‘ఎందుకు తప్పించారో సెలక్టర్లకే తెలియాలి’ | IND vs AFG: He has been left out of team for no real reason: Wasim Jaffer | Sakshi
Sakshi News home page

‘అతడిని ఎందుకు తప్పించారో సెలక్టర్లకే తెలియాలి’

Sep 3 2026 3:06 PM | Updated on Sep 3 2026 4:11 PM

IND vs AFG: He has been left out of team for no real reason: Wasim Jaffer

PC: BCCI X

అఫ్గానిస్తాన్‌తో టీ20 సిరీస్‌కు ఎంపిక చేసిన భారత జట్టుపై టీమిండియా మాజీ ‍క్రికెటర్‌ వసీం జాఫర్‌ స్పందించాడు. రింకూ సింగ్‌ విషయంలో యాజమాన్యం వైఖరి ఏమిటో అర్థం కావడం లేదన్నాడు. ప్రపంచకప్‌ గెలిచిన జట్టులో సభ్యుడైన రింకూను ఏ కారణం లేకుండానే తప్పించారని విమర్శించాడు.

ఢిల్లీ వేదికగా అఫ్గాన్‌ టీమిండియాకు ఆతిథ్యం ఇవ్వనున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఇరుజట్ల మధ్య మూడు టీ20 మ్యాచ్‌ల నిర్వహణకు సెప్టెంబరు 13, 15, 17 తేదీల్లో షెడ్యూల్‌ ఖరారైంది. ఇందుకు సంబంధించి బీసీసీఐ ఇటీవలే జట్టును ప్రకటించింది.

వారి రీ ఎంట్రీ.. వీరికి ఉద్వాసన
శ్రేయస్‌ అయ్యర్‌ సారథ్యంలోని ఈ జట్టులోకి సంజూ శాంసన్‌, అక్షర్‌ పటేల్‌, అర్ష్‌దీప్‌ సింగ్‌ తిరిగి రాగా.. జింబాబ్వే పర్యటనలో ఆడిన రింకూ సింగ్‌, హర్ష్‌ దూబే, సూర్యాంశ్‌ షెడ్గే, ప్రభ్‌సిమ్రన్‌ సింగ్‌, అశోక్‌​ శర్మ, ప్రిన్స్‌ యాదవ్‌, యశ్‌ ఠాకూర్‌లను సెలక్టర్లు తప్పించారు. ఇక చైనామన్‌ స్పిన్నర్‌ కుల్దీప్‌ యాదవ్‌కు మరోసారి మొండిచేయి ఎదురైంది.

ఎందుకు తప్పించారో సెలక్టర్లకే తెలియాలి
ఈ నేపథ్యంలో వసీం జాఫర్‌ స్పందిస్తూ.. రింకూ సింగ్‌, కుల్దీప్‌ యాదవ్‌ విషయంలో తనకు ఎంతో బాధ కలిగిందని ఆవేదన వ్యక్తం చేశాడు. ‘‘రింకూ ఐపీఎల్‌లో బాగా ఆడాడు. ఉత్తరప్రదేశ్‌ ప్రీమియర్‌ లీగ్‌లోనూ సత్తా చాటాడు. అక్కడి నుంచి నేరుగా రెడ్‌బాల్‌ క్రికెట్‌ ఆడేందుకు వెళ్లాడు.

దులిప్‌ ట్రోఫీలో భాగమయ్యాడు. కానీ దురదృష్టవశాత్తూ టీమిండియాలో మాత్రం మళ్లీ చోటు కోల్పోయాడు. అతడిని సెలక్టర్లు ఏ కారణం లేకుండానే ఎందుకు తప్పించారో అర్థం కావడం లేదు. బహుశా జట్టులోకి తిరిగి వచ్చిన వారి కోసం రింకూపై వేటు వేసి ఉంటారు.

జట్టులో స్థానం కోల్పోయేంతగా అతడు ఎలాంటి తప్పూ చేయలేదు. తనకు అవకాశం ఇచ్చిన ప్రతీసారీ రింకూ సద్వినియోగం చేసుకున్నాడు. క్లిష్టమైన పరిస్థితుల్లో జట్టును విజయాల దిశగా నడిపించాడు. అతడి ప్రదర్శన బాగానే ఉన్నా జట్టు నుంచి తప్పించారు.

కుల్దీప్‌ విషయంలోనూ అదే తీరు
ఇక కుల్దీప్‌ యాదవ్‌ గురించి ఎంత చెప్పినా తక్కువే. ప్రతిసారీ అతడి విషయంలో బాధపడటం తప్ప మనమేమీ చేయలేము. అతడి పట్ల సెలక్టర్లు ఎందుకో సుముఖంగా లేరు’’ అని వసీం జాఫర్‌ యూట్యూబ్‌ చానెల్‌ వేదికగా తన అభిప్రాయాలు పంచుకున్నాడు.

కాగా ఐపీఎల్‌-2026లో కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ స్టార్‌ రింకూ సింగ్‌.. 295 పరుగులు చేశాడు. యూపీ టీ20 లీగ్‌లో ఆరు ఇన్నింగ్స్‌ ఆడి 169 పరుగులు సాధించాడు. దులిప్‌ ట్రోఫీలో సెంట్రల్‌ జోన్‌ తరఫున 80 పరుగులు చేశాడు. ఇందులో ఓ అర్ధ శతకం కూడా ఉంది. 

ఇదిలా ఉంటే.. కుల్దీప్‌ యాదవ్‌ టీమిండియా తరఫున ఇప్పటికి 54 మ్యాచ్‌లు ఆడి 95 వికెట్లు కూల్చాడు. టీ20 ప్రపంచకప్‌-2026 సందర్భంగా పొట్టి ఫార్మాట్లో తన చివరి మ్యాచ్‌ ఆడాడు.

చదవండి: బీసీసీఐ బిగ్‌ ప్లాన్‌!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement