కరీంనగర్: కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందని, ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ధ్వజమెత్తారు. కరీంనగర్ అంబేద్కర్ స్టేడియంలో శనివారం నిర్వహించిన బీఆర్‌ఎస్ ‘యువ సమరభేరి’ సభలో ముఖ్య అతిథిగా పాల్గొని రేవంత్‌రెడ్డి ప్రభుత్వంపై ఘాటు విమర్శలు చేశారు.
ప్రభుత్వమే బర్తరఫ్
ఒక్కరిని బర్తరఫ్ చేయడం కాదని రాబోయే రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వమే బర్తరఫ్ కానుందని ఎద్దేవా చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన 420 హామీలను నెరవేర్చకపోతే సీఎం రేవంత్‌రెడ్డి తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
నోటిఫికేషన్లు కాదు.. లూటిఫికేషన్లు
ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి నిరుద్యోగులను నిలువునా మోసం చేసిందని మండిపడ్డారు. రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని ఎన్నికల ముందు హామీ ఇచ్చి.. ఇప్పుడు ఉద్యోగాల కోసం ప్రశ్నిస్తున్న యువతపై అణచివేత చర్యలకు పాల్పడుతోందని ఆరోపించారు. రాష్ట్రంలో ఉద్యోగ నోటిఫికేషన్లు పోయి లూటిఫికేషన్లు నడుస్తున్నాయంటూ తీవ్ర విమర్శలు చేశారు.
రాహుల్.. హైదరాబాద్‌కు ఎందుకు రావు?
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీని సైతం కేటీఆర్ ప్రశ్నించారు. యువత ఎదుర్కొంటున్న నిరుద్యోగ సమస్యపై మాట్లాడేందుకు రాహుల్‌గాంధీ ఎక్కడున్నారని నిలదీశారు. రాష్ట్ర భవిష్యత్తు యువత చేతుల్లోనే ఉందని, హామీలను నిలబెట్టుకోని ప్రభుత్వాన్ని ప్రశ్నించాలన్నారు. తెలంగాణ ప్రయోజనాల కోసం కేంద్రంపై ఒత్తిడి తేవాల్సిన బండి సంజయ్.. రాష్ట్ర సమస్యలను పక్కనపెట్టి రాజకీయ విమర్శలకే పరిమితమవుతున్నారని విమర్శించారు. కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్, మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్, బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు, విద్యార్థి సంఘాల ప్రతినిధులు హాజరయ్యారు.


