కరీంనగర్ కార్పొరేషన్: గడీల పాలనకు ప్రజలు చరమగీతం పాడి వేయిరోజులైందని డీసీసీ అధ్యక్షుడు, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్నారు. ప్రజాప్రభుత్వంలో 7 లక్షల ఇళ్లు , 15 లక్షల రేషన్ కార్డులు ఇచ్చామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి వేయి రోజులు పూర్తయిన సందర్భంగా శనివారం నగరంలోని ఇందిరాచౌక్‌లో సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా మేడిపల్లి సత్యం మాట్లాడుతూ 53 లక్షల కుటుంబాలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్, 43 లక్షల కుటుంబాలకు చేయూత పింఛన్లు ఇస్తున్నామన్నారు. ఆడబిడ్డలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం కోసం 3500 కోట్ల ప్రయాణాలకు ప్రభుత్వం రూ.11,000 కోట్లు ఆర్టీసీకి చెల్లిందన్నారు. వేయి రోజుల్లోనే 70వేలకు పైగా ఉద్యోగాలు ఇచ్చామని, మిగిలిన ఖాళీలకు నోటిఫికేషన్లు ఇస్తామన్నారు.
రాజయ్య, రాజేందర్‌ను పంపారు కదా..
బీఆర్‌ఎస్ ప్రభుత్వం అప్పటి డిప్యూటీ సీఎం రాజయ్యను, మంత్రి ఈటల రాజేందర్‌ను మంత్రివర్గం నుంచి తొలగించారని సత్యం గుర్తు చేశారు. కొండా సురేఖను బర్తరఫ్ చేశారు, ప్రజలు కాంగ్రెస్‌ను బర్తరఫ్ చేస్తారంటూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై స్పందించారు. మంత్రుల తొలగింపుపై కేటీఆర్ ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదన్నారు. కార్పొరేషన్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైద్యుల అంజన్ కుమార్, సుడా మాజీ చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి, వొడితెల ప్రణవ్, పురుమల్ల శ్రీనివాస్, ఉట్కూరి నరేందర్ రెడ్డి, ఆరెపల్లి మోహన్, రహ్మత్ హుస్సేన్, గడ్డం విలాస్‌రెడ్డి పాల్గొన్నారు.


