వన్డే ప్రపంచకప్-2027కు సంబంధించి అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) కీలక అప్‌డేట్ ఇచ్చింది. ఈ మెగా టోర్నీకి ఆతిథ్యమిచ్చే వేదికలను ఐసీసీ ఖారారు చేసింది. ఈ ప్రతిష్టాత్మక ఈవెంట్ దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియా దేశాల్లోని 12 మైదానాల్లో జరగనున్నట్లు ఐసీసీ ప్రకటించింది.
జోహన్నెస్‌బర్గ్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ఈ వివరాలను వెల్లడించారు. ఈ సందర్భంగా ఐసీసీ చీఫ్ జైషా మాట్లాడుతూ.. "వన్డే వరల్డ్‌కప్-2027కు సంబంధించి మరో కీలక అడుగు పడింది. 24 సంవత్సరాల సుదీర్ఘ విరామం తర్వాత ఈ మెగా టోర్నమెంట్ ఆఫ్రికా ఖండానికి తిరిగి రావడం క్రికెట్ చరిత్రలోనే ఒక చారిత్రాత్మక ఘట్టం. దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియా దేశాలు తమ ఆత్మీయత, క్రీడాభిమానంతో క్రికెట్ ప్రేమికులకు మరపురాని జ్ఞాపకాలను అందిస్తాయని ఆశిస్తున్నాం" అని అన్నారు.
కాగా ఈ టోర్నీలో మెజారిటీ భాగం మ్యాచ్‌లు సౌతాఫ్రికాలోనే జరగనున్నాయి. ఆధునిక స్టేడియాల, మౌలిక వసతులు, ప్రేక్షకుల ఆదరణ దృష్ట్యా అక్కడే 8 నగరాలను ఐసీసీ ఎంపిక చేసింది. జింబాబ్వేలో 3 వేదికలు, నమీబియా రాజధాని విండ్‌హాక్‌లో ఒక వేదికలో మ్యాచ్‌లు నిర్వహించనున్నారు. జోహన్నెస్‌బర్గ్‌లోని చారిత్రాత్మక 'వాండరర్స్ స్టేడియం' లో ఈ టోర్నీ ప్రారంభ వేడుకలతో పాటు ఫైనల్ పోరు జరగనుంది.
ఈసారి 50 ఓవర్ల వరల్డ్‌కప్‌ను కొత్త ఫార్మాట్‌లో నిర్వహించనున్నారు. మొత్తం 14 జట్లు పాల్గొనే ఈ టోర్నీలో 57 మ్యాచ్‌లు జరుగుతాయి. పోటీతత్వాన్ని పెంచేందుకు మూడు దశల విధానాన్ని ఐసీసీ ప్రవేశపెట్టనుంది.
12 నుంచి 14వ ర్యాంకులో ఉన్న జట్ల మధ్య జరిగే 'సూపర్ సిరీస్'తో టోర్నీ ప్రారంభమవుతుంది. ఆ తర్వాత 12 జట్లను రెండు గ్రూపులుగా విభజించి గ్రూప్ స్టేజ్ నిర్వహిస్తారు. అనంతరం 'సూపర్ 7' రౌండ్, సెమీ ఫైనల్స్, ఫైనల్ మ్యాచ్‌లు ఉంటాయి. ఈ వన్డే ప్రపంచకప్ అక్టోబర్ 4న ప్రారంభం కానుంది.
వేదికల వివరాలు
దక్షిణాఫ్రికా: వాండరర్స్ (జొహన్నెస్‌బర్గ్), సెంచూరియన్ (ష్వానే), న్యూలాండ్స్ (కేప్ టౌన్), కింగ్స్‌మీడ్ (డర్బన్), సెయింట్ జార్జ్ పార్క్ (గెబెర్హా), మంగాంగ్ ఓవల్ (బ్లూమ్‌ఫోంటెన్), బోలాండ్ పార్క్ (పార్ల్), బఫెలో పార్క్ (కుగోంపో సిటీ).
జింబాబ్వే: హరారే స్పోర్ట్స్ క్లబ్ (హరారే), క్వీన్స్ స్పోర్ట్స్ క్లబ్ (బులవాయో), ఫాలే మోసీ-ఓ-తున్యా ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం (విక్టోరియా ఫాల్స్).
నమీబియా: నమీబియా క్రికెట్ గ్రౌండ్ (విండ్‌హోక్).
చదవండి: PAK vs WI: పాకిస్తాన్‌కు భారీ షాక్.. ఇక అంతే సంగతి?


