ప్రపంచ ఫుట్‌బాల్‌లో మహా సంక్షోభం నెలకొంది. అంతర్జాతీయ ఫుట్‌బాల్ సమాఖ్య (FIFA) తీసుకున్న ఒక వివాదాస్పద ఆర్థిక నిర్ణయంపై యూరోపియన్ ఫుట్‌బాల్ సమాఖ్య (UEFA) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఫుట్‌బాల్ వరల్డ్ కప్ వాణిజ్య హక్కుల కోసం 20 బిలియన్ డాల్లరతో కొత్త సంస్థను ఏర్పాటు చేసి, అందులో 20 శాతం వాటాను ప్రైవేట్ కంపెనీలకు అమ్మాలని ఫిఫా చూస్తోంది.
ఈ నేపథ్యంలో ఫిఫా తన ప్రతిపాదనను వెనక్కి తీసుకోపోతే రాబోయే వరల్డ్ కప్‌లతో సహా అన్ని పోటీలను బహిష్కరిస్తామని యూఈఎఫ్ఏకు 55 సభ్య దేశాలు ఏకగ్రీవంగా హెచ్చరించాయి.
యూఈఎఫ్ఏ, అందులోని సభ్య దేశాల సంఘాలు ఏకతాటిపై నిలిచాయి. వరల్డ్ కప్, ఫిఫా నిర్వహించే ఇతర పోటీల యాజమాన్య హక్కులను ప్రైవేట్ పెట్టుబడిదారులకు బదిలీ చేయాలనే ఫిఫా ప్రతిపాదనను మేమందరం ఏకగ్రీవంగా తిరస్కరిస్తున్నాం.
వరల్డ్ కప్‌ను ఒక వ్యాపార వస్తువుగా పరిగణించలేము. అది తరతరాలుగా ఆటగాళ్లు, అభిమానులు నిర్మించుకున్న గొప్ప క్రీడా వారసత్వం. ఇందులో ఏ భాగాన్ని కూడా ఎప్పుడూ ప్రైవేట్ పెట్టుబడిదారులకు అప్పగించకూడదు. ప్రపంచ కప్ అమ్మకానికి ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోము అని యూఈఎఫ్ఏ ఓ ప్రకటనలో పేర్కొంది.


