PC: Instagram
అర్జెంటీనా ఫుట్‌బాల్ దిగ్గజం లియోనల్ మెస్సీ అంతర్జాతీయ కెరీర్ ముగిసింది. జాతీయ జట్టు తరఫున తాను ఇక ఆడనంటూ ఈ లెజెండరీ ప్లేయర్ రిటైర్మెంట్ ప్రకటించాడు. ఈ నేపథ్యంలో మెస్సీ భార్య ఆంటోనిలా రొకుజో సోషల్ మీడియాలో షేర్ చేసిన పోస్ వైరల్‌గా మారింది.
నువ్వెంతగా కష్టపడ్డావో చూశాను
‘‘నీ జీవితంలోని అతి ముఖ్యమైన అధ్యాయాన్ని దగ్గరగా చూసినందుకు నేను ఎంతగా గర్విస్తున్నానో చెప్పడానికి మాటలు సరిపోవు. ఎన్నో ఏళ్లు.. ఎన్నెన్నో జ్ఞాపకాలు.. మరెన్నో ఆనందాలు.. ఇంకెన్నో కఠిన సమయాలు. వీటన్నింటిలో నేనూ ఉన్నాను. నువ్వు ఎంతగా కష్టపడ్డావో చూశాను.

అదే సమయంలో తిరిగి పోరాడి నిలదొక్కుకున్న తీరుకు సాక్ష్యంగా నిలిచాను. అనుకున్న లక్ష్యాలు చేరుకునే క్రమంలో అవాంతరాలు ఎదురైనపుడు నువ్వు వెనక్కి తగ్గలేదు. ప్రయత్నలోపం లేకుండా ముందుకు సాగుతూ అనుకున్నది సాధించావు.
సంతోషాలు వెల్లివిరిశాయి
నీ కలలు నిజమయ్యాయి.. మన జీవితంలో సంతోషాలు వెల్లివిరిశాయి. వాటన్నింటిలో నాకూ భాగం ఉన్నందుకు నేను అదృష్టవంతురాలిని. ఇక అన్నింటికీ మించి మన పిల్లలు. వాళ్లు నీ ఎదుగుదలను చూస్తూ పెరిగాను. వాళ్ల నాన్న ఆశయం కోసం ఎలా పోరాడారో కళ్లారా చూశారు.
ఎన్ని కష్టాలు ఎదురైనా పట్టుదల వీడకూడదని నేర్చుకున్నారు. విజయం వరించే వరకు అలుపెరుగక శ్రమించాలని తెలుసుకున్నారు. ముఖ్యంగా నువ్వు ప్రపంచకప్ ట్రోఫీని ముద్దాడటం చూసి వాళ్లు ఎంతగానో సంతోషించారు. ఏదో ఒకరోజు ఈ అనుభూతిని వాళ్లు పూర్తిగా ఆస్వాదిస్తారు.

వాళ్ల నాన్నను చూసి మరింత గర్వపడతారు. నాకు కూడా నువ్వు గర్వకారణం. నీ దారిలో ఎన్నో ముళ్లున్నా దాటుకుంటూ ఈ స్థాయికి చేరుకున్నావు. నీకు దగ్గరగా ఉండటం కంటే నాకు గొప్ప అదృష్టం ఇంకేం ఉంటుంది’’ అని ఆంటోనిలా తీవ్ర భావోద్వేగానికి లోనైంది.
ఐదేళ్ల వయసు నుంచే స్నేహం
అర్జెంటీనాలో మూడో అతిపెద్ద పట్టణంగా పేరొందిన రొసారియోలో మెస్సీ- ఆంటోనిలా జన్మించారు. ఐదేళ్లు వయసు నుంచే కలిసి ఆడుకునేవారు. ఆంటోనిలా కజిన్ లుకాస్ మెస్సీకి స్నేహితుడు. అలా వాళ్ల వయసుతో పాటు స్నేహం కూడా పెరుగుతూ వచ్చింది.
ఈ క్రమంలో సహజీవనం చేసిన మెస్సీ- ఆంటోనిలా 2008లో తమ బంధాన్ని అధికారికంగా ప్రకటించారు. మెస్సీ బార్సిలోనా, అర్జెంటీనా జట్ల తరఫున అరంగేట్రం చేసిన తర్వాత ఈ విషయాన్ని వెల్లడించారు.
కాగా ఆంటోనిలా హ్యూమానిటీస్, సోషల్ సైన్సెస్ విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ చేసింది. అదే విధంగా.. డెంటల్ సైన్స్‌లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసింది. ప్రస్తుతం ఆమె మోడల్‌గా పనిచేస్తున్నట్లు సమాచారం.
ముచ్చటగా ముగ్గురు
ఇద్దరు కుమారులు తియాగో (2012), మాటియో (2015) జన్మించిన తర్వాత.. 2017లో మెస్సీ- ఆంటోనిలా పెళ్లి చేసుకున్నారు. ఆ మరుసటి ఏడాది వీరికి మరో కుమారుడు సీరో జన్మించాడు.
ఇక మెస్సీ ముగ్గురు కొడుకులకు ఫుట్‌బాల్ అంటే పంచప్రాణాలు. తండ్రి ఎక్కడ మ్యాచ్ ఆడుతున్నా తల్లితో కలిసి స్టేడియానికి వెళ్తారు. తండ్రిని ఉత్సాహపరుస్తూ స్టాండ్స్‌లో సందడి చేస్తారు. ఇదిలా ఉంటే.. తియాగో తన తండ్రి మెస్సీ అడుగుజాడల్లో ఫుట్‌బాలర్‌గా ఎదగాలనే పట్టుదలతో ఉన్నాడు.
చదవండి: జొకోవిచ్ అలసిపోయాడు


