‘భవిష్యత్తును దృష్టిలో ఉంచుకోండి’ | Global Chess League Season 4 starts today | Sakshi
Sakshi News home page

‘భవిష్యత్తును దృష్టిలో ఉంచుకోండి’

Sep 5 2026 1:14 AM | Updated on Sep 5 2026 1:14 AM

Global Chess League Season 4 starts today

చెస్‌ టోర్నీ నిర్వాహకులకు కార్ల్‌సన్‌ సూచన

నేటి నుంచి గ్లోబల్‌ చెస్‌ లీగ్‌ నాలుగో సీజన్‌

బెంగళూరు: చదరంగపు రారాజు, ఆల్‌టైమ్‌ గ్రేట్‌ మాగ్నస్‌ కార్ల్‌సన్‌ కొన్నేళ్ల క్రితమే వరల్డ్‌ చాంపియన్‌షిప్‌ రేసు నుంచి తప్పుకున్నాడు. ఆ తర్వాత తనకు నచ్చిన రీతిలో, ఎంచుకున్న టోర్నీల్లో మాత్రమే పాల్గొంటున్నాడు. అయితే చెస్‌ టోర్నీ నిర్వాహకులు మాత్రం కార్ల్‌సన్‌ ఆడితే తమ టోర్నీ స్థాయి పెరుగుతుందనే ఆలోచనతో అతనికి అనుగుణంగా షెడ్యూల్‌ రూపొందిస్తున్నారు. దీనిని స్వయంగా కార్ల్‌సన్‌ తప్పు పట్టాడు. తనను దృష్టిలో పెట్టుకొని అలా చేయవద్దని, చెస్‌ ఆట భవిష్యత్తు గురించి ఆలోచించాలని అతను సూచించాడు. ఫార్మాట్‌లు ఎన్ని మారినా, చివరకు ప్రజాదరణ ముఖ్యమని అతను గుర్తు చేశాడు. 

‘ఫలానా టోర్నీలో ఆడాలనే ప్రేరణ నాకు కలిగినప్పుడు మాత్రమే ఇష్టంగా ముందుకు వస్తున్నాను. ఇది ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుంది. అయితే చెస్‌ భవిష్యత్తు కోసం టోర్నీల నిర్వాహకులు మరో విషయాన్ని అర్థం చేసుకోవాలి. నేను ఇంకా ఎంతో కాలం ఆడను. చాలా తక్కువ సమయమే నాకు మిగిలింది. కాబట్టి నా ఇష్టాలను బట్టి మీ ప్రణాళికలు రూపొందించుకోవద్దు. ఇక్కడ ఆడాలని ఆసక్తి కలిగింది కాబట్టే వచ్చాను’ అని ఈ నార్వే స్టార్‌ వ్యాఖ్యానించాడు. సుదీర్ఘ కాలంగా వరల్డ్‌ నంబర్‌వన్‌గా ఉన్న కార్ల్‌సన్‌ చెస్‌ చరిత్రలో అత్యధిక ఎలో రేటింగ్‌ (2882) సాధించిన ఆటగాడిగా గుర్తింపు పొందాడు. 

‘ఇటీవల ప్రపంచ చెస్‌లో ఎన్నో సానుకూల అంశాలు కనిపించడం మంచి పరిణామం. గత ఐదారేళ్లుగా చెస్‌కు పెద్ద సంఖ్యలో అభిమానులు పెరిగారు. కాబట్టి కొత్త తరం కోసం కొత్త తరహాలో చెస్‌ను భిన్నమైన ఫార్మాట్‌లలో అందించాల్సి ఉంది. అయితే అన్నీ ఒకేసారి చేయాల్సిన అవసరం కూడా లేదు’ అని అతను అభిప్రాయపడ్డాడు. మరోవైపు ఆన్‌లైన్‌ చెస్‌ వల్ల ఈ ఆటకు ఆదరణ మరింత పెరిగిందని, దీనిని తగిన రీతిలో ప్రోత్సహిస్తే ప్రపంచ వ్యాప్తంగా చదరంగం స్థాయి పెరుగుతుందని అమెరికా గ్రాండ్‌మాస్టర్‌ లెవాన్‌ ఆరోనియన్‌ అన్నాడు.  

ఒలింపియాడ్‌ తర్వాతే... 
గుకేశ్‌తో జరిగే వరల్డ్‌ చాంపియన్‌షిప్‌ పోరు కోసం ఒలింపియాడ్‌ ముగిసిన తర్వాతే సన్నాహాలు మొదలు పెడతానని చాలెంజర్‌ జవోఖిర్‌ సిందరోవ్‌ అన్నాడు. నవంబర్‌ 24 నుంచి డిసెంబర్‌ 12 వరకు జరిగే ఈ 14 క్లాసిక్‌ గేమ్‌ల పోరులో గుకేశ్‌కు సిందరోవ్‌ సవాల్‌ విసురుతున్నాడు. ‘ప్రస్తుతం రెండు టోర్నీలపైనే నా దృష్టి ఉంది. ఇప్పుడు గ్లోబల్‌ లీగ్‌తో పాటు ఆ తర్వాత జరిగే ఒలింపియాడ్‌ నాకు చాలా ముఖ్యం. ఆ తర్వాతే గుకేశ్‌తో వరల్డ్‌ చాంపియన్‌ గురించి ఆలోచిస్తా’ అని ఉజ్బెకిస్తాన్‌కు చెందిన సిందరోవ్‌ వెల్లడించాడు.  

బరిలో ఆరు జట్లు... 
గ్లోబల్‌ చెస్‌ లీగ్‌ నాలుగో సీజన్‌ పోటీలు నేటి నుంచి జరగనున్నాయి. మొత్తం ఆరు జట్లు కాంటినెంటల్‌ కింగ్స్, గ్యాంజెస్‌ గ్రాండ్‌మాస్టర్స్, ఆలై్పన్‌ పైపర్స్, అమెరికన్‌ గ్యాంబిట్స్, అలస్కన్‌ నైట్స్, ముంబా మాస్టర్స్‌ బరిలోకి దిగుతున్నాయి. ఒక్కో జట్టులో ఆరుగురు ఆటగాళ్లు ఉంటారు. ఆరుగురు ప్లేయర్లు ఒకే సమయంలో ఆరు వేర్వేరు బోర్డులపై ఆడతారు. డబుల్‌ రౌండ్‌ రాబిన్‌ లీగ్‌ తర్వాత నాకౌట్‌ మ్యాచ్‌లు జరుగుతాయి. 20 నిమిషాల ర్యాపిడ్‌ టైమ్‌ కంట్రోల్‌ విధానంలో గేమ్‌లు జరుగుతాయి. 

తెల్ల పావులతో ఆడి గెలిస్తే 3 పాయింట్లు, నల్ల పావులతో గెలిస్తే 4 పాయింట్లు దక్కుతాయి. భారత ఆటగాళ్లలో విశ్వనాథన్‌ ఆనంద్, అర్జున్‌ ఇరిగేశి, అభిమన్యు మిశ్రా (నైట్స్‌), అరవింద్‌ చిదంబరం, ప్రణవ్‌ వెంకటేశ్‌ (కింగ్స్‌), కోనేరు హంపి, విదిత్‌ గుజరాతీ, దివ్య దేశ్‌ముఖ్‌ (పైపర్స్‌), నిహాల్‌ సరీన్‌ (గ్యాంబిట్స్‌), ద్రోణవల్లి హారిక (మాస్టర్స్‌) తమ సత్తా చాటేందుకు సిద్ధమయ్యారు. మాగ్నస్‌ కార్ల్‌సన్‌ పైపర్స్‌ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement