మంధాన సునామీ శతకం.. టీ20 చరిత్రలో భారత్‌కు రెండో అతి భారీ విజయం | Womens Asia Cup 2026: India Beat Hong Kong China by 137 runs | Sakshi
Sakshi News home page

మంధాన సునామీ శతకం.. టీ20 చరిత్రలో భారత్‌కు రెండో అతి భారీ విజయం

Sep 3 2026 11:21 PM | Updated on Sep 3 2026 11:34 PM

Womens Asia Cup 2026: India Beat Hong Kong China by 137 runs

source: BCCI X

మహిళల ఆసియా కప్‌ 2026లో భారత జట్టు వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. హాంకాంగ్‌తో జరిగిన గ్రూప్‌-ఎ మ్యాచ్‌లో 137 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌ స్మృతి మంధాన (64 బంతుల్లో 124; 14 ఫోర్లు, 7 సిక్సర్లు) సునామీ శతకంతో చెలరేగడంతో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 193 పరుగులు చేసింది.

అనంతరం భారత బౌలర్లు మూకుమ్మడిగా సత్తా చాటడంతో హాంకాంగ్‌ కేవలం 56 పరుగులకే కుప్పకూలి, ఘోర పరాజయాన్ని ఎదుర్కొంది. మహిళల టీ20 అంతర్జాతీయ క్రికెట్‌లో పరుగుల పరంగా భారత్‌కు ఇది రెండో అతి భారీ విజయం.

మహిళల టీ20ల్లో భారత్‌ భారీ విజయాలు
142 పరుగులు- మలేషియాపై, కౌలాలంపూర్‌, 2018
137 పరుగులు- హాంకాంగ్‌పై, దుబాయ్‌, 2026
104 పరుగులు- యూఏఈపై, సిల్హెట్‌, 2022
100 పరుగులు- బార్బడోస్‌పై, బర్మింగ్‌హామ్‌, 2022

మంధాన రికార్డుల మోత
ఈ మ్యాచ్‌లో సూపర్‌ సెంచరీతో కదంతొక్కిన మంధాన రికార్డుల మోత మోగించింది. మహిళల అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక పరుగులు సాధించిన క్రికెటర్‌గా మిథాలీ రాజ్‌ (10868 పరుగులు)ను అధిగమించింది. అలాగే మహిళల ఆసియా కప్‌ టీ20 చరిత్రలో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన ప్లేయర్‌గానూ (124) నిలిచింది. వీటితో పాటు మహిళల అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక శతకాలు (18) బాదిన ప్లేయర్‌గా అవతరించింది.

విలవిలలాడిన హాంకాంగ్‌
194 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన హాంకాంగ్‌.. భారత బౌలర్ల ధాటికి విలవిలలాడిపోయింది. దీప్తి శర్మ 3, నందిని శర్మ, శ్రీచరణి, ప్రేమా రావత్‌ తలో 2 వికెట్లు తీయడంతో హాంగ్‌కాంగ్‌ ఇన్నింగ్స్‌ కేవలం 16.2 ఓవర్లలోనే ముగిసింది. 

చదవండి: చరిత్ర సృష్టించిన స్మృతి మంధాన.. ప్రపంచ రికార్డులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement