‘నా అభిమాని.. పాకిస్తాన్‌కు వ్యతిరేకంగా ట్వీట్లు చేస్తుంటాడు’ | He was a fan Keeps Tweeting Against: Wasim Akram On Ex India Star | Sakshi
Sakshi News home page

‘నా అభిమాని.. పాకిస్తాన్‌కు వ్యతిరేకంగా ట్వీట్లు చేస్తుంటాడు’

Sep 3 2026 4:09 PM | Updated on Sep 3 2026 4:13 PM

He was a fan Keeps Tweeting Against: Wasim Akram On Ex India Star

PC: X

భారత మాజీ ఆల్‌రౌండర్‌ ఇర్ఫాన్‌ పఠాన్‌ను ఉద్దేశించి పాకిస్తాన్‌ బౌలింగ్‌ దిగ్గజం వసీం అక్రం ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. కెరీర్‌ తొలినాళ్లలో అతడికి ఎన్నో సలహాలు ఇచ్చానని.. ఇర్ఫాన్‌ బౌలింగ్‌ శైలి తన యాక్షన్‌ మాదిరే ఉండేదని పేర్కొన్నాడు.

రాద్దాంతం ఎందుకు?
అయితే, ఇర్ఫాన్‌ పఠాన్‌ ఎల్లప్పుడూ పాకిస్తాన్‌ క్రికెట్‌ గురించి ఏదో ఒక కామెంట్‌ చేస్తూ ఉంటాడని.. అందుకు తమ అభిమానులు కూడా గట్టిగానే బదులిస్తారని పేర్కొన్నాడు. అదే విధంగా భారత్‌- పాక్‌ మ్యాచ్‌లను కూడా సాధారణ మ్యాచ్‌లలాగే చూడాలని.. అనవసరంగా రాద్దాంతం చేయొద్దని ఫ్యాన్స్‌కు వసీం అక్రం విజ్ఞప్తి చేశాడు.

కాగా అంతర్జాతీయ క్రికెట్‌లో పాక్‌ తరఫున 460 మ్యాచ్‌లలో కలిపి వసీం అక్రం 916 వికెట్లు కూల్చాడు. తద్వారా చరిత్రలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించాడు ఈ లెఫ్టార్మ్‌ పేసర్‌. ఆ తర్వాత అతడికి ధీటుగా రాణించిన బౌలర్ల సంఖ్య చాలా తక్కువ. అయితే, ఇర్ఫాన్‌ పఠాన్‌ తన శైలిలో వసీం అక్రంను గుర్తు చేసేవాడు.

ఆస్ట్రేలియాతో సిరీస్‌ సందర్భంగా టీమిండియా తరఫున 2003లో టెస్టుల్లో అడుగుపెట్టాడు ఇర్ఫాన్‌ పఠాన్‌. ఆ సమయంలో కామెంటేటర్‌గా ఉన్న వసీం అక్రంను కలిశాడు. తాజాగా ఓ పాడ్‌కాస్ట్‌ సందర్భంగా ఈ విషయాన్ని గుర్తుచేసుకున్న వసీం అక్రం.. ఇర్ఫాన్‌ పఠాన్‌ ఆట తనకు నచ్చేదని తెలిపాడు.

నా అభిమాని
‘‘2003-2004లో ఇర్ఫాన్‌ తొలిసారి ఆస్ట్రేలియా పర్యటనకు వచ్చాడు. అప్పుడే అతడిని కలిశాను. అప్పుడు నేను కామెంటేటర్‌గా ఉన్నాను. నాకు పెద్ద అభిమానిని అని చెప్పాడు. మా ఆటను చూస్తూ పెరిగానన్నాడు. అతడికి నేను కొన్ని సలహాలు, సూచనలూ ఇచ్చాను.

అతడి కెరీర్‌ ఆరంభం నుంచే గొప్పగా సాగింది. అతడి బౌలింగ్‌ శైలి అచ్చం నా యాక్షన్‌ మాదిరే ఉండేది. అతడు బ్యాటర్లను తికమకపెట్టేవాడు. ఇర్ఫాన్‌ మంచివాడు. ఇప్పటికీ నన్ను కలుస్తూనే ఉన్నాడు.

పాకిస్తాన్‌కు వ్యతిరేకంగా ట్వీట్లు చేస్తుంటాడు
అయితే, పాకిస్తాన్‌ గురించి, పాకిస్తాన్‌కు వ్యతిరేకంగా అతడు ఎల్లప్పుడూ ఏదో ఒక ట్వీట్‌ చేస్తూ ఉంటాడు. అందుకు మా అభిమానులు కూడా సిద్ధంగానే ఉంటారు. అతడికి తమకు నచ్చిన రీతిలో బదులిస్తూ ఉంటారు. అయినా ఇప్పుడు చాలా మంది ఖాళీగానే ఉంటున్నారు.

వారికి పెద్దగా పనిలేదనిపిస్తోంది. క్రికెట్‌ ఒక ఆట మాత్రమే. ఇద్దరిలో ఒకరు గెలుస్తారు.. మరొకరు ఓడిపోతారు. దాని గురించి పొట్లాటలు అవసరం లేదు. ఖాళీ మెదడు దెయ్యాల కొంప అంటారు కదా. అందుకే ఇలాంటివన్నీ వస్తాయి’’ అని వసీం అక్రం చెప్పుకొచ్చాడు. 

చదవండి: అతడిని ఎందుకు తప్పించారో అర్థం కావడం లేదు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement