ఆస్ట్రేలియాపై 23 పరుగులతో ఘనవిజయం
ముజరబాని, ఇవాన్స్ పేస్‌కు కంగారూ జట్టు కుదేలు
బెనెట్ అర్ధ సెంచరీ
ఆ్రస్టేలియా సొంతగడ్డపై ఆడినా... గడప దాటినా... ఫార్మాట్ ఏదైనా... చాంపియన్ జట్టు. ప్రొఫెషనలిజానికిమారుపేరు. అలాంటి జట్టు జింబాబ్వేలాంటి చిన్న జట్టుతో ఓడటం ఎవరి అంచనాలకూ అందని సంచలనమే! ఓ దుర్బేధ్యమైన జట్టు మళ్లీ అదే ప్రత్యర్థి చేతిలో రెండోసారి ఓడితే సంచలనానికి సీక్వెలే కదా!
అవును... దాదాపు రెండు దశాబ్దాల తర్వాత టి20 ప్రపంచకప్‌లో జింబాబ్వే... ఆస్ట్రేలియాపై సీక్వెల్ బొమ్మ చూపించింది. 2007లో మొదలైన టి20 వరల్డ్‌కప్‌లో అప్పటి వన్డే వరల్డ్ చాంపియన్‌ను కంగుతినిపించి ఔరా అనిపించిన జింబాబ్వే... మళ్లీ ఇన్నేళ్ల తర్వాత కూడా ప్రస్తుత వన్డే విశ్వవిజేత ఆస్ట్రేలియాను మట్టికరిపించి తాజా టి20 ప్రపంచకప్‌లో పెను సంచలనం నమోదు చేసింది.
కొలంబో: జింబాబ్వే జట్టు ఆల్‌రౌండ్ ప్రదర్శనతో టి20 ప్రపంచకప్‌లో ఆ్రస్టేలియాను మరోసారి ‘0’ను చేసింది. ఈ మెగా ఈవెంట్ చరిత్రలో జింబాబ్వే తమ ఆధిక్యాన్ని ‘2’తో రెట్టింపు చేసుకుంది. 2007 టి20 ప్రపంచకప్‌లో కంగారూ జట్టుపై సాధించిన సంచలన విజయాన్ని 19 ఏళ్ల తర్వాత జింబాబ్వే తాజాగా రిపీట్ చేసింది. అప్పుడు మొదటి ప్రపంచకప్ అయితే ఇది పదోది. మధ్యలో 8 మెగా ఈవెంట్లు జరిగినా... ఇరుజట్లు తలపడలేదు.
శుక్రవారం గ్రూప్ ‘బి’లో జరిగిన మ్యాచ్‌లో జింబాబ్వే 23 పరుగుల తేడాతో ఆస్ట్రేలియాను కంగుతినిపించింది. టాస్ నెగ్గిన ఆసీస్ ఫీల్డింగ్ ఎంచుకోగా... ముందుగా బ్యాటింగ్ చేపట్టిన జింబాబ్వే నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది. ఓపెనర్ బ్రియాన్ బెన్నెట్ (56 బంతుల్లో 64 నాటౌట్; 7 ఫోర్లు) అర్ధసెంచరీ సాధించాడు.
క్రీజులోకి వచ్చిన ముగ్గురు బ్యాటర్లు తదివనషె మరుమని (21 బంతుల్లో 35; 7 ఫోర్లు), రియాన్ బర్ల్ (30 బంతుల్లో 35; 4 ఫోర్లు), కెప్టెన్ సికందర్ రజా (13 బంతుల్లో 25 నాటౌట్; 2 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు. స్టొయినిస్, కామెరాన్ గ్రీన్ చెరో వికెట్ తీశారు.
ఆసీస్ ఈ 120 బంతులు ఆడలేదా?
జింబాబ్వే లాంటి కూన జట్టు బ్యాటర్లు 120 బంతులెదుర్కొని ఇద్దరే అవుటైతే... జగజ్జేత కంగారు పడటమేంటి? పది మంది బ్యాటర్లు 117 బంతులకే అవుట్ కావడమేంటి? హెడ్ బృందానికి 170 లక్ష్యఛేదన ఏమాత్రం కష్టమైంది కాదు. కఠినమైంది కాదు. కానీ 19.3 ఓవర్లలోనే 146 పరుగులకే కుప్పకూలింది.
జింబాబ్వే పేసర్లు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ బ్లెసింగ్ ముజరబాని (4/19), బ్రాడ్ ఇవాన్స్ (3/23) ధాటికి ఓపెనర్లు ఇన్‌గ్లిస్ (8), కెప్టెన్ హెడ్ (17) గ్రీన్ (0), టిమ్ డేవిడ్ (0)... ఇలా టాప్–4 స్పెషలిస్టు బ్యాటర్లంతా పవర్‌ప్లేలో 29 పరుగులకే పెవిలియన్‌కు వెళ్లి ప్రేక్షకులైపోయారు.
ఒకే ఒక్కడు మ్యాట్ రెన్‌షా (44 బంతుల్లో 65; 5 ఫోర్లు, 1 సిక్స్), మ్యాక్స్‌వెల్ (32 బంతుల్లో 31; 1 ఫోర్, 1 సిక్స్) ఐదో వికెట్‌కు 77 పరుగులు జోడించడంతో 100 పైచిలుకు స్కోరు చేయగలిగింది. లేదంటే తర్వాతి బ్యాటర్లు స్టొయినిస్ (6), డ్వార్షుయిస్ (6), ఎలిస్ (7 నాటౌట్), జంపా (2), కునెమన్ (0)ల స్కోర్లు చూస్తే ఏ అత్యల్ప స్కోరుకో పరిమితమయ్యేదేమో!
ఔరా మన్యొంగా...
జింబాబ్వే ఫీల్డర్ మన్యొంగా కళ్లు చెదిరే క్యాచ్‌తో ఆకట్టుకున్నాడు. ఇవాన్స్ వేసిన 18వ ఓవర్లో డ్వార్షుయిస్ మిడ్‌వికెట్ మీదుగా భారీ షాట్ ఆడాడు. మున్యొంగా దూరంగానే ఉన్నప్పటికీ డీప్ మిడ్‌వికెట్ నుంచి పరుగెత్తుకుంటూ వచ్చి అదే వేగంతో డైవ్ చేసి అందుకున్న క్యాచ్ ఔరా అనిపించింది.
టేలర్ స్థానంలో బెన్ కరన్...
జింబాబ్వే సీనియర్ ప్లేయర్ బ్రెండన్ టేలర్ గాయం కారణంగా టోర్నీనుంచి తప్పుకున్నాడు. ఒమన్‌తో మ్యాచ్‌లో గాయపడిన అతను ఆసీస్‌తో పోరులో బరిలోకి దిగలేదు. టేలర్ స్థానంలో ఐసీసీ అనుమతితో బెన్ కరన్‌కు జింబాబ్వే చోటు కల్పించింది. బెన్ కరన్ తమ్ముడు స్యామ్ కరన్ ఇప్పటికే వరల్డ్ కప్‌లో ఇంగ్లండ్ తరఫున ఆడుతున్నాడు.
2 ఇప్పటి వరకు ఆస్ట్రేలియా జట్టుతో జింబాబ్వే నాలుగు అంతర్జాతీయ టి20 మ్యాచ్‌లు ఆడింది. ఇందులో రెండింటిలో గెలిచి, రెండింటిలో ఓడిపోయింది. ఆసీస్‌పై జింబాబ్వే సాధించిన రెండు విజయాలు ప్రపంచకప్‌లోనే రావడం విశేషం.
టి20 ప్రపంచకప్‌లో నేడు
ఐర్లాండ్ X ఒమన్
వేదిక: కొలంబో; ఉ.గం. 11 నుంచి
ఇంగ్లండ్ X స్కాట్లాండ్
వేదిక: కోల్‌కతా; మ.గం. 3 నుంచి
దక్షిణాఫ్రికా X న్యూజిలాండ్
వేదిక: అహ్మదాబాద్; రాత్రి గం. 7 నుంచి
స్టార్ స్పోర్ట్స్, హాట్ స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం


