source: X
నమీబియా టీ20 ట్రై సిరీస్‌లో ఇవాళ ఉత్కంఠ పోరు జరిగింది. జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌లో నమీబియా చివరి వరకు పోరాడినా ఓటమిపాలైంది. జింబాబ్వే అద్భుతంగా ఒత్తిడిని తట్టుకుని థ్రిల్లింగ్ విక్టరీ (5 పరుగుల తేడాతో) సాధించింది.
తొలుత బ్యాటింగ్ చేసిన జింబాబ్వే, ర్యాన్ బర్ల్ (57 నాటౌట్), బ్రాడ్ ఈవాన్స్ (37 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడటంతో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 195 పరుగులు చేసింది. బెన్ కర్రన్ (38), బ్రియాన్ బెన్నెట్ (32) కూడా రాణించారు. నమీబియా బౌలర్లలో కెప్టెన్ ఎరాస్మస్ 3 వికెట్లు తీయగా.. బెర్నాల్డ్ స్కోల్జ్, స్మిట్, హైంగో తలో వికెట్ పడగొట్టారు.
అనంతరం లక్ష్య ఛేదనలో నమీబియా చివరి ఓవర్ వరకు పోరాడి 190 పరుగులకు ఆలౌటై, ఓటమిపాలైంది. ఏడు, ఎనిమిది నంబర్ ఆటగాళ్లు జేన్ గ్రీన్ (54), అలెగ్జాండర్ వోల్షెంక్ (56) వీరోచితంగా పోరాడినప్పటికీ నమీబియాను గెలిపించలేకపోయారు. బ్యాట్‌తో సత్తా చాటిన బ్రాడ్ ఈవాన్స్ బంతితో (3-41), ఫీల్డ్‌లోనూ (ఆఖర్లో రనౌట్) చెలరేగి జింబాబ్వేకు అద్భుత విజయాన్నిందించాడు.
చివరి ఓవర్‌లో ఉత్కంఠ
చివరి ఓవర్‌లో నమీబియా విజయానికి 16 పరుగులు అవసరం కాగా.. ఆ జట్టు కేవలం 10 పరుగులకే పరిమితమై, ఏకంగా చివరి 4 వికెట్లు కోల్పోయి ఓటమిపాలైంది. ఆ ఓవర్‌ను బ్రాడ్ ఈవాన్స్ అద్భతంగా బౌల్ చేశాడు.
నాలుగు, ఆరు బంతులకు వికెట్లు తీయడమే కాకుండా మధ్యలో ఐదో బంతికి రనౌట్ కూడా చేశాడు. అంతకుముందు రెండో బంతికి సికందర్ రజా కీలక బ్యాటర్ జేన్ గ్రీన్‌ను రనౌట్ చేశాడు. చివరి 3 బంతులకు వికెట్లు కోల్పోయిన నమీబియా, గెలుస్తుందనుకున్న మ్యాచ్‌లో ఓటమిపాలైంది. ఈ టోర్నీ తొలి మ్యాచ్‌లో నమీబియా పటిష్టమైన సౌతాఫ్రికాకు షాకిచ్చిన విషయం తెలిసిందే.


