భారత్-జింబాబ్వే మధ్య మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్ గురువారం హరారే వేదికగా జరగనుంది. వరుస సిరీస్‌ల ఓటముల అనంతరం జింబాబ్వే పర్యటనకు వెళ్లిన టీమిండియా.. తొలి మ్యాచ్‌లో గెలిచి శుభారంభం చేయాలని భావిస్తోంది.
ఈ మ్యాచ్‌కు ముందు భారత కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ తన సహచరలకు కీలక సూచనలు చేశాడు. ఇంగ్లండ్, ఐర్లాండ్ పర్యటనల్లో ఎదురైన పరాజయాలను పక్కనపెట్టి ఫియర్‌లెస్ క్రికెట్ ఆడాలని అయ్యర్ పిలుపునిచ్చాడు. "ఇంగ్లండ్, ఐర్లాండ్ పర్యనటనలలో మాకు అనుకూల ఫలితాలు రాలేదు.
కానీ ఈ ఓటముల నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నాం. భవిష్యత్తులో ఒక జట్టుగా మనం ఏ విషయాలపై దృష్టి పెట్టాలి, మైదానంలో పరిస్థితులకు తగ్గట్లుగా ఎలా మారాలి అనే విషయాలపై స్పష్టత వచ్చింది. నాతో పాటు జట్టులో చాలా మంది ఆటగాళ్లకు ఇదే తొలి జింబాబ్వే పర్యటన.
కాబట్టి ఇక్కడ కండీషన్స్‌కు ఎంత వేగంగా అలవాటుపడితే అంత మెరుగైన ఫలితాలు వస్తాయి. నేను మా బాయ్స్‌కు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. బయట నుంచి విమర్శలను పట్టించుకోవద్దు. కేవలం మీ ఆటపైనే దృష్టి సారించి ఫియర్ లెస్ క్రికెట్ ఆడండి.
మేము ఒక జట్టుగా సమిష్టిగా రాణించాల్సిన అవసరముంది. జింబాబ్వేను ఏ మాత్రం తేలికగా తీసుకోము. ప్రత్యర్ధి జట్టులో అద్భుతమైన ఆటగాళ్లు ఉన్నారు. వారిలో కొంతమందికి ఐపీఎల్‌లో ఆడిన అనుభవం కూడా ఉందని" ప్రీమ్యాచ్ కాన్ఫరెన్స్‌లో అయ్యర్ పేర్కొన్నాడు.
అదేవిధంగా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ గురుంచి శ్రేయస్ మాట్లాడుతూ.. "ఇంగ్లండ్ సిరీస్ తర్వాత మా బాయ్స్‌కు తగినంత విరామం దొరికింది. దీంతో యువ ఆటగాళ్లంతా నెట్స్‌లో తీవ్రంగా శ్రమించారు. వైభవ్ కూడా ఎక్కడ తప్పు చేశాడో దాన్ని సరిదిద్దుకుని ఉంటాడు. అందుకే నేను అతడికి పెద్దగా సలహాలు ఇవ్వాల్సిన అవసరం లేదు" అని అన్నాడు.
చదవండి: భారత్-జింబాబ్వే టీ20 సిరీస్ షెడ్యూల్.. జట్లు, లైవ్ స్ట్రీమింగ్ వివరాలు ఇవే


