కామన్వెల్త్‌ సమరానికి సమయం | Commonwealth Games from today to August 2nd | Sakshi
Sakshi News home page

కామన్వెల్త్‌ సమరానికి సమయం

Jul 23 2026 3:36 AM | Updated on Jul 23 2026 3:36 AM

Commonwealth Games from today to August 2nd

నేటి నుంచి ఆగస్టు 2 వరకు పోటీలు

125 మంది అథ్లెట్‌లతో భారత బృందం సిద్ధం 

అర్ధరాత్రి గం. 12:30 నుంచి సోనీ స్పోర్ట్స్, సోనీ లివ్‌ యాప్‌లో...

ఒకప్పుడు ఒలింపిక్‌ క్రీడల తర్వాత భారీతనంలో దాదాపు అదే స్థాయిలో జరిగిన కామన్వెల్త్‌ క్రీడలు కొంత కాలంగా కళ తప్పాయి. పేరుకే పెద్ద సంఖ్యలో దేశాలు పాల్గొంటున్నా... ఆకర్షణలో మాత్రం ప్రతీ సారి ఆటల స్థాయి కుంచించుకుపోతోంది. నిర్వహణాపరమైన ఆర్థిక సమస్యలతో పాటు అగ్రశ్రేణి ఆటగాళ్లంతా ఏదో ఒక సాకుతో దూరమవుతుండటంతో ఈ గేమ్స్‌ అభిమానుల్లో ఆసక్తిని తగ్గిస్తున్నాయి. నాలుగేళ్లకు ఒకసారి జరిగే ఒక లాంఛనానికే పరిమితమైనట్లుగా ఇప్పుడు మళ్లీ క్రీడలు వచ్చేశాయి. పుష్కరకాలం క్రితం ఈ పోటీలకు ఆతిథ్యం ఇచ్చిన స్కాట్లాండ్‌ నగరం గ్లాస్గో మళ్లీ కామన్వెల్త్‌ క్రీడలకు  వేదికగా నిలిచింది.

గ్లాస్గో: 23వ కామన్వెల్త్‌ గేమ్స్‌(సీడబ్ల్యూజీ)కు రంగం సిద్ధమైంది. నేడు ప్రారంభం కానున్న ఈ ప్రతిష్టాత్మక క్రీడలు ఆగస్టు 2న ముగుస్తాయి. ఒకప్పుడు బ్రిటీష్‌ సామ్రాజ్యం పాలనలో ఉన్న వలస దేశాలు పాల్గొనే ఈ క్రీడలను 2014లో నిర్వహించిన గ్లాస్గో మరోసారి పోటీలకు సిద్ధమైంది. 11 రోజుల పాటు జరిగే క్రీడల్లో 74 దేశాలకు చెందిన 3 వేలకు పైగా ఆటగాళ్లు పాల్గొంటున్నారు. ఈ మెగా ఈవెంట్‌లో పాల్గొంటున్న పెద్ద దేశాల జాబితాలో భారత్, ఆ్రస్టేలియా, కెనడా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికావంటివి ఉండగా... ఎక్కువగా చిన్న దేశాలే పెద్ద సంఖ్యలో బరిలోకి దిగుతున్నాయి. 

నిజానికి 2022లో ఆతిథ్య హక్కులు ఆ్రస్టేలియా దేశంలోని విక్టోరియాకు దక్కగా... భారీ ఖర్చును తాము భరించలేమంటూ ఏడాది కాలం తర్వాత విక్టోరియా అనూహ్యంగా తప్పుకుంది. దాంతో 2026 పోటీలు వాయిదా పడటం లేదా అసలు జరగకపోవచ్చనే సందేహాలు రేకెత్తాయి. అయితే చివరి నిమిషంలో పోటీల నిర్వహణకు స్కాట్లాండ్‌ ముందుకు వచ్చింది. అయితే ఖర్చును బాగా తగ్గించుకోవడంలో భాగంగా ఈవెంట్ల సంఖ్యను తగ్గించడం, వేదికల సంఖ్యను తగ్గించే విషయంలో పలు షరతులు పెట్టింది. 

సీడబ్ల్యూజీ నిర్వహణా కమిటీకి ఇవన్నీ ఒప్పుకోక తప్పలేదు. దాంతో ఎలాంటి కొత్త స్టేడియాల నిర్మాణంలాంటివి లేకుండా ఇప్పటికే ఉన్న నాలుగు వేదికల్లో సీడబ్ల్యూజీ పోటీలు ఖరారయ్యాయి. 2022లో బర్మింగ్‌హామ్‌ కామన్వెల్త్‌ క్రీడల నిర్వహణా ఖర్చుతో పోలిస్తే దాదాపు 60 శాతం తక్కువ మొత్తం బడ్జెట్‌లో ఈ సారి పోటీలు జరగనుండటం విశేషం.  

10 క్రీడల్లో పోటీలు... 
3్ఠ3 బాస్కెట్‌బాల్, 3్ఠ3 వీల్‌చెయిర్‌ బాస్కెట్‌బాల్, ఆర్టిస్టిక్‌ జిమ్నాస్టిక్స్, అథ్లెటిక్స్, పారా అథ్లెటిక్స్, బౌల్స్, పారా బౌల్స్, బాక్సింగ్, జూడో, నెట్‌బాల్, స్విమ్మింగ్, పారా స్విమ్మింగ్,  ట్రాక్‌ సైక్లింగ్, పారా ట్రాక్‌ సైక్లింగ్, వెయిట్‌లిఫ్టింగ్, పారా పవర్‌లిఫ్టింగ్‌ 

గేమ్స్‌ విలేజ్‌ లేకుండా... 
ప్రతిష్టాత్మక క్రీడా పోటీల్లో పాల్గొనే ఆటగాళ్లంతా ఒకే చోట ఉండేలా అన్ని సౌకర్యాలతో ప్రత్యేకంగా గేమ్స్‌ విలేజ్‌ను నిర్మించడం పరిపాటి. కానీ ఖర్చు తగ్గింపులో భాగంగా ఈ సారి గేమ్స్‌ విలేజ్‌కు కూడా నిర్వాహకులు మంగళం పాడారు. ఈ పోటీల కోసం వేర్వేరు హోటల్స్‌లో క్రీడాకారులకు బస ఏర్పాటు చేశారు. అక్కడినుంచి స్టేడియాలకు తీసుకొచ్చేందుకు ప్రత్యేకంగా వాహనాలను ఏర్పాటు చేశారు. పోటీలు నాలుగు వేదికల్లోనే నిర్వహిస్తున్నారు. 

2022లో నిర్వహించి ఇప్పుడు తొలగించిన క్రీడలు 
బ్యాడ్మింటన్, హాకీ, రెజ్లింగ్, టి20 క్రికెట్, బీచ్‌ వాలీబాల్, డైవింగ్, మౌంటెన్‌ బైకింగ్, రిథమిక్‌ జిమ్నాస్టిక్స్, రోడ్‌ సైక్లింగ్, రగ్బీ సెవెన్స్, స్క్వాష్, టేబుల్‌ టెన్నిస్‌ అండ్‌ పారా టేబుల్‌ టెన్నిస్, ట్రయాథ్లాన్‌ అండ్‌ పారా ట్రయాథ్లాన్‌.

బరిలో నీరజ్‌ చోప్రా ...
పారా స్పోర్ట్స్‌తో కలిసి 13 పతకాంశాల్లో భారత్‌ నుంచి 125 మంది ఆటగాళ్లు పాల్గొంటున్నారు. అథ్లెటిక్స్‌ విభాగంలో అత్యధికంగా 32 మంది బరిలోకి దిగుతున్నారు. బాక్సింగ్‌ (14), జూడో (14), వెయిట్‌లిఫ్టింగ్‌ (12) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. పతకం సాధించగల సత్తా ఉన్న స్టార్‌ ఆటగాళ్ల జాబితాను చూస్తే...  జావెలిన్‌ త్రోయర్‌ నీరజ్‌ చోప్రా ఈ జాబితాలో అందరికంటే ముందున్నాడు. వెయిట్‌లిఫ్టింగ్‌లో మీరాబాయి చాను, బాక్సింగ్‌లో లవ్లీనా బొర్గొహైన్‌ వంటి ఒలింపిక్‌ పతక విజేతలు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.  

భారీగా తగ్గనున్న భారత్‌ పతకాలు... 
2022 బర్మింగ్‌హామ్‌ క్రీడల్లో భారత్‌ మొత్తం 61 పతకాలు (22 స్వర్ణాలు, 16 రజతాలు, 23 కాంస్యాలు) గెలుచుకుంది. అయితే ఈ సారి పతకాలు పెద్ద సంఖ్యలో తగ్గే అవకాశం ఉంది. గత పోటీల్లో 30 పతకాలు అందించిన క్రీడలను ఈ సారి పూర్తిగా తొలగించడమే అందుకు కారణం. 2022లో రెజ్లింగ్‌ (12), బ్యాడ్మింటన్‌ (6), టేబుల్‌ టెన్నిస్‌ (7), స్క్వాష్‌ (2), హాకీ (2), టి20 క్రికెట్‌ (1)లలో భారత్‌ పతకాలు గెలుచుకుంది. ఇప్పుడు ఇవన్నీ లేకుండా పోయాయి. దాంతో ప్రధానంగా అథ్లెటిక్స్, వెయిట్‌ లిఫ్టింగ్, బాక్సింగ్‌లలోనే మన జట్టు పతకాలు ఆశిస్తోంది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement