ఎవరికి వారు ఏకాకులే | Men are more likely to suffer from loneliness | Sakshi
Sakshi News home page

ఎవరికి వారు ఏకాకులే

Sep 6 2026 4:31 AM | Updated on Sep 6 2026 4:34 AM

Men are more likely to suffer from loneliness

ఇంట్లో అందరూ ఉన్నాఒంటరిజీవితమే 

సామాజిక మాధ్యమాల వెల్లువలో ఉనికి ప్రశ్నార్థకం  

రోష్ని స్వచ్ఛంద సంస్థ అధ్యయనంలో వెల్లడి 

ఒంటరితనం బాధితుల్లో మగవాళ్లే ఎక్కువ

సాక్షి, హైదరాబాద్‌ : వికాస్‌ (పేరు మార్చాం) ఒక ప్రముఖ ప్రైవేట్‌ సంస్థలో ఉన్నతోద్యోగి. రూ.లక్షకు పైగా జీతం. సకల సదుపాయాలతో కూడిన జీవితం. భార్యాపిల్లలతో ఇల్లంతా సందడి. కానీ అతడు మాత్రం ఒంటరి. తనకంటూ ఎవ్వరూ లేని ఏకాకి. ఏమాత్రం తీరిక లభించినా ఏదో ఒక సోషల్‌ మీడియాలో దూరిపోతాడు. ఇంటిల్లిపాదీ అంతే. ఆత్మీయమైన పలకరింపులు, ప్రేమపూర్వకమైన అనుబంధాలు మచ్చుకైనా లేవు. దీంతో అతడు తీవ్రమైన కుంగుబాటుకు గురయ్యాడు. వికాస్‌ మాత్రమే కాదు, నిత్యం ఉరుకుల పరుగుల జీవితంలో కొట్టుకుపోతున్న ఎంతోమంది ఎదుర్కొంటున్న సమస్య ఇది. 

రిలేషన్స్‌పై రీల్స్‌ ఎఫెక్ట్‌
రోష్ని సంస్థకు వచ్చే ఫిర్యాదుల్లో ఎక్కువ కుటుంబ సంబంధాలే ఉంటున్నట్లు ఆ సంస్థ అదనపు డైరెక్టర్‌ రత్న తెలిపారు. ‘తల్లిదండ్రులు తమను పట్టించుకోవడం లేదని పిల్లలు బాధపడుతున్నారు. అన్నదమ్ములు, అక్కాచెల్లెళ్ల మధ్య అంతరాలు పెరుగుతున్నాయి. రీల్స్‌ ప్రభావంతో రియల్‌ లైఫ్‌లోని రిలేషన్స్‌కు దూరమవుతున్నారని’ఆమె విస్మయం వ్యక్తం చేశారు. సామాజిక మాధ్యమాల్లో కనిపించినట్లుగా తాము ఏమాత్రం సంతోషంగా ఉండలేకపోతున్నట్లు చాలామంది బాధపడుతున్నారు. 

ఇంట్లో అందరూ కలిసి ఆప్యాయంగా మాట్లాడుకోలేకపోతున్నట్లు రోష్ని ప్రతినిధులు తెలిపారు. పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు. మానసిక సమస్యల బారిన పడుతున్నవారిలో మహిళల కంటే పురుషులే ఎక్కువగా ఉండడం గమనార్హం. రోష్నికి రోజుకు 30 నుంచి 45 ఫోన్‌ కాల్స్‌ వస్తుంటాయి. అందులో 75 శాతం కుటుంబ బంధాల సమస్యలేనని వెల్లడైంది. 

సోషల్‌ మీడియా కోరల్లో జీవితాలు  
సహజమైన, ఆహ్లాదకరమైన ఇంటి వాతావరణాన్ని సామాజిక మాధ్యమం కబళిస్తోంది. చాలా మంది ‘తనను ఎవరూ పట్టించుకోవడం లేదని, ఇంటిల్లిపాదీ తనకు దూరమవుతున్నా’రనే మానసిక ఆందోళనకు, కుంగుబాటుకు గురవుతున్నారు. ఇలాంటి వారు ‘ఇంటిల్లిపాదీ వారి వెంటే ఉన్నప్పటికీ ఏకాకులవుతున్నా’రని హైదరాబాద్‌ కేంద్రంగా పనిచేస్తోన్న ప్రముఖ స్వచ్ఛంద సంస్థ రోష్ని అధ్యయనంలో వెల్లడైంది. వివిధ రకాల మానసిక సమస్యలపై ఆ సంస్థ ఏడాది కాలంలో సుమారు 5 వేలకు పైగా కేసులను నమోదు చేసింది.

అగాధం పెరుగుతోంది
ఉద్యోగ, వ్యాపారాల రీత్యా తీరిక లేకుండా గడిపే చాలామంది మగవాళ్లు భార్య నుంచి ప్రేమ, ఆత్మీయత లభించడం లేదని ఆవేదన చెందుతున్నారు. ఉరుకులపరుగుల జీవితంలో కలిసి గడిపేందుకు సమయమే లేనట్లుగా వ్యవహరించడం భార్యాభర్తలిరువురికీ సరైంది కాదు. దంపతు ల మధ్య అనుబంధాలు బలంగా ఉంటేనే పిల్ల లు ఆత్మస్థైర్యంతో ఎదుగుతారు.  – రత్న, అదనపు సంచాలకులు, రోష్ని 

గణాంకాలివి
2025లో మానసిక సమస్యలపై వచ్చిన మొత్తం ఫిర్యాదులు: 5,610 
పురుషులఫిర్యాదులు 4,003 
మహిళల  ఫిర్యాదులు 1,497
ట్రాన్స్‌జెండర్స్‌ నుంచి వచ్చిన ఫిర్యాదులు 110

కారణాలు...
మానసిక సమస్యలు  2,151
రిలేషన్స్‌ 1,733
ఆర్ధికసమస్యలు 987
వివాహేతర సమస్యలు 728
కుటుంబ సమస్యలు 706
అనారోగ్యం వల్ల కుంగుబాటు: 285 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement