గ్లాస్గో వేదికగా జరుగుతున్న కామన్‌వెల్త్ గేమ్స్-2026లో భాతర అథ్లెట్ల జోరు కొనసాగుతోంది. పురుషుల వెయిట్‌లిఫ్టింగ్ 110+ కేటగిరీలో లవ్‌ప్రీత్ సింగ్ రజత పతకం సాధించగా.. మహిళల డిస్కస్ త్రోలో సీమా కళిరామ్న కాంస్య పతకాన్ని కైసవం చేసుకుంది. మరోవైపు జావలిన్ త్రోలో నీరజ్ చోప్రా, రోహిత్ యాదవ్, యష్‌వీర్ సింగ్‌లు ఫైనల్‌కు అర్హత సాధించారు.
పంజాబ్‌కు చెందిన లవ్‌ప్రీత్ తన కెరీర్‌లోనే అత్యుత్తమ ప్రదర్శన కనబరిచాడు. స్నాచ్ విభాగంలో 176 కేజీలను ఎత్తి కామన్‌వెల్త్ గేమ్స్ రికార్డును తిరగరాశాడు. అనంతరం క్లీన్ అండ్ జెర్క్‌లో 212 కేజీల బరువు ఎత్తి ఔరా అనిపించాడు. మొత్తంగా అతడు 388 కేజీల వెయిట్‌ను లిప్ట్ చేసి రెండో స్ధానంలో నిలిచాడు.
స్నాచ్ రౌండ్ ముగిసేసరికి లవ్‌ప్రీత్ 10 కేజీల ఆధిక్యంలో ఉన్నప్పటికీ.. చివరి రౌండ్‌లో న్యూజిలాండ్‌కు చెందిన డేవిడ్ ఆండ్రూ లిటి క్లీన్ అండ్ జెర్క్‌లో అద్భుతంగా పుంజుకున్నాడు. అతడు మొత్తం 389 కేజీలతో స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకున్నాడు.కేవలం ఒక్క కిలోగ్రామ్ తేడాతో లవ్‌ప్రీత్ గోల్డ్‌మెడల్ కోల్పోయాడు. అయితే వెయిట్‌లిఫ్టింగ్‌లో భారత్‌కు ఇది ఎనిమిదవ మెడల్ కావడం గమనార్హం.
పోరాడి కాంస్యం నెగ్గిన సీమ
ఇక మహిళల డిస్కస్ త్రోలో 27 ఏళ్ల సీమా కళిరామ్న అద్భుతంగా పోరాడి కాంస్య పతకం సొంతం చేసుకుంది. పోటీలో వరుసగా మూడు ఫౌల్స్ నమోదైనప్పటికీ, మూడో రౌండ్‌లో ఆమె చేసిన త్రో పతకాన్ని ఖాయం చేసింది. దీంతో భారత్ పతకాల సంఖ్య 17కు చేరింది.


