2026లో క్రీడాభిమానులకు పండగ
మూడు ఐసీసీ వరల్డ్ కప్‌లతో కళ
‘ఫిఫా’తో ఫుల్ జోష్
జూనియర్, సీనియర్, మహిళల వరల్డ్ కప్‌లతో పరుగుల లెక్కలు... మెస్సీ, రొనాల్డోల మెరుపులను చివరిసారి చూసేందుకు ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురు చూపులు... భిన్న క్రీడాంశాల్లో సత్తా చాటి అందరి దృష్టినీ ఆటగాళ్లు తమ వైపు తిప్పుకునేే కామన్వెల్త్, ఆసియా క్రీడల రూపంలో రెండు నెలల వ్యవధిలో రెండు చాన్స్‌లు... ఇక స్వదేశంలో మన షట్లర్ల స్థాయిని ప్రదర్శించేందుకు 17 ఏళ్ల తర్వాత వచ్చిన బ్యాడ్మింటన్ వరల్డ్ చాంపియన్ నిర్వహణావకాశం... ఇలా 2026లో పలు ప్రతిష్టాత్మక ఈవెంట్లు క్రీడాభిమానులను అలరించనున్నాయి. జనవరి నుంచి అక్టోబర్ వరకు నిరంతరాయంగా పది నెలల పాటు ఫుల్ స్పోర్ట్స్ జోష్ కనిపించడం ఖాయం.
కామన్వెల్త్ క్రీడలు
23 జులై–2 ఆగస్టు
(వేదిక: గ్లాస్గో, స్కాట్లండ్)
అంతర్జాతీయ క్రీడా వేదికపై భారత ఆటగాళ్లు సత్తా చాటేందుకు కామన్వెల్త్ క్రీడలు సరైన వేదికగా నిలుస్తున్నాయి. పెద్ద సంఖ్యలో మన వర్ధమాన ఆటగాళ్లు ఈ క్రీడల ద్వారా గుర్తింపు దక్కించుకుంటున్నారు. 2022 క్రీడల్లో భారత్ 22 స్వర్ణాలు సహా మొత్తం 61 పతకాలు గెలిచి నాలుగో స్థానంతో ముగించింది. అయితే ఆర్థికపరమైన, నిర్వహణాపరమైన ఇతర సమస్యల కారణంగా 2026 పోటీలను కేవలం 10 క్రీడాంశాలకే పరిమితం చేశారు.
భారత ఆటగాళ్లు కచ్చితంగా పతకం గెలిచే అవకాశం ఉన్న హాకీ, బ్యాడ్మింటన్, టి20 క్రికెట్, రెజ్లింగ్, టేబుల్ టెన్నిస్‌లను తప్పించడంతో ఈ సారి భారత్ పతకాల సంఖ్య తగ్గే అవకాశం ఉంది. అన్నీ కలిపి 215 ఈవెంట్లలో దాదాపు 3 వేల మంది ఆటగాళ్లు పాల్గొనే అవకాశం ఉంది.
2014లోనే కామన్వెల్త్ క్రీడలకు ఆతిథ్యం ఇచ్చిన గ్లాస్గో తక్కువ వ్యవధిలో మరోసారి ఈ పోటీలకు వేదిక కానుండటం విశేషం. గతంలో బ్రిటీష్ సామ్రాజ్యంలో భాగంగా ఉన్న 74 దేశాలు తలపడే ఈ పోటీలు ఎలిజబెత్ మహరాణి–2 మరణించిన తర్వాత జరుగుతున్న తొలి గేమ్స్ కానున్నాయి.
టి20 వరల్డ్ కప్
7 ఫిబ్రవరి–8 మార్చి
(వేదిక: భారత్, శ్రీలంక)
బౌండరీ వద్ద సూర్యకుమార్ యాదవ్ అత్యద్భుత క్యాచ్... రోహిత్ శర్మ మెస్సీ స్టయిల్‌లో ట్రోఫీని అందుకున్న క్షణాలు ఇంకా మనసునుంచి చెరిగిపోక ముందే మరో టి20 వరల్డ్ కప్ వచ్చేసింది. ఈ సారి డిఫెండింగ్ చాంపియన్‌గా, అదీ సొంతగడ్డపై బరిలోకి దిగుతుండటం ఇప్పటికే బలంగా ఉన్న భారత జట్టు బలాన్ని రెట్టింపు చేసింది. ఈ ఏడాది క్రికెట్ అభిమానులను ఎక్కువగా అలరించే అవకాశం ఉన్న టి20 వరల్డ్ కప్‌కు భారత్‌తో పాటు శ్రీలంక ఆతిథ్యం ఇస్తోంది.
గతంలో తరహాలోనే 20 జట్లు టోర్నీలో బరిలోకి దిగుతున్నాయి. ముంబై, ఢిల్లీ, చెన్నై, కోల్‌కతాలతో పాటు ఫైనల్ జరిగే అహ్మదాబాద్ కూడా మన దేశంలో వేదికలుగా ఉన్నాయి. 2024 వరల్డ్ కప్‌తో పోలిస్తే రోహిత్, కోహ్లిలాంటి స్టార్లు ఈ టోర్నీలో కనిపించరు కానీ అభిõÙక్, తిలక్‌లాంటి యువ ఆటగాళ్లు సత్తా చాటేందుకు సిద్ధంగా ఉన్నారు.
తొలిసారి ఇటలీ జట్టు వరల్డ్ కప్ ఆడే అవకాశం దక్కించుకోవడం విశేషం. ఇప్పటి వరకు జరిగిన 9 టి20 వరల్డ్ కప్‌లలో భారత్, వెస్టిండీస్, ఇంగ్లండ్ రెండేసి సార్లు విజేతలుగా నిలవగా... పాకిస్తాన్, శ్రీలంక, ఆ్రస్టేలియా ఒక్కో టైటిల్ గెలిచాయి.
మహిళల టి20 వరల్డ్ కప్
12 జూన్–5 జులై
(వేదిక: ఇంగ్లండ్)
తొలిసారి వన్డే వరల్డ్ కప్ గెలిచి శిఖరాన నిలిచిన ఉత్సాహంలో ఉన్న భారత మహిళల జట్టు ఈ సారి టి20 వరల్డ్ కప్‌పై గురి పెట్టింది. 2020లో జరిగిన టోర్నీలో అత్యుత్తమంగా రన్నరప్‌గా నిలిచిన భారత జట్టు మిగతా 8 ప్రయత్నాల్లోనూ పేలవ ప్రదర్శనతో విఫలమైంది. అయితే ఇటీవల జట్టులో వచ్చిన మార్పులు, టి20 స్పెషలిస్ట్‌ల ప్రదర్శన మన టీమ్‌లో ఆశలు పెంచుతున్నాయి. దానికి తగినట్లుగా ఇప్పటినుంచి వరల్డ్ కప్ కోసం జట్టు సన్నాహకాలు కొనసాగుతున్నాయి.
2009లో తొలి టోర్నీని నిర్వహించిన తర్వాత ఇప్పుడు మరోసారి ఇంగ్లండ్ ఈ మెగా ఈవెంట్‌కు ఆతిథ్యం ఇస్తోంది. ప్రతిష్టాత్మక లార్డ్స్ మైదానంలో ఫైనల్ నిర్వహిస్తారు. టి20 వరల్డ్ కప్‌లో ఆ్రస్టేలియా ఏకంగా 6 సార్లు విజేతగా నిలవగా...ఇంగ్లండ్, న్యూజిలాండ్, వెస్టిండీస్ ఒక్కో సారి ట్రోఫీని అందుకున్నాయి. న్యూజిలాండ్ డిఫెండింగ్ చాంపియన్.
పురుషుల అండర్–19 వరల్డ్ కప్
15 జనవరి–6 ఫిబ్రవరి
(వేదిక: జింబాబ్వే, నమీబియా)
యువ క్రికెటర్లు చెలరేగి భవిష్యత్తులో సీనియర్ జట్టుకు ప్రమోట్ అయ్యేందుకు అండర్–19 ప్రపంచ కప్ చక్కటి అవకాశం కల్పిస్తోంది. భారత జట్టులో అలాంటి యువ ఆటగాళ్లకు కొదవ లేదు. తమ ప్రతిభతో ఐపీఎల్‌లో ఇప్పటికే గుర్తింపు తెచ్చుకున్న వైభవ్ సూర్యవంశీ, ఆయుశ్ మాత్రే, భారత జట్టుకు వరల్డ్ కప్ అందించేందుకు అండర్–19 స్థాయిలో బరిలోకి దిగుతున్నారు.
కొత్త ఏడాదిలో అన్నింటికంటే ముందుగా క్రికెట్ అభిమానులకు అలరించే సిద్ధమైన ఈ కుర్రాళ్ల పోరులో మొత్తం 16 టీమ్‌లు బరిలోకి దిగుతున్నాయి. 2024లో టైటిల్ సాధించిన ఆ్రస్టేలియా డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగుతుండగా... ఫైనల్లో ఓడిన భారత్ రన్నరప్‌గా నిలిచింది. అయితే మొత్తం 15 సార్లు జరిగిన అండర్–19 వరల్డ్ కప్‌లో 5 సార్లు కప్ గెలుచుకొని భారత్ తమ ఆధిపత్యాన్ని ప్రదర్శించింది.
ఆసియా క్రీడలు
19 సెప్టెంబర్–4 అక్టోబర్
(వేదిక: నగోయా, జపాన్)
కామన్వెల్త్ గేమ్స్ ముగిసిన రెండు నెలల లోపే మన భారత క్రీడాకారులు తమ ప్రతిభను ప్రదర్శించేందుకు ఆసియా గేమ్స్ రూపంలో మరో అవకాశం దక్కుతోంది. ముఖ్యంగా అథ్లెటిక్స్ విభాగంలో ఆసియా క్రీడల్లో సుదీర్ఘ కాలంగా భారత్ బలమైన ముద్ర వేసింది. కోవిడ్ కారణంగా ఏడాది కాలం వాయిదా పడటంతో 2022లో జరగాల్సిన గేమ్స్‌ను 2023లో నిర్వహించారు. ఇప్పుడు మళ్లీ నాలుగేళ్ల ఈవెంట్‌గా షెడ్యూల్ ప్రకారం 2026లో నిర్వహిస్తున్నారు.
జపాన్‌లోని నగోయా నగరం ప్రధాన వేదిక కాగా, ఐచి రాష్ట్రంలోని ఇతర వేదికల్లో కూడా పోటీలు జరుగుతాయి. 41 క్రీడాంశాల్లో కలిపి 45 దేశాల నుంచి సుమారు 15 వేల మంది అథ్లెట్లు పాల్గొనే అవకాశం ఉంది. ఆసియా క్రీడలను జపాన్ నిర్వహించడం ఇది మూడో సారి. 2023 ఏషియాడ్‌లో 28 స్వర్ణాలు సహా 106 పతకాలు నెగ్గిన భారత్ నాలుగో స్థానంలో నిలిచింది.
‘ఫిఫా’ వరల్డ్ కప్
12 జూన్–20 జులై
(వేదిక: అమెరికా, కెనడా, మెక్సికో)
ప్రపంచవ్యాప్తంగా ఫుట్‌బాల్ అభిమానులను అలరించేందుకు ఈ ఏడాది వరల్డ్ కప్ వచ్చేసింది. మూడు దేశాలు కలిసి టోర్నీని నిర్వహిస్తుండటం ఇదే మొదటిసారి కాగా, మొత్తం 16 వేదికల్లో మ్యాచ్‌లు జరుగుతాయి. ‘ఫిఫా’ వరల్డ్ కప్ చరిత్రలో 2022 వరకు 32 జట్లతోనే టోర్నమెంట్‌ను నిర్వహించగా... తొలిసారి 48 జట్లు బరిలోకి దిగుతుండటం ఈ సారి అన్నింటికంటే పెద్ద విశేషం.
కేప్ వెర్డె, క్యురాకో, జోర్డాన్, ఉజ్బెకిస్తాన్ తొలిసారి ప్రపంచ కప్ ఆడనున్నాయి. అర్జెంటీనా డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగుతోంది. ప్రపంచ ఫుట్‌బాల్ చరిత్రలో దిగ్గజ స్థాయి ఆటగాళ్లుగా గుర్తింపు పొందిన లయోనల్ మెస్సీ, క్రిస్టియానో రొనాల్డో చివరి సారిగా వరల్డ్ కప్ బరిలోకి దిగి అభిమానులను అలరించేందుకు సిద్ధమయ్యారు.
2026 వరల్డ్ కప్ మ్యాచ్‌లను మైదానంలో చూసేందుకు దాదాపు 70 లక్షల టికెట్లు అందుబాటులో ఉండగా...తొలి 15 రోజుల్లోనే 15 కోట్లకు పైగా టికెట్ దరఖాస్తులు రావడం ఈ టోర్నీ స్థాయికి చూపిస్తోంది. ఎప్పటిలాగే భారత్ మాత్రం ప్రపంచకప్ టోర్నీలో కనిపించదు. ఆసియా నుంచి క్వాలిఫై అయ్యేందుకు 9 జట్లకు అవకాశం ఉండగా... అతి పేలవమైన ఆటతో భారత్ అర్హతకు సుదూరంగా ఉండిపోయింది.
వరల్డ్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్
ఆగస్టు 17–23
(వేదిక: న్యూఢిల్లీ)
బ్యాడ్మింటన్‌లో గత కొన్నేళ్లుగా తమదైన ముద్ర వేసిన భారత్ రెండో సారి వరల్డ్ చాంపియన్‌షిప్‌కు ఆతిథ్యం ఇవ్వనుంది. ప్రపంచ టాప్ షట్లర్లంతా పాల్గొనే ఈ మెగా ఈవెంట్ ఢిల్లీలో జరుగుతుంది. గతంలో భారత్‌లో ఒకే ఒకసారి వరల్డ్ చాంపియన్‌షిప్ (2009లో హైదరాబాద్‌లో) జరిగింది.
వాస్తవానికి 2023లో భారత్ సుదిర్మన్ కప్‌ను నిర్వహించాల్సి ఉండగా... కోవిడ్ కారణంగా ఏర్పడిన పరిస్థితుల నేపథ్యంలో పలు వేదికల్లో మార్పులు జరిగాయి. ఈ క్రమంలో భారత్‌కు వరల్డ్ చాంపియన్‌షిప్ అవకాశం దక్కింది. 2025లో పారిస్‌లో జరిగిన ఈ ఈవెంట్‌లో భారత్ తరఫున సాత్విక్–చిరాగ్ కాంస్యపతకం గెలుచుకున్నారు. స్వదేశంలో మన ఆటగాళ్లు ఈ సారి మరింత మెరుగైన ప్రదర్శన కనబర్చే అవకాశం ఉంది.


