2027 వన్డే వరల్డ్‌కప్ లోగో విడుదల
న్యూఢిల్లీ: వచ్చే ఏడాది జరగనున్న ఐసీసీ వన్డే ప్రపంచకప్ వేదికలు ఖరారయ్యాయి. దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియా సంయుక్తంగా ఆతిథ్యమివ్వనున్న ఈ వరల్డ్‌కప్‌లో మొత్తం 12 వేదికల్లో మ్యాచ్‌లు నిర్వహించనున్నారు. దీనికి సంబంధించిన వివరాలను ఐసీసీ అధ్యక్షుడు జై షా వెల్లడించారు. 2027 వరల్డ్ కప్ లోగోనూ దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియా క్రికెట్ సంఘాల అధ్యక్షులతో కలిసి జై షా ఆవిష్కరించారు.
చివరగా 2003లో దక్షిణాఫ్రికా వేదికగా వన్డే ప్రపంచకప్ జరగగా... మళ్లీ 24 ఏళ్ల తర్వాత అక్కడ ఈ మెగా టోర్నీ జరగనుంది. మొత్తం 12 వేదికల్లో ఎనిమిది (జొహన్నెస్‌బర్గ్, సెంచూరియన్, డర్బన్, గెబ్రా, కుగొంపో సిటీ, కేప్‌టౌన్, పార్ల్, బ్లూమ్‌ఫాంటైన్) దక్షిణాఫ్రికాలో ఉన్నాయి. ఇక్కడే 54 మ్యాచ్‌లు నిర్వహించనున్నారు. జింబాబ్వేలోని హరారే, బులవాయో, విక్టోరియా ఫాల్స్‌లోని మూడు మైదానాలు కూడా వరల్డ్‌కప్ మ్యాచ్‌లకు ఆతిథ్యమివ్వనున్నాయి. ఇక్కడ 7 నుంచి 10 మ్యాచ్‌లు జరిగే అవకాశంఉంది.

ఇక మరో ఆతిథ్య దేశం నమీబియాలోని ఏకైక మైదానంలో కనీసం 3 మ్యాచ్‌లు నిర్వహించవచ్చు. ఈ వేదికలన్నీ గతంలోనే నిర్ణయించగా... విక్టోరియా ఫాల్స్ మైదానాన్ని కొత్తగా చేర్చారు. అక్కడ కొత్తగా నిర్మించిన 10 వేల మంది అభిమానుల సామర్థ్యం గల స్టేడియంలో వరల్డ్‌కప్ మ్యాచ్‌లు జరగనున్నాయి. కాగా మ్యాచ్‌ల పూర్తి షెడ్యూల్ మాత్రం వచ్చే ఏడాది విడుదల కానుంది.


