ప్రజారోగ్యంపై మీథేన్‌ పడగ..! | People in and around Hyderabad are suffering from respiratory problems | Sakshi
Sakshi News home page

ప్రజారోగ్యంపై మీథేన్‌ పడగ..!

Sep 6 2026 4:26 AM | Updated on Sep 6 2026 4:26 AM

People in and around Hyderabad are suffering from respiratory problems

జవహర్‌నగర్‌ డంపింగ్‌ యార్డులోని డబ్ల్యూటీఈ ప్లాంటు వల్ల దేశంలోనే అత్యధిక కాలుష్యం 

ఓపెన్‌ కాస్ట్‌ బొగ్గు గనులు, థర్మల్‌ విద్యుత్‌ ప్లాంట్లకన్నా అధిక కాలుష్యానికి కారణమవుతున్న వైనం

శ్వాసకోశ సమస్యల బారిన పడుతున్న హైదరాబాద్‌ పరిసర ప్రాంత ప్రజలు

సెంటర్‌ ఫర్‌ ఫైనాన్షియల్‌ అకౌంటబిలిటీ తాజా నివేదికలో వెల్లడి

సాక్షి, హైదరాబాద్‌: దేశంలోని పట్టణ ప్రాంతాల్లో చెత్త డంపింగ్‌ యార్డుల వల్ల తలెత్తుతున్న పర్యావరణ కాలుష్యానికి చెక్‌ పెట్టేందుకు ఏర్పాటు చేసిన చెత్త నుంచి విద్యుత్‌ తయారీ (డబ్ల్యూటీఈ) ప్లాంట్లు ఆ సమస్యను తీర్చకపోగా అందుకు విరుద్ధంగా అత్యధిక స్థాయిలో పారిశ్రామిక కాలుష్యానికి కారణమవుతున్నట్లు సెంటర్‌ ఫర్‌ ఫైనాన్షియల్‌ అకౌంటబిలిటీ (సీఎఫ్‌ఏ) చేపట్టిన అధ్యయనంలో వెల్లడైంది. ఓపెన్‌ కాస్ట్‌ బొగ్గు గనులు, థర్మల్‌ విద్యుత్‌ ప్లాంట్లు, రాగి తయారీ పరిశ్రమలను మించిన స్థాయిలో డబ్ల్యూటీఈ ప్లాంట్లు కాలుష్యాన్ని వెదజల్లుతున్నట్లు తేలింది. 

కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (సీపీసీబీ) కాలుష్య సూచీ ప్రకారం వీటికి 100కి 100 స్కోరు వచ్చినట్లు పేర్కొంది. ముఖ్యంగా హైదరాబాద్‌లోని జవహర్‌నగర్‌ డంపింగ్‌ యార్డులో 48 మెగావాట్ల సామర్థ్యంగల డబ్ల్యూటీఈ ప్లాంటు ఉన్నప్పటికీ ఇది దేశంలోని చెత్త డంపింగ్‌ యార్డుల్లోకెల్లా అత్యధిక మీథేన్‌ వాయువు విడుదలకు కారణమవుతోందని.. ప్రపంచంలోనే ఇది నాలుగో అతిపెద్ద మీథేన్‌ కాలుష్యకారకంగా మారిందని సీఎఫ్‌ఏ తెలిపింది. 

జవహర్‌నగర్‌ నుంచి గంటకు 5.9 టన్నుల చొప్పున ఏటా సుమారు 49 వేల టన్నుల మీథేన్‌ వాయువు వాతావరణంలోకి విడుదలవుతోందని.. ఇది ఏటా గ్లోబల్‌ వార్మింగ్‌కు దారితీస్తున్న 39.6 లక్షల టన్నుల కార్బన్‌ డయాక్సైడ్‌కు సమానమని అధ్యయనం పేర్కొంది. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలితోపాటు ఢిల్లీ కాలుష్య నియంత్రణ కమిటీ అధికారిక గణాంకాలను పరిశీలించి రూపొందించిన ఈ నివేదికను సుప్రీంకోర్టుతోపాటు జాతీయ గ్రీన్‌ ట్రిబ్యునల్‌కు సమర్పించినట్లు సీఎఫ్‌ఏ వెల్లడించింది.

హైదరాబాద్‌కు ప్రజారోగ్యం ముప్పు
ఈ నివేదిక ప్రకారం.. జవహర్‌నగర్‌ డంపింగ్‌ యార్డు నుంచి విడుదలవుతున్న అత్యంత విషపూరితమైన రసాయన ద్రవాలు (లీచేట్‌) స్థానిక భూగర్భ జలాలను, చెరువులను పూర్తిగా కలుషితం చేస్తున్నాయి. అంతరిక్షం నుంచి నాసా (నాసా జేపీఎల్‌), కార్బన్‌ మ్యాపర్‌ ఉపగ్రహాలు గుర్తించేంత స్థాయిలో ఇక్కడి ఉద్గారాలు ఉండటం ఇక్కడి పరిస్థితి తీవ్రతకు అద్దంపడుతోంది. దీని ఫలితంగా హైదరాబాద్‌ చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు తీవ్రమైన శ్వాసకోశ సమస్యలు, చర్మ వ్యాధులు, కేన్సర్‌ వంటి ప్రమాదకరమైన రోగాల బారిన పడుతున్నారు. భూగర్భ జలాలు భారీగా కాలుష్యం బారిన పడుతున్నాయి.

మరోవైపు రంగారెడ్డి జిల్లాలోని సిద్ధాపూర్‌లో ఏటా 4 వేల టన్నుల సామర్థ్యంతో రాష్ట్ర ప్రభుత్వం నిర్మించ తలపెట్టిన డబ్ల్యూటీఈ ప్లాంటు వల్ల ఆ ప్రాంతం మరో జవహర్‌నగర్‌గా మారుతుందని సీఎఫ్‌ఏ ఆందోళన వ్యక్తం చేసింది. డబ్ల్యూటీఈ ప్లాంట్ల ఏర్పాటుకు ప్రజాభిప్రాయ సేకరణ, పర్యావరణ ప్రభావ అంచనా నివేదికలు అవసరం లేకుండా ఉండేందుకు 2025లో కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి దేశంలోని డబ్ల్యూటీఈ ప్లాంట్లను రెడ్‌ కేటగిరీ నుంచి బ్లూ కేటగిరీలోకి మార్చడంపై సీఎఫ్‌ఏ అభ్యంతరం తెలిపింది. ఈ నిర్ణయం కాలుష్యకారక పరిశ్రమలకు రక్షణ కల్పించడమేనని.. అందువల్ల డబ్ల్యూటీఈ ప్లాంట్లను తిరిగి రెడ్‌ కేటగిరీలోకి తీసుకురావాలని డిమాండ్‌ చేసింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement