source: X
యూఎస్ ఓపెన్ 2026లో ప్రపంచ నంబర్‌వన్ టెన్నిస్ క్రీడాకారిణి అరినా సబలెంకా మ్యాచ్‌కు అనూహ్య అంతరాయం ఏర్పడింది. కోర్టు చుట్టుపక్కల నుంచి గంజాయి వాసన బలంగా వస్తుండటంతో ఆమె మ్యాచ్‌ను కాసేపు ఆపి అంపైర్‌కు ఫిర్యాదు చేసింది.
శుక్రవారం ఉజ్బెకిస్థాన్‌కు చెందిన కమిల్లా రఖిమోవాతో జరిగిన మూడో రౌండ్ మ్యాచ్‌లో సబలెంకా 3-0 ఆధిక్యంలో ఉన్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. సర్వీస్ చేస్తుండగా కోర్టులోకి గంజాయి వాసన వస్తోందని సబలెంకా ఫిర్యాదు చేసింది.
"ఎవరో గంజాయి కాలుస్తున్నారు. వాసన చాలా బలంగా ఉంది. దయచేసి ఏదైనా చేయగలరా..?" అంటూ సబలెంకా అంపైర్‌ను కోరింది. అనంతరం మ్యాచ్ తిరిగి కొనసాగింది.
మ్యాచ్ అనంతరం సబలెంకా ఈ ఘటనపై స్పందించింది. ఎవరైనా తమకు నచ్చిన విధంగా వినోదం పొందడంపై తనకు అభ్యంతరం లేదని, అయితే టెన్నిస్ కోర్టు సమీపంలో గంజాయి కాల్చకుండా ఉంటే మంచిదని చెప్పింది. అత్యుత్తమ స్థాయిలో ఆడేందుకు ప్రయత్నిస్తున్నప్పుడు ఆ వాసనను తట్టుకోవడం కాస్త ఇబ్బందిగా ఉంటుందంటూ నవ్వులు పూయించింది.
కాగా, యూఎస్ ఓపెన్ సందర్భంగా గతంలో కూడా ఆటగాళ్లు గంజాయి వాసనపై ఫిర్యాదులు చేశారు. ప్రాంగణంలో ధూమపానం అనుమతించకపోయినా, న్యూయార్క్‌లో 21 ఏళ్లు పైబడిన వారికి వినోదం కోసం గంజాయి వినియోగం చట్టబద్ధం. సమీపంలోని ఫ్లషింగ్ మెడోస్-కరోనా పార్క్ ప్రాంతం నుంచి గాలి ద్వారా వాసన టెన్నిస్ ప్రాంగణంలోకి వచ్చే అవకాశం ఉంది.
ఇదిలా ఉంటే, హ్యాట్రిక్ టైటిల్ లక్ష్యంతో యూఎస్ ఓపెన్ బరిలోకి దిగిన సబలెంకా ఆ దిశగా మరో అడుగు వేసింది. మూడో రౌండ్‌లో 6–3, 6–4తో రఖిమోవా (ఉజ్బెకిస్తాన్)పై కష్టపడి గెలిచి, ప్రీ క్వార్టర్ ఫైనల్లోకి అడుగుపెట్టింది.
చదవండి: సబలెంకా జోరు


