ స్థానానికి...
ప్రభుత్వ బడుల్లో చదివే వారిలో ఎక్కువ శాతం పేద విద్యార్థులేనని, వీరికి అత్యున్నత విద్యను అందించాల్సిన బాధ్యత ఉపా ధ్యాయులపైనే ఉందని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. విద్యాభివృద్ధిలో 2023లో తెలంగాణ 28వ స్థానంలో ఉండగా, ప్రజా ప్రభు త్వం కొలువుదీరాక ప్రస్తుతం 17వ స్థానానికి వచ్చామన్నారు. ఇది ఉపాధ్యాయుల కృషితోనే సాధ్యమైందని కొని యాడారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యా ర్థుల సంఖ్య ఏటా పెరుగుతోందని తెలిపారు. విద్యా వ్యవస్థలో తీసుకువచ్చిన సంస్కరణలతో పాలిటెక్నిక్‌లో 95శాతం అడ్మిషన్లు నమోదయ్యాయని తెలిపారు.
సాంకేతిక విద్యలో తెలంగాణ వేగంగా దూసుకుపోతోందన్నారు. ఐటీఐలలో ఇంతకుముందు అంబాసిడర్ కారు ఉంచి మెకానిక్ నేర్చుకోమనే వారని, తాను సందర్శనకు వెళ్లినప్పుడు ఇది చూసి ఆశ్చర్యం వేసిందని తెలిపారు. అంబాసిడర్ రిపేర్ నేర్చుకుని ప్రస్తుతం ఉన్న కార్లను ఎలా రిపేర్ చేస్తామని ఓ విద్యార్థి చెప్పగా.. రూ.4 వేల కోట్లతో ప్రతీ నియోజకవర్గంలో ఏటీసీ (అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్లు) ఏర్పాటు చేశామన్నారు. ఐటీఐలను వీటికి అనుసంధానం చేసి, విద్యార్థులను నిష్ణాతులుగా తీర్చిదిద్దుతున్నామని తెలిపారు.
అప్పుల కుప్ప చేశారు..
గత ప్రభుత్వం రూ.8.11 లక్షల కోట్లు అప్పు చేసి పోయిందని సీఎం రేవంత్‌రెడ్డి దుయ్య బట్టారు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వకుండా సర్వీస్‌ను 60 ఏళ్లకు పెంచారని, బెనిఫిట్స్ పెండింగ్‌లో పెట్టి ఆయన (కేసీఆర్) ఫామ్ హౌస్‌లో పడుకుంటే ప్రజా ప్రభుత్వం వచ్చి న 90 రోజుల్లోనే రూ.6 వేల కోట్లు చెల్లించిందని తెలిపారు. ఇప్పుడు కూడా ఖజానాలో ఎన్ని సమస్యలున్నా బకాయిల కోసం ప్రతి నెలా రూ.వెయ్యి కోట్లు విడుదల చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు కె.కేశవరావు, ఎమ్మెల్యేలు రామ్మోహన్‌రెడ్డి, మనోహర్‌రెడ్డి, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్, విద్యాశాఖ కమిషనర్ దేవసేన, ప్రిన్సిపల్ సెక్రెటరీ యోగితారాణా, కలెక్టర్ దీపక్‌తివారీ తదితరులు పాల్గొన్నారు.
కాంగ్రెస్ ఓట్లను తొలగించే కుట్ర: సీఎం
కాంగ్రెస్ అనుకూల ఓట్లను తొలగించేందు కు కేంద్రంలోని బీజేపీ సర్కార్ కుట్ర చేస్తోందని సీఎం రేవంత్‌రెడ్డి ఆరోపించారు. కొడంగల్‌లోని తన నివాసంలో బీఎల్‌ఏలు, పార్టీ ముఖ్య నాయకులతో ఆయన సమావేశమయ్యారు. నోటీసులు ఇచ్చిన వారికి అండగా ఉండి, ఓట్లను రక్షించుకోకపోతే ఆగమైతామన్నారు. గత ఎన్నికల్లో మనం గెలిచింది.. రెండు శాతం ఓట్లతోనేనని, ప్రస్తుతం ఎస్‌ఐఆర్ అస్త్రం వాడి పది శాతం ఓట్లను బీజేపీ తొలగిస్తోందని ధ్వజమెత్తారు.
కాంగ్రెస్ అనుకూల పేదలు, ఎస్సీ ఎస్టీలు, మైనార్టీలే టార్గెట్‌గా ఓట్ల తొలగింపు జరుగుతోందన్నారు. ఈ విషయంలో బీజేపీ, బీఆర్‌ఎస్ కుమ్మక్కయ్యాయని తెలిపారు. గతంలో ఈడీ, సీబీఐ పేరుతో భయపెట్టించిన బీజేపీ.. ఇప్పుడు ఎస్‌ఐఆర్ తెచ్చి తడిగుడ్డతో గొంతు కోస్తోందని మండిపడ్డారు. బిహా ర్, పశ్చిమబెంగాల్‌లో ఇలాంటి వ్యూహంతోనే ఆపార్టీ గెలిచిందన్నారు. ఓటర్లకు అవసరమైన సర్టిఫికెట్లను వెంటనే ఇవ్వాలని కలెక్టర్లు, ఆర్డీఓలు, తహసీల్దార్లను ఆదేశించారు.


