మన ముకేశ్‌ గురి బంగారం | Andhra Pradesh shooter shines with 8 medals at Asian Championship | Sakshi
Sakshi News home page

మన ముకేశ్‌ గురి బంగారం

Feb 14 2026 3:51 AM | Updated on Feb 14 2026 3:51 AM

Andhra Pradesh shooter shines with 8 medals at Asian Championship

ఆసియా చాంపియన్‌షిప్‌లో 8 పతకాలతో మెరిసిన ఆంధ్రప్రదేశ్‌ షూటర్‌

న్యూఢిల్లీ: ఆసియా షూటింగ్‌ చాంపియన్‌షిప్‌ జూనియర్‌ విభాగంలో భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన పిస్టల్‌ షూటర్‌ ముకేశ్‌ నేలవల్లి చిరస్మరణీయ ప్రదర్శన చేశాడు. చివరిరోజు శుక్రవారం గుంటూరు జిల్లాకు చెందిన ముకేశ్‌ రెండు పతకాలు సాధించాడు. 25 మీటర్ల స్పోర్ట్స్‌ పిస్టల్‌ వ్యక్తిగత విభాగంలో రజత పతకం నెగ్గిన ముకేశ్‌... టీమ్‌ విభాగంలో సూరజ్‌ శర్మ (మధ్యప్రదేశ్‌), అభినవ్‌ దేశ్వాల్‌ (ఉత్తరాఖండ్‌)లతో కలిసి స్వర్ణ పతకాన్ని గెల్చుకున్నాడు. 

ఓవరాల్‌గా ఈ మెగా ఈవెంట్‌లో ముకేశ్‌ ఎనిమిది పతకాలు సాధించిన ముకేశ్‌ జాతీయ రికార్డు నెలకొల్పడం విశేషం. 25 మీటర్ల స్పోర్ట్స్‌ పిస్టల్‌ వ్యక్తిగత విభాగంలో భారత్‌ క్లీన్‌స్వీప్‌ చేసింది. సూరజ్‌ శర్మ 585 పాయింట్లతో స్వర్ణం, ముకేశ్‌ 582 పాయింట్లతో రజతం, అభినవ్‌ దేశ్వాల్‌ 573 పాయింట్లతో కాంస్యం నెగ్గారు. సూరజ్, ముకేశ్, అభినవ్‌లతో కూడిన భారత జట్టు టీమ్‌ విభాగంలో 1740 పాయింట్లతో పసిడి పతకాన్ని కైవసం చేసుకుంది.  

ధవళిక ఖాతాలో 2 పతకాలు 
ఇదే టోర్నీ జూనియర్‌ మహిళల 50 మీటర్ల రైఫిల్‌ ప్రోన్‌ విభాగంలో తెలంగాణ అమ్మాయి ధవళిక దేవి రెండు పతకాలు సాధించింది. వ్యక్తిగత విభాగంలో ధవళిక 614.1 పాయింట్లతో కాంస్య పతకాన్ని గెలిచింది. టీమ్‌ విభాగంలో ధవళిక, ప్రాచి, అనుష్కలతో కూడిన భారత జట్టు 1835.6 పాయింట్లతో స్వర్ణ పతకాన్ని సాధించింది. 

గచి్చ»ౌలిలోని గన్‌ ఫర్‌ గ్లోరీ అకాడమీలో గత మూడేళ్లుగా కోచ్‌ వినోద్‌ కనోజియా వద్ద ధవళిక శిక్షణ తీసుకుంటోంది. శుక్రవారం ముగిసిన ఈ టోర్నీలో సీనియర్, జూనియర్‌ విభాగాల్లో కలిపి భారత షూటర్లు 39 స్వర్ణాలు, 18 రజతాలు, 19 కాంస్యాలతో 76 పతకాలు నెగ్గి ‘టాప్‌’లో నిలిచారు. 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement