PC: BCCI X
టీమిండియా యాజమాన్యం తీరుపై విమర్శలు వస్తున్నాయి. హెడ్ కోచ్ గౌతం గంభీర్, చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ తమకు నచ్చిన క్రికెటర్లను ఆడించేందుకు అర్హులైన వారికి బలి చేస్తున్నారని సోషల్ మీడియా వేదికగా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
కాగా స్వదేశంలో అఫ్గానిస్తాన్‌తో జరిగే టీ20 సిరీస్‌కు భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) మంగళవారం తమ జట్టును ప్రకటించిన సంగతి తెలిసిందే. అఫ్గాన్ ఢిల్లీ వేదికగా టీమిండియాకు ఈ సిరీస్‌లో ఆతిథ్యం ఇస్తుండగా.. ఇందుకోసం పదిహేను మంది సభ్యులతో కూడిన జట్టును బీసీసీఐ ఎంపిక చేసింది.
అదే జట్టు
సెప్టెంబరులో జపాన్‌లో జరిగే ఆసియా క్రీడల కోసం ఎంపిక చేసిన జట్టులో ఎలాంటి మార్పూ లేకుండానే ఈ సిరీస్ కోసం సెలక్టర్లు జట్టును ఎంచుకున్నారు. కాగా మోకాలి గాయంతో చాలా కాలంగా ఆటకు దూరమైన టీమిండియా ప్రధాన ప్రధాన పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా పునరాగమనం చేసేందుకు సిద్ధమయ్యాడు. ఇంగ్లండ్‌తో మూడో వన్డే సమయంలో గాయపడిన బుమ్రా ఆ తర్వాత శ్రీలంకతో రెండు టెస్టుల సిరీస్‌లో కూడా ఆడలేదు.
ఆ నలుగురు...
ఇదిలా ఉంటే.. బుమ్రాతో పాటు గాయాల నుంచి కోలుకుంటున్న మరో ముగ్గురు ఆటగాళ్లు నితీశ్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, హర్షిత్ రాణాలకు కూడా అఫ్గాన్‌తో ఆడే జట్టులో చోటు దక్కింది. అయితే ఈ నలుగురి ఎంపిక కూడా ఫిట్‌నెస్‌పై ఆధారపడి ఉంటుందని, పూర్తిగా ఫిట్‌గా మారితేనే సిరీస్‌కు అందుబాటులో ఉంటారని బీసీసీఐ స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో బీసీసీఐ తీరుపై టీమిండియా అభిమానులు మండిపడుతున్నారు.
అతడు ఎందుకు?.. ముగ్గురిలో ఇద్దరు ఫిట్‌గా లేరు
‘‘ముగ్గురు ఫాస్ట్ బౌలర్ల (బుమ్రా, హర్షిత్, అర్ష్‌దీప్)ను ఎంపిక చేశారు. కానీ అందులో ఇద్దరు (బుమ్రా, హర్షిత్) ఫిట్‌నెస్ సాధిస్తేనే ఆడతారట. వాళ్లు ఒక మ్యాచ్ ఆడి మళ్లీ గాయపడితే పరిస్థితి ఏంటి? హర్షిత్ ఇంగ్లండ్ పర్యటనలో అలాగే గాయపడ్డాడు కదా!..
గంభీర్ ప్రియ శిష్యుడు కాబట్టే అతడిని మరోసారి ఎంపిక చేశారా?.. హర్షిత్‌కు బదులు ఫామ్‌లో ఉన్న మహ్మద్ షమీని పిలిపించవచ్చు కదా!.. లేదంటే భువనేశ్వర్ కుమార్‌ను ఎంపిక చేయాల్సింది.
ఇక వాషింగ్టన్ సుందర్.. అతడు ఎప్పుడూ గొప్పగా ఆడిందేమీ లేదు. పూర్తి ఫిట్‌నెస్ సాధించలేదు అంటున్నారు. అలాంటపుడు జట్టులో ఎందుకు? వాషీకి బదులు కృనాల్ పాండ్యాను జట్టుకు ఎంపిక చేస్తే మెరుగ్గా ఉండేది. కానీ గంభీర్‌కు అది ఇష్టం లేదేమో!..
పసికూన ఐర్లాండ్ చేతిలో 2-0తో పరాభవం తర్వాత కూడా ఇంకా తమకు నచ్చిన ఆటగాళ్లకు మాత్రమే అవకాశాలు ఇస్తామంటే.. టీమిండియా మున్ముందు మరిన్ని పరాభవాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అర్హులైన ఆటగాళ్లను ఎంపిక చేయండి. జట్టుకు అదే మంచిది’’ అని సోషల్ మీడియా వేదికగా టీమిండియా యాజమాన్యానికి నెటిజన్లు చురకలు అంటిస్తున్నారు.
ఇదిలా ఉంటే.. ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా ఇంకా కోలుకోకపోవడంతో అతడిని ఈ సిరీస్‌కు ఎంపిక చేయలేదు. మరోవైపు.. ఫిట్‌గా మారిన వరుణ్ చక్రవర్తి తిరిగి జట్టులోకి వచ్చాడు.
వాళ్లను పక్కన పెట్టేశారు
జింబాబ్వేతో సిరీస్‌లో ఆడని సంజు శాంసన్, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్ మళ్లీ జట్టులోకి రాగా...ఈ పర్యటనలో టీమిండియాలో భాగంగా ఉన్న రింకూ సింగ్, ప్రభ్‌సిమ్రన్ సింగ్, హర్ష్ దూబే, సూర్యాంశ్ షెడ్గే, అశోక్ శర్మ, ప్రిన్స్ యాదవ్, మయాంక్ యాదవ్, యశ్ ఠాకూర్‌లను పక్కన పెట్టారు.
ఈ నెల 13, 15, 17 తేదీల్లో న్యూఢిల్లీలో భారత్, అఫ్గానిస్తాన్ మధ్య మూడు టీ20లు జరుగుతాయి. ఇందుకు ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదిక.
చదవండి: ‘నువ్వెంతగా కష్టపడ్డావో చూశాను.. మన పిల్లలకు నువ్వే హీరో’


