PC: BCCI X
దేశవాళీ ప్రతిష్టాత్మక రెడ్‌బాల్ టోర్నమెంట్ దులిప్ ట్రోఫీ-2026 సీజన్ తుదిదశకు చేరుకుంది. సెప్టెంబరు 6న మొదలయ్యే ఫైనల్లో ఈస్ట్ జోన్- సౌత్ జోన్ అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఇందుకు చెన్నైలోని ఎంఏ చిదంబరం (చెపాక్) స్టేడియం వేదిక.
ముగ్గురు టీమిండియా స్టార్లకు పిలుపు
ఈ నేపథ్యంలో దులిప్ ట్రోఫీ ఫైనల్లో ఆడాల్సిందిగా భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) నుంచి ముగ్గురు టీమిండియా స్టార్లకు పిలుపు వచ్చినట్లు సమాచారం. భారత టెస్టు జట్టు వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్, స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్, శతకాల వీరుడు దేవదత్ పడిక్కల్ సౌత్ జోన్ తరఫున బరిలోకి దిగనున్నట్లు PTI వెల్లడించింది.
కాగా ఈ ముగ్గురూ ఇటీవల శ్రీలంక పర్యటనలో భాగంగా రెండు టెస్టులు ఆడారు. అయితే, సాయి సుదర్శన్ గాయం కారణంగా దూరం కాగా.. పడిక్కల్ ఊహించని రీతిలో తుదిజట్టులోకి వచ్చాడు. మూడో స్థానంలో వచ్చి రెండు సెంచరీలతో అలరించాడు.
మళ్లీ దేశీ క్రికెట్ బరిలో
తదుపరి న్యూజిలాండ్ పర్యటనలో టీమిండియా టెస్టులు ఆడాల్సి ఉండగా.. పడిక్కల్ మళ్లీ దేశీ క్రికెట్ బరిలో దిగుతుండటం విశేషం. దులిప్ ట్రోఫీ ఫైనల్లోనూ సత్తా చాటి టీమిండియాలో తన స్థానం సుస్థిరం చేసుకోవాలని పడిక్కల్ పట్టుదలగా ఉన్నాడు.
ఇక కేఎల్ రాహుల్‌తో పాటు పడిక్కల్ కూడా దేశవాళీ క్రికెట్‌లో కర్ణాటకకు ఆడుతున్న సంగతి తెలిసిందే. వీరిద్దరు చివరగా ఫిబ్రవరి 2026లో జమ్మూ కశ్మీర్‌తో రంజీ ట్రోఫీ ఫైనల్లో బరిలోకి దిగారు. అయితే, జట్టును మాత్రం గెలిపించలేకపోయారు. ఇక సిరాజ్ హైదరాబాద్ ఆటగాడన్న సంగతి తెలిసిందే.
స్టార్ల మధ్య పోరు
దులిప్ ట్రోఫీ ఫైనల్ నేపథ్యంలో కేఎల్ రాహుల్, పడిక్కల్, సిరాజ్ సౌత్ జోన్‌కు ఆడనున్నారు. ఈ జట్టుకు టీమిండియా స్టార్ తిలక్ వర్మ కెప్టెన్. మరోవైపు.. ఈస్ట్ జోన్‌ను ఫైనల్‌కు చేర్చడంలో టీమిండియా చిచ్చర పిడుగు వైభవ్ సూర్యవంశీ తన వంతు పాత్ర పోషించాడు. ఈ జట్టుకు భారత వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ కెప్టెన్ కాగా.. వైభవ్ అతడికి డిప్యూటీ.
టీమిండియా స్టార్ల రాకతో దులిప్ ట్రోఫీ ఫైనల్ మరింత రసవత్తరంగా మారనుంది. తిలక్ వర్సెస్ ఇషాన్ పోరులో.. రాహుల్, పడిక్కల్, సిరాజ్... వైభవ్ సూర్యవంశీ ఆట కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సౌత్ జోన్‌లో తనయ్ త్యాగరాజన్ స్థానాన్ని సిరాజ్ భర్తీ చేస్తున్నట్లు సమాచారం.


