ఎమ్మెల్సీ పేర్లు ‘అధిష్టానానికి’! | TPCC sends list of aspirants for graduate constituencies to Delhi | Sakshi
Sakshi News home page

ఎమ్మెల్సీ పేర్లు ‘అధిష్టానానికి’!

Sep 6 2026 4:05 AM | Updated on Sep 6 2026 4:05 AM

TPCC sends list of aspirants for graduate constituencies to Delhi

గ్రాడ్యుయేట్‌ నియోజకవర్గాల ఆశావహుల జాబితా ఢిల్లీకి పంపిన టీపీసీసీ

పాలమూరు స్థానం నుంచి ఆరు పేర్లు... నల్లగొండ నుంచి ఏడు పేర్లు

మహబూబ్‌నగర్‌ బరిలో బోదనపల్లి, సామా, గౌరి, శివసేనా

నల్లగొండ స్థానం నుంచి అమిత్, సరోత్తం, లోకేశ్‌లతో పాటు ఆర్టీఐ కమిషనర్‌  

సాక్షి, హైదరాబాద్‌: వచ్చే ఏడాది మార్చి లో జరగనున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గాలకు అధికార కాంగ్రెస్‌ పార్టీ ఆశావహుల జాబితా ఢిల్లీకి చేరినట్టు తెలుస్తోంది. హైదరాబాద్‌–రంగారెడ్డి–పాలమూరు ఉమ్మడి జిల్లాల నియోజకవర్గానికి ఆరుపేర్లు, నల్లగొండ–ఖమ్మం–వరంగల్‌ ఉమ్మడి జిల్లాల నియోజకవర్గానికి ఏడు పేర్ల చొప్పున అధిష్టానానికి వెళ్లాయని, ఈ పేర్లపై పార్టీ ముఖ్యులతో చర్చలు జరిపి ఢిల్లీ పెద్దలు నిర్ణయం తీసుకుంటారని గాందీభవన్‌ వర్గాలు చెబుతున్నాయి.  

మంత్రుల అభిప్రాయం మేరకు.. 
ఈ రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు అధికార పార్టీకి ప్రతిష్టాత్మకంగా మారాయి. సీఎం రేవంత్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తోన్న ఉమ్మడి జిల్లా ఉన్న ఓ నియోజకవర్గం, పూర్తిగా కాంగ్రెస్‌ పార్టీ పట్టున్న మూడు జిల్లాల్లో రెండో నియోజకవర్గం ఉన్న నేపథ్యంలో ఈ రెండు చోట్ల గెలుపే ధ్యేయంగా అభ్యర్థుల కసరత్తును టీపీసీసీ నిర్వహించింది. ఇందులో ఆయా జిల్లాల్లో ప్రాతినిధ్యం వహిస్తోన్న మంత్రుల అభిప్రాయం కీలకంగా తీసుకుంది. పాలమూరు స్థానంలో నేతల అభిప్రాయాలు సేకరించే బాధ్యతలు మంత్రి దామోదరకు, నల్లగొండ స్థానంలో మంత్రి ఉత్తమ్‌కు బాధ్యతలు అప్పగించినట్టు సమాచారం. 

ఈ ఇరువురు ఆయా జిల్లాల్లోని మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ ఇన్‌చార్జులు, డీసీసీ అధ్యక్షులతో మాట్లాడి వారి అభిప్రాయం మేరకు ఆరు పేర్లతో షార్ట్‌ లిస్టు చేసినట్టు తెలుస్తోంది. నల్లగొండ స్థానం నుంచి తెలంగాణ డెయిరీ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ గుత్తా అమిత్‌రెడ్డి, మాజీ మంత్రి దామోదర్‌రెడ్డి కుమారుడు సరోత్తంరెడ్డి, నల్లగొండ డీసీసీ అధ్యక్షుడు పున్నా కైలాశ్‌నేత, యువ నాయకుడు డాక్టర్‌ లోకేశ్‌యాదవ్, చనగాని దయాకర్‌ల పేర్లను పంపినట్టు తెలుస్తోంది. ఓ ఆర్టీఐ కమిషనర్‌ పేరును కూడా పరిగణనలోకి తీసుకోనున్నారు. 

పాలమూరు స్థానం నుంచి టీశాట్‌ సీఈవో బోదనపల్లి వేణుగోపాల్‌రెడ్డి, శాట్స్‌ చైర్మన్‌ శివసేనారెడ్డి, విద్యావేత్త గౌరి సతీశ్, టీïపీసీసీ నేత సామా రామ్మోహన్‌రెడ్డి, ఉపాధ్యాయ సంఘం నేత గాల్‌రెడ్డి హర్షవర్ధన్‌రెడ్డి, చేవెళ్ల అసెంబ్లీ ఇన్‌చార్జి భీంభరత్‌ల పేర్లను పంపినట్టు సమాచారం. ఈ పేర్ల నుంచి ఎవరో ఒకరి అభ్యర్థిత్వాలను ఖరారు చేసే అవకాశాలున్నాయని, ఢిల్లీలో జరిగే సమావేశంలోపు ఇతర పేర్ల ప్రతిపాదనలు ఏవైనా వస్తే వాటిని కూడా పరిగణనలోకి తీసుకుంటారని గాం«దీభవన్‌ వర్గాలు చెబుతున్నాయి. త్వరలోనే ఢిల్లీ పెద్దలతో సీఎంతో పాటు పార్టీ ముఖ్య నేతలు కలిసిన సందర్భంలో ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాలపై కూడా చర్చ జరుగుతుందని, వీలున్నంత త్వరలోనే ఓటరు నమోదు నోటిఫికేషన్‌ రానున్న నేపథ్యంలో ఈలోపే అభ్యర్థిత్వాలు ఖరారవుతాయని అంటున్నాయి.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement