‘కలలో కూడా ఊహించలేదు’ | Smriti Mandhana reaction on breaking the Mithalis record | Sakshi
Sakshi News home page

‘కలలో కూడా ఊహించలేదు’

Sep 5 2026 1:07 AM | Updated on Sep 5 2026 1:07 AM

Smriti Mandhana reaction on breaking the Mithalis record

మిథాలీ రికార్డు బ్రేక్‌ చేయడంపై స్మృతి మంధాన స్పందన  

దుబాయ్‌: మహిళల ఆసియాకప్‌ టి20 క్రికెట్‌ టోర్నమెంట్‌లో భాగంగా హాంకాంగ్‌పై భారీ సెంచరీతో కదంతొక్కిన స్మృతి మంధాన... అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్‌గా రికార్డుల్లోకెక్కింది. టెస్టు, వన్డే, టి20 మూడు ఫార్మాట్‌లలో కలిపి భారత మాజీ కెప్టెన్‌ మిథాలీ రాజ్‌ 10,868 పరుగులు చేయగా... స్మృతి మంధాన (10,880) తాజాగా  ఆమెను అధిగమించింది. 

అయితే ఇది తానెప్పుడూ ఊహించలేదని స్మృతి వెల్లడించింది. కెరీర్‌ తొలినాళ్లలో మిథాలీ రాజ్‌ సారథ్యంలో ఆడిన మంధాన... తన రోల్‌మోడల్‌ రికార్డును తిరగరాయడం ఆనందంగా ఉందని పేర్కొంది. దుబాయ్‌ వేదికగా జరుగుతున్న ఆసియాకప్‌లో భారత జట్టు ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ విజయాలు సాధించి సెమీఫైనల్‌కు అర్హత సాధించింది. హాంకాంగ్‌తో పోరులో ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’గా నిలిచిన స్మృతి తన ప్రయాణాన్ని గుర్తుచేసుకుంది. ఆ వివరాలు ఆమె మాటల్లోనే... 

» బ్యాటింగ్‌ చేస్తున్న సమయంలో ఆ రికార్డు గురించి నాకు తెలియదు. క్రీజులో ఉన్నప్పుడు నా స్కోరు, పరుగుల మీద ఎక్కువ దృష్టి పెట్టను. కేవలం పరిస్థితులకు తగ్గట్లు ఆడుతూ జట్టును గెలిపించేందుకు కృషి చేస్తా.  

»   వెనక్కి తిరిగి చూసుకుంటే భారతీయ క్రికెట్‌లో ఇదొక గొప్ప రోజు. మిథాలీ దీదీ ఒక దిగ్గజం. నేటి తరం క్రికెటర్లకు ఆమె ఆదర్శప్రాయురాలు. మిథాలీ బ్యాటింగ్‌ చూస్తూనే పెరిగాను. అలాంటిది అత్యధిక పరుగుల జాబితాలో ఆమెను అధిగమిస్తానని నేను అసలు ఊహించలేదు. అయితే అగ్రస్థానంలో ఇద్దరు భారతీయులే ఉండటం సంతోషంగా ఉంది.  

»  మహిళల అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక సెంచరీల జాబితాలోనూ ‘టాప్‌’కు చేరడం చాలా ఆనందంగా ఉంది. మిథాలీ మాదిరిగానే... మెగ్‌ లానింగ్‌ (ఆ్రస్టేలియా) కూడా చాలా పెద్ద ప్లేయర్‌. అలాంటిది ఆమె పెరిట ఉన్న అత్యధిక శతకాల రికార్డును తిరగరాయడం గొప్పగా అనిపిస్తోంది. మిథాలీ, లానింగ్‌ నుంచి నేను ఎన్నో విషయాలు నేర్చుకున్నా.  

»  చిన్నప్పటి నుంచి ఆదర్శంగా భావించిన ఇద్దరు ప్లేయర్ల ఘనతలను ఒకే మ్యాచ్‌లో అందుకోవడం గర్వంగా ఉంది. అయితే ఇది ఆరంభం మాత్రమే మరింత ముందుకు సాగడమే నా లక్ష్యం. గత రెండు మ్యాచ్‌ల్లో మా మిడిలార్డర్‌ స్థాయికి తగ్గ ప్రదర్శన కనబర్చలేకపోయినా... వాళ్లంతా ప్రపంచ స్థాయి ప్లేయర్లు. దుబాయ్‌లో పరిస్థితులు బ్యాటింగ్‌కు పెద్దగా అనుకూలంగా లేవు. ఇలాంటి చోట పరుగులు చేయడం సవాలుతో కూడుకున్న విషయం. 

»   వేడి వాతావరణంలో ఎక్కువసేపు క్రీజులో కొనసాగడం కష్టమైన పనే. ఉక్కపోత కారణంగా శరీరం త్వరగా అలిసిపోతుంది. అదృష్టవశాత్తు హాంకాంగ్‌తో మ్యాచ్‌లో నేను ఎక్కువ బౌండరీలు కొట్టగలిగాను. దీంతో వికెట్ల మధ్య పరుగులు తీయాల్సిన అవసరం పెద్దగా రాలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement