కానీ, ఏం జరుగుతోంది?
నగరంలో స్మార్ట్‌బిన్స్ అందుబాటులోకి వచ్చేనా?
చెత్త వ్యాపించకుండా అండర్ గ్రౌండ్ బిన్స్ ప్రతిపాదనలు
స్మార్ట్‌సిటీలో 10పాయింట్లకు 8 చోట్ల బిగింపు
మొత్తం రూ1.63 కోట్ల నిధులతో ప్రతిపాదనలు
పూర్తిస్థాయిలో ఇన్‌స్టాల్ చేయకుండానే గుత్తేదారుకు బిల్లులు
సాక్షిప్రతినిధి, కరీంనగర్:
సాధారణంగా చెత్తకుండీలు నిండితే.. చెత్త దాని పరిసరాలు, రోడ్లపై వ్యాపిస్తుంది. కుక్కలు, పందులు, పందికొక్కులు చేరి ఆ పరిసరాలను మురికికూపంగా మారుస్తాయి. స్మార్ట్‌సిటీలో వీధులు చెత్తమయం కాకూడదన్న లక్ష్యంతో నగరంలోని పలుచోట్ల అండర్ గ్రౌండ్ స్మార్ట్‌బిన్స్ ఏర్పాటు చేశారు. వీటి నిర్వహణ విషయంలో కరీంనగర్ బల్దియా నిర్లక్ష్యం వహిస్తోంది. ఫలితంగా రూ.లక్షలు వెచ్చించి.. కొనుగోలు చేసిన ఈ ఆధునిక బిన్స్ లక్ష్యం చేరుకోలేకపోయాయి. స్మార్ట్‌బిన్లు అందుబాటులోకి తెస్తామని లోకాయుక్తకు తెలిపిన బల్దియా అధికారులు.. నేటికీ శ్రద్ధ చూపకపోవడం గమనార్హం.
అసలేంటి ఈ బిన్స్ కథ
చెత్తకుండీలు నిండినా, వర్షం పడినా.. దాని పరిసరాల్లోని వీధులు, రోడ్లు, కూడళ్ల మీదకు చెత్త కొట్టుకొస్తుంది. దాంతో నగర సుందీరకరణకు విఘాతం కలుగుతుంది. ఈ సమస్యను అధిగమించేందుకు ఢిల్లీ, ముంబై తదితర బల్దియాలు అండర్ గ్రౌండ్ స్మార్ట్ బిన్స్ విధానాన్ని అవలంబిస్తున్నాయి. భూమిలో వీటిని ఇన్‌స్టాల్ చేస్తారు. ఆధునిక సాంకేతికతతో కూడిన సెన్సార్లు ఇందులో అమరుస్తారు. ఈ స్మార్ట్‌బిన్స్ బల్దియాలోని కమాండ్ కంట్రోల్ రూంకు అనుసంధానంగా ఉంటాయి. చెత్తకుండీ 60శాతం నిండగానే కమాండ్ కంట్రోల్ రూంకు తొలి సిగ్నల్ వెళ్తుంది. 70, 80శాతం నిండుతున్న కొద్దీ.. అలర్ట్‌లు వెళ్తాయి. కమాండ్ కంట్రోల్ సెంటర్ స్మార్ట్‌సిటీ టీం శానిటేషన్ విభాగాన్ని అప్రమత్తం చేస్తారు. దీంతో స్మార్ట్‌బిన్లలో చెత్తను సేకరించేందుకు ప్రత్యేకమైన కాంపాక్టర్ స్టేషన్ (ప్రత్యేక చెత్తసేకరించే వాహనం)లను పంపుతారు. అలా సేకరించిన చెత్తను డంపింగ్ యార్డుకు తరలిస్తారు.
2019లో స్మార్ట్‌సిటీ ప్రాజెక్టులో భాగంగా రూ.1.63 కోట్ల అంచనా వ్యయంతో నగరంలో పది లోకేషన్లలో స్మార్ట్‌బిన్లు ఏర్పాటు చేసేందుకు టెండరు రూపొందించారు. ఒక్క బిన్ కెపాసిటీ 3 క్యూబిక్ మీటర్లు సామర్థ్యంతో ఉండాలని పేర్కొన్నారు. కాంట్రాక్టర్ అదే ఏడాది ఆగస్టులో 10లోకేషన్లకు బదులు 7 లోకేషన్లలోనే స్మార్ట్‌బిన్లు ఏర్పాటు చేశారు. రెండు లోకేషన్లను నిర్ణయించలేదు. మరో లోకేషన్ కోసం ఉమెన్స్ డిగ్రీ కళాశాల ప్రాంతం అనుకున్నా స్థానికుల అభ్యంతరంతో పక్కనబెట్టారు. ఇన్‌స్టాల్ చేసిన ఏడుప్రాంతాల్లో స్మార్ట్‌బిన్లకు సెన్సార్లు ఏర్పాటు చేయలేదు. ఈ బిన్ల నుంచి ఇప్పటి వరకూ ఎలాంటి చెత్త సేకరణ జరగలేదు. గుత్తేదారుకు 2022 జనవరి వరకు రూ.1.06 కోట్లను బల్దియా చెల్లించింది. తరువాత స్మార్ట్‌బిన్స్ పనిచేయడం లేదంటూ ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో కాంట్రాక్టరుకు అక్టోబరు 2022 నుంచి పలుమార్లు నోటీసులు ఇచ్చినా స్పందన రాలేదు. దీనిపై లోకాయుక్తకు ఫిర్యాదులు వెళ్లగా బల్దియా వివరణ ఇవ్వాల్సి వచ్చింది. స్మార్ట్‌సిటీ ప్రాజెక్టు 2025 మార్చి 31న ముగిసిందని, ఇప్పుడు మరోసారి టెండరు పిలవలేమని సాధారణ నిధులతో అందుబాటులోకి తెస్తామని బల్దియా అధికారులు లోకాయుక్తకు వివరించారు. దీనిపై 2026 మార్చి 12న ఆదేశాలు జారీ చేస్తూ మున్సిపల్ సాధారణ నిధులతో స్మార్ట్‌బిన్లను అందుబాటులోకి తెస్తామనడంతో అంగీకారం తెలిపింది. ఐదు నెలలు దాటినా స్మార్ట్‌బిన్స్ అందుబాటులోకి తీసుకువచ్చే విషయంలో కదలిక లేదు. బల్దియాకు ఇంత నష్టం చేసిన గుత్తేదారుపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం కొసమెరుపు. తాజా పాలకవర్గమైనా వీటిని అందుబాటులోకి తెస్తే, కేంద్ర స్వచ్ఛ సర్వేక్షణ్ లాంటి పథకాల్లో మనకు మెరుగైన ర్యాంకులు వచ్చే అవకాశాలున్నాయి.


