మనోధైర్యమే పెట్టుబడిగా... | Long jumper Sreeshankar journey is inspiring | Sakshi
Sakshi News home page

మనోధైర్యమే పెట్టుబడిగా...

Jul 31 2026 4:22 AM | Updated on Jul 31 2026 4:29 AM

Long jumper Sreeshankar journey is inspiring

గ్లాస్గో కామన్వెల్త్‌ గేమ్స్‌లో పతకం గెలిచాక శ్రీశంకర్‌ సంబరం , తండ్రి మురళీతో...

లాంగ్‌జంపర్‌ శ్రీశంకర్‌ ప్రస్థానం స్ఫూర్తిదాయకం

నడవలేడని అనుకుంటే... పోడియంపైనే నిలిచాడు  

సాక్షి క్రీడావిభాగం :  కేరళకు చెందిన మురళీ శ్రీశంకర్‌కు కామన్వెల్త్‌ గేమ్స్‌ పతకం కొత్తేమి కాదు. ఆ మాటకొస్తే అతడు గతంలోనే ఇంతకన్నా గొప్ప ఘనతలు సాధించాడు. 2022 బర్మింగ్‌హామ్‌ కామన్వెల్త్‌ గేమ్స్‌లో రజతం గెలిచిన ఈ లాంగ్‌జంపర్‌... అదే ఏడాది హాంగ్జౌ ఆసియా క్రీడల్లోనూ సిల్వర్‌ మెడల్‌ సొంతం చేసుకున్నాడు. 2023 ఆసియా చాంపియన్‌షి ప్‌లో రతజం గెలిచిన శ్రీశంకర్‌... ఆసియా జూనియర్‌ చాంపియన్‌షిప్‌ (2018)లో కాంస్యం నెగ్గాడు. మరి అంతర్జాతీయ స్థాయిలో ఎన్నో పతకాలు సాధించిన శ్రీశంకర్‌... గ్లాస్గోలో పతకం నెగ్గిన తర్వాత భావోద్వేగానికి గురవ్వడం వెనక బలమైన కారణం ఉంది. 

సరిగ్గా రెండేళ్ల క్రితం 2024 పారిస్‌ ఒలింపిక్స్‌కు సిద్ధమవుతున్న సమయంలో శ్రీశంకర్‌ గాయపడ్డాడు. పాలక్కాడ్‌లో ప్రాక్టీస్‌ చేస్తున్న సమయంలో అతడి ఎడమ మోకాలికి గాయమైంది. దీంతో ఆసుపత్రికి తరలించగా... వైద్యులు శస్త్రచికిత్స చేశారు. అనంతరం ‘ఇక మీదట లాంగ్‌జంప్‌ కాదు కదా... కనీసం తిరిగి పరిగెత్తడం కూడా కష్టమే’ అని వైద్యులు తేల్చి చెప్పారు. ఈ మాటతో శ్రీశంకర్‌ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. అతడు కట్టుకున్న కోటలన్నీ పేకమేడలా నేలకూలాయి.  

ఊత కర్రలతో నడిచి... 
మోకాలి చిప్ప పూర్తిగా దెబ్బతినడంతో దాన్ని మార్చాల్సి వచ్చింది. దీంతో నెలల పాటు మంచానికే పరిమితమయ్యాడు. ఆ సమయంలో కనీసం లేచి నడిస్తే చాలు అని అతడి కుటుంబ సభ్యులు ఆవేదనకు గురయ్యారు. ‘సర్జరీ తర్వాత శ్రీశంకర్‌ ఊత కర్రల సాయం లేకుండా నడిస్తే చాలు అని ఎంతో అనుకున్నా. అలాంటిది రెండేళ్లు తిరిగేసరికి అంతర్జాతీయ స్థాయిలో పతకం సాధించాడు అంటే ఇదంతా అతడి మనోధైర్యమే.

వైద్యులు కాలు కిందపెట్టినా ఇబ్బందే అని చెప్పడంతో ఈ రెండేళ్లలో అతడు పడ్డ కష్టం మామూలుది కాదు. ఇది కేవలం అతడికే సాధ్యం. శ్రీశంకర్‌ మానసికంగా చాలా బలంగా ఉంటాడు. ఓటమిని అంత త్వరగా ఒప్పుకోడు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా విజయం సాధించేందుకే ప్రయత్నిస్తాడు. అందుకోసం ఎంత కష్టానికైనా వెనుకాడడు. ఈ పతకం దానికి నిదర్శనం’ అని శ్రీశంకర్‌ తండ్రి మురళీ వెల్లడించారు. 

650 రోజుల తర్వాత తిరిగి బరిలోకి దిగిన శ్రీశంకర్‌ గ్లాస్గోలో 8.09 మీటర్ల దూరం దూకి పునరాగమనం తర్వాత తొలి అంతర్జాతీయ పతకం ఖాతాలో వేసుకున్నాడు. ఒకవైపు గాయం నుంచి కోలుకున్న తర్వాత 29 ఏళ్ల శ్రీశంకర్‌ పాల్గొన్న తొలి టోర్నమెంట్‌ ఇదే కాగా... మరోవైపు గ్లాస్గో పరిస్థితులు అతడిని మరింత ఇబ్బంది పెట్టాయి. అసలే మోకాలికి శస్త్రచికిత్స జరిగి ఉండటంతో జాగ్రత్త వహించాలని శ్రీశంకర్‌ భావించగా... టోర్నీ నిర్వాహకులు మాత్రం భారీ వర్షంలోనే పోటీలు నిర్వహించారు. 

వర్షం, శీతల గాలులు, అత్యల్ప ఉష్ణోగ్రతలు ఇలా ఎన్నో ప్రతికూలతలను దాటి శ్రీశంకర్‌ రెండోసారి పతకం గెలుచుకున్నాడు. కెరీర్‌లో ఈ రజతం తనకు చాలా ప్రత్యేకమన్న శ్రీశంకర్‌... గత రెండేళ్లుగా కష్టకాలం అనుభవించి ఇప్పుడు విజయం సాధించడం సంతోషంగా ఉందని పతకం నెగ్గిన అనంతరం పేర్కొన్నాడు. కఠిన పరిస్థితుల్లో తనకు అండగా నిలిచిన వారికి ఈ పతకం అంకితమిస్తున్నట్లు శ్రీశంకర్‌ వెల్లడించాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement