మా నిజాయితీ ఏందో, మీ బతుకేందో అసెంబ్లీలోనే తేల్చుకుందాం: సీఎం రేవంత్‌రెడ్డి
ఈ నెలాఖరు సిరిసిల్లకు, వచ్చే నెలలో సిద్దిపేటకు వస్తా..
కేసీఆర్ అసెంబ్లీకి రా.. లేదంటే రాజీనామా చెయ్..
వచ్చే ఎన్నికల్లో సీట్లు పెరిగితే 115, పాతవైతే 90 సీట్లు మావే..
2034 వరకు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రజాపాలనే..
నకిరేకల్ బహిరంగ సభలో ప్రసంగం
సాక్షి ప్రతినిధి, నల్లగొండ/నకిరేకల్: ‘మీదంతా గతమే బిడ్డా.. రాసిపెట్టుకో.. మీకు భవిష్యత్తు లేదు. మీ బతుకులు చీకటిమయమే.. రేవంత్‌రెడ్డి ఉన్నంతకాలం.. కార్యకర్తలు అండగా నిలిచినంత కాలం బీఆర్‌ఎస్ అనే మాటనే ఎత్తనివ్వం. తెలంగాణ తులసి వనంలో బీఆర్‌ఎస్ గంజాయి మొక్కను పీకుతాం’అని సీఎం రేవంత్‌రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. వచ్చేసారి సిరిసిల్ల, సిద్దిపేటలో కూడా కాంగ్రెస్ గెలుస్తుందన్నారు. ఈ నెలాఖరుకు సిరిసిల్లకు వచ్చి ఆ గడ్డపై మూడు రంగుల జెండా ఎగురవేస్తానన్నారు. వచ్చే నెల్లో సిద్దిపేటపై దండయాత్ర చేస్తామన్నారు. బావబామ్మర్దులు ఎవరిని తెచ్చుకుంటారో తెచ్చుకోవాలని, సిరిసిల్ల, సిద్దిపేటలో తేల్చుకుందామని, కల్వకుంట్ల కుటుంబం కాసుకోవాలన్నారు.
రేవంత్‌రెడ్డి శనివారం నల్లగొండ జిల్లా నకిరేకల్‌లో ఏరియా ఆసుపత్రి భవనాన్ని ప్రారంభించి, పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వేయి రోజుల ప్రజా పాలన ప్రగతి సభలో రేవంత్‌రెడ్డి ప్రసంగించారు. సీట్లు పెరిగితే 117, ఉన్న సీట్లే ఉంటే 90 సీట్లతో మళ్లీ 2029లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ధీమా వ్యక్తంచేశారు. వచ్చే పదేళ్లు తమ ప్రభుత్వమే ఉంటుందని, 2024 నుంచి 2034 వరకు రెండు సార్లు ఇందిరమ్మ రాజ్యం, కాంగ్రెస్‌పాలన ఉంటుందని స్పష్టం చేశారు. ఇప్పటికైనా కేసీఆర్ అసెంబ్లీకి రా.. లేదంటే గౌరవంగా రాజీనామా చెయ్.. గజ్వేల్‌లో తేల్చుకుందాం..’అని పేర్కొన్నారు.
తెలంగాణను ఉద్దరిస్తడట...
‘ఏ ప్రభుత్వంలోనైనా 365 రోజులు ఉద్యోగానికి రాకపోతే ఉద్యోగస్తులను తొలగిస్తారు. వెయ్యి రోజులు ప్రతిపక్ష నాయకుడిగా రూ.22,24,40,000 జీత భత్యాలు, తిరగడానికి బండి, ఉండడానికి ఇల్లు, అన్ని వసతులు తీసుకున్న కేసీఆర్ ఒక్క రోజు కూడా బయటకు రాలేదు. డిస్మిస్ చేయాలా వద్దా? ఆలోచించండి. కేసీఆర్ తీసుకున్న జీతం పేద ప్రజలు కట్టిన పన్నులు కాదా? ఎవడబ్బ సొమ్మని పందికొక్కులా మెక్కి ఫామ్‌హౌస్‌లో పడుకున్న మొనగాడు వస్తుండట, తెలంగాణను ఉద్దరిస్తడట’అని సీఎం రేవంత్‌రెడ్డి ప్రతిపక్షనేత, మాజీ సీఎం కేసీఆర్‌పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
నాకు సంస్కారం లేకపోతే రోడ్డుపై కాలు పెట్టరు
తనకు చదువు రాదని కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ తనకు చదువు వస్తదో రాదో కానీ సంస్కారం ఉందని రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. తనకు సంస్కారం లేకపోతే ఒక్కడు కూడా రోడ్డు మీద కాలు పెట్టరని, ఫామ్‌హౌస్‌లో పడుకోవాలన్నారు. సంస్కారం ఉంది కాబట్టే సీతక్క, కొండా సురేఖను ఇంట్లోకి పిలిచి రాఖీ కట్టించుకున్నానని, అదే తన సంస్కారమన్నారు. సంస్కారం లేని కేటీఆర్ ఆస్తి కోసం సొంత చెల్లిని మెడ పట్టి బయటకు నెట్టిన దుర్మార్గుడని.. తనకు, కేటీఆర్‌కు పోలికేంటన్నారు. ప్రజలను మోసం చేసి కొడుకు, అల్లుడు, బిడ్డ, చుట్టాలను బందిపోట్ల ముఠాను మొత్తం తీసుకొచ్చి దోచుకుతిన్నారన్నారు. కేసీఆర్ బిడ్డ జైలు నుంచి దుఃఖంతో ఇంటికిపోతే, ఆస్తిలో వాటా ఇవ్వాల్సి వస్తుందని కేటీఆర్ ఇంట్లో నుంచి బయటకు గెంటేసిన దుర్మార్గుడని రేవంత్‌రెడ్డి అన్నారు. సొంత చెల్లికి అన్నం పెట్టనోడు చిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తాడా..? అని ఎద్దేవా చేశారు.
పాలనను ప్రజలు బేరీజు వేయండి
ప్రజలు పదేళ్ల ఆనాటి పాలనను, వెయ్యి రోజుల తమ పాలనను బేరీజు వేసుకుని చూడాలని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. నాటి, నేటి సంక్షేమ పథకాలను అంచనా వేయాలన్నారు. తాము వచ్చాక 25,35,000 రైతులకు రూ.2 లక్షల చొప్పున రూ.20,615 కోట్లు రుణమాపీ చేశామన్నారు. దీనిపై సిద్దిపేట గడ్డమీద అయినా, సిరిసిల్ల అడ్డమీద అయినా చర్చకు సిద్ధంగా ఉన్నామని, మీరు సిద్ధమా అని ప్రశ్నించారు. చేతనైతే తండ్రి, కొడుకు, అల్లుడు అసెంబ్లీకి వస్తే లెక్కలు తేల్చుదామన్నారు. మా నిజాయితీ ఏందో, మీ బతుకేందో అసెంబ్లీలోనే తేల్చుకుందామని సవాల్ చేశారు.
విద్య, వైద్యరంగాలకు పెద్ద పీట: మహేశ్‌గౌడ్
ప్రజా పాలన ప్రభుత్వం విద్య, వైద్య రంగాలకు పెద్ద పీట వేసిందని పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ అన్నారు. గతంలో ఉన్న ప్రభుత్వం కుటుంబం కోసం వచ్చిన ప్రభుత్వం. ఇప్పుడున్నది పేద బడుగు, మైనారిటీ వర్గాల ప్రభుత్వమని అన్నారు. గత ప్రభుత్వం బీసీ వర్గాలను విస్మరించిందని, నేడు ప్రజా ప్రభుత్వం సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్, జ్యోతిబాపూలే, సావిత్రిబాయి పూలే విగ్రహాలను పెట్టి గౌరవించిందన్నారు.
పెండింగ్ ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తాం: మంత్రి ఉత్తమ్
దక్షిణ తెలంగాణను సాగునీటి కష్టాల నుంచి గట్టెక్కించేందుకు ఎస్‌ఎల్‌బీసీ సొరంగమే శాశ్వత పరిష్కారమని నీటిపారుదల, పౌరసర ఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చెప్పారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాకు జల సంజీవనిగా మారనున్న ఈ ప్రాజెక్టుకు ఎన్ని అవరోధాలు ఎదురైనా 2028 జూన్ నాటికి సొరంగంతోపాటు పెండింగ్ ప్రాజెక్టుల పనులన్నీ పూర్తి చేస్తామనన్నారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో కొత్త రేషన్‌కార్డులు జారీ కాలేదని, ప్రజలకు దొడ్డు బియ్యమే సరఫరా చేశారని మండిపడడ్డారు.
నియోజకవర్గానికో ఇంటిగ్రేటెడ్ స్కూల్: మంత్రి అడ్లూరి
పేద బడుగు బలహీన వర్గాల పిల్లలు గొప్ప స్థాయిలో చదువుకుని ఉన్నత స్థానానికి చేరుకోవాలని జిల్లా ఇన్‌చార్జి మంత్రి అడ్లూరి లక్ష్మణ్ తెలిపారు. రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గానికి రూ.200 కోట్లతో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ మంజూరు చేసి పనులు కూడా చేపట్టామనన్నారు. మంచి చేస్తున్న ఈ ప్రభుత్వానికి ప్రజల ఆశీస్సులు ఉండాలన్నారు. రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, ఎంపీలు రఘువీర్‌రెడ్డి, చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, మందుల సామేల్, బత్తుల లక్ష్మారెడ్డి, బాలునాయక్, బీర్ల అయిలయ్య, కుంభం అనిల్‌రెడ్డి, జైవీర్‌రెడ్డి, ఎమ్మెల్సీలు శంకర్‌నాయక్, నెల్లికంటి సత్యం పాల్గొన్నారు.


