source: X
వెస్టిండీస్‌తో తాజాగా ముగిసిన టెస్ట్ మ్యాచ్‌లో ఘోర పరాజయాన్ని ఎదుర్కొన్న పాకిస్తాన్ జట్టుకు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు పేసర్లు ఖుర్రమ్ షెహ్‌జాద్, మహ్మద్ అబ్బాస్‌పై అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) క్రమశిక్షణా చర్యలు తీసుకుంది.
ఇద్దరూ ఐసీసీ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినట్లు (వికెట్లు తీసిన అనంతరం ప్రత్యర్థి బ్యాటర్లను రెచ్చగొట్టేలా ప్రవర్తించారు) తేలడంతో తలో డీమెరిట్ పాయింట్ కేటాయించింది. అలాగే అబ్బాస్‌కు అధికారిక హెచ్చరికతో పాటు ఖుర్రమ్ షెహ్‌జాద్‌కు మ్యాచ్ ఫీజులో 15 శాతం జరిమానా విధించింది.
మ్యాచ్ రిఫరీ జెఫ్ క్రో ప్రతిపాదించిన శిక్షను ఇద్దరూ అంగీకరించడంతో అధికారిక విచారణ అవసరం లేకుండా పోయింది.
ఈ మ్యాచ్‌లో అబ్బాస్ తొలి ఇన్నింగ్స్‌లో మూడు, రెండో ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు పడగొట్టాడు. షెహ్‌జాద్ కూడా రెండు ఇన్నింగ్స్‌ల్లో రెండేసి వికెట్లు తీశాడు. వీరిద్దరూ అద్భుతంగా రాణించినా పాక్‌కు ఓటమి తప్పలేదు. 211 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేక 120 పరుగులకే కుప్పకూలి 90 పరుగుల తేడాతో ఓటమి పాలైంది.రెండు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో రెండో టెస్ట్ ఆగస్టు 2 నుంచి క్వీన్స్ పార్క్‌లో జరగనుంది.


