మోదీని వణికించిన యువతకు రేవంత్‌ ఓ లెక్కా? | KTR fires on Revanth Reddy | Sakshi
Sakshi News home page

మోదీని వణికించిన యువతకు రేవంత్‌ ఓ లెక్కా?

Sep 6 2026 3:54 AM | Updated on Sep 6 2026 3:54 AM

KTR fires on Revanth Reddy

బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ధ్వజం 

యువతతో పెట్టుకుంటే పెద్దపెద్ద వాళ్లే దిగిపోయారు.  

రాష్ట్రంలో జాబ్‌ కేలండర్‌ లేదు..,స్కాం కేలండర్‌ నడుస్తోంది 

కాంగ్రెస్‌ మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చింది  

తెలంగాణ సాధించిన కేసీఆర్‌ రాజీనామా చేయాలా? అని నిలదీత 

కరీంనగర్, సిరిసిల్లలో ప్రసంగం

కరీంనగర్‌/సిరిసిల్ల: ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వాన్నే వణికించిన యువతకు తెలంగాణ సీఎం ఓ లెక్క కాదని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఘాటుగా వ్యాఖ్యానించారు. కరీంనగర్‌లో శనివారం నిర్వహించిన ‘యువ సమరభేరి’ సభలో కేటీఆర్‌ మాట్లాడారు. ఉడుకు నెత్తు రు ఉరకలెత్తితే పోరాటం పోటెత్తుతుందని, యువతతో పెట్టుకుంటే పెద్దపెద్ద వాళ్లే దిగిపోయారన్నారు. కష్టపడి సాధించుకు న్న తెలంగాణను పదేళ్లపాటు అభివృద్ధి పథంలో నడిపించా మని పేర్కొన్నారు. కాంగ్రెస్‌ మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చిందని ఆరోపించారు. 

ఏడాదిలో రెండు లక్షల ఉద్యోగాలు, యూత్‌ కమిషన్, ప్రైవేటు కంపెనీల్లో 75 శాతం రిజర్వేషన్, యువతకు రూ.10లక్షల రుణాలు, రూ.4వేల నిరు ద్యోగభృతి, కాలేజీ విద్యార్థినులకు స్కూటీలు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ వంటి హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. రాష్ట్రంలో జాబ్‌ కేలండర్‌ లేదని, స్కాం కేలండర్‌ నడుస్తోందని విమర్శించారు. నోటిఫికేషన్‌ లేకపోయినా లూటిఫికేషన్‌ కొనసాగుతోందన్నారు. నిరుద్యోగుల సమస్యలను ప్రశ్నిస్తే బూతులు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. 

వెయ్యి రోజులైనా హామీలను అమలు చేయలేని రేవంత్‌రెడ్డి రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. తెలంగాణ సాధించిన కేసీఆర్‌ రాజీనామా చేయాలా? అని కేటీఆర్‌ ప్రశ్నించారు. అశోక్‌నగర్‌లో ఏడాదిలో రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన రాహుల్‌గాంధీ.. ఓట్లు వేయించుకున్న తర్వాత తెలంగాణకు అడ్రస్‌ లేకుండా పోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దండం పెట్టి ఓట్లు వేసిన ఉద్యోగులే కాంగ్రెస్‌కు పిండం పెడతారన్నారు.  

జీవో 97 రద్దు చేసే వరకు పోరాడతాం 
రాష్ట్రంలోని పాలిటెక్నిక్‌ కళాశాలల భూములు, ఆస్తులపై రేవంత్‌రెడ్డి ప్రభుత్వం కన్నేసిందని కేటీఆర్‌ ఆరోపించారు. పాలిటెక్నిక్‌ కళాశాలలను కార్మిక శాఖ పరిధిలోకి తెచ్చేందుకు ఉద్దేశించిన జీవో 97ను రద్దు చేసే వరకు బీఆర్‌ఎస్‌ విద్యార్థుల వెంట ఉండి పోరాడుతుందని స్పష్టం చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలం అగ్రహారంలోని పాలిటెక్నిక్‌ కాలేజీలో 20 రోజులుగా ఆందోళన చేస్తున్న విద్యార్థులను కలిసిన కేటీఆర్‌ వారి సమస్యలు తెలుసుకుని మాట్లాడారు. హైదరాబాద్‌లోని మాసబ్‌ట్యాంక్‌తోపాటు సిరిసిల్ల, కరీంనగర్‌ తదితర పట్టణ ప్రాంతాల్లో విలువైన భూముల్లో ఉన్న పాలిటెక్నిక్‌ కళాశాలల ఆస్తులపై ప్రభుత్వం దృష్టి పెట్టిందని ఆరోపించారు. తాను సిరిసిల్ల ఎమ్మెల్యేగా, మాజీ మంత్రిగా, ఈ జిల్లా బిడ్డగా విద్యార్థులకు అండగా నిలుస్తానని హామీ ఇచ్చారు.  

ఎన్నికల హామీలేమయ్యాయి? 
కేసీఆర్‌ ప్రభుత్వం పదేళ్ల పాలనలో విద్యార్థులకు ఉపాధి అవకాశాలు పెంచడంపైనే దృష్టి పెట్టిందని కేటీఆర్‌ తెలిపారు. పెట్టుబడులను ఆకర్షించేందుకు టీఎస్‌–ఐపాస్‌ తీసుకొచ్చామన్నారు. సుమారు 6.50 లక్షల కొత్త ఉద్యోగాలు సృష్టించామని వివరించారు. ఎన్నికల సమయంలో విద్యార్థులు, యువతకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్‌ ప్రభుత్వం అమలు చేయడం లేదని విమర్శించారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు చెల్లించకుండా విద్యార్థులను ఇబ్బందులకు గురిచేస్తున్నారన్నారు. రూ.5 లక్షల విద్యా భరోసా కార్డు, విద్యార్థులకు వివిధ దశల్లో ఆర్థిక సాయం, ఆడపిల్లలకు స్కూటీలు ఇస్తామన్న హామీలను ప్రభుత్వం నెరవేర్చలేదన్నారు.  

కేటీఆర్‌ కారుకు ప్రమాదం 
కరీంనగర్‌ జిల్లా పర్యటనలో కేటీఆర్‌ ప్రయాణిస్తున్న కారుకు అలుగునూర్‌ వద్ద లారీ తగిలింది. ప్రమాదం జరిగిన సమయంలో కేటీఆర్‌ కారులోనే ఉన్నారు. లారీ ఢీకొనడంతో కారు స్వల్పంగా దెబ్బతింది. అయితే కేటీఆర్‌కు ఎలాంటి గాయాలు కాలేదు. ప్రమాదం అనంతరం కేటీఆర్‌ తన పర్యటనను కొనసాగించారు. సమరభేరి సభలో ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్, పాడి కౌశిక్‌రెడ్డి, మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్, విద్యార్థి సంఘాల నాయకులు పాల్గొన్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement