IND vs ZIM: సిరీస్‌లో టీమిండియా ఫేవరెట్‌ కాదు: జింబాబ్వే కెప్టెన్‌ | Both: India Favourites In T20I Series, Zimbabwe Captain Says No; Know Why? | Sakshi
Sakshi News home page

IND vs ZIM: టీమిండియా ఫేవరెట్‌ కాదు.. మేమూ గెలవగలం: జింబాబ్వే కెప్టెన్‌

Jul 22 2026 11:02 AM | Updated on Jul 22 2026 11:53 AM

Both: India Favourites In T20I Series, Zimbabwe Captain Says No; Know Why?

Photo Credit: X

విదేశీ పర్యటనలో ఉన్న టీమిండియా వరుస పరాజయాలు చవిచూసింది. యూకే టూర్‌లో భాగంగా తొలుత ఐర్లాండ్‌తో టీ20 సిరీస్‌లో తలపడ్డ భారత జట్టు.. అనూహ్య రీతిలో పసికూన చేతిలో 2-0తో క్లీన్‌స్వీప్‌ అయింది. ఆ తర్వాత ఇంగ్లండ్‌ గడ్డ మీద అడుగుపెట్టి ఆతిథ్య జట్టు చేతిలో 4-0తో వైట్‌వాష్‌ అయింది.

దీంతో యూకే పర్యటన‌తో భారత టీ20 జట్టు కెప్టెన్‌గా పగ్గాలు చేపట్టిన శ్రేయస్‌ అయ్యర్‌కు అత్యంత చేదు అనుభవమే మిగిలింది. విజయమన్నదే లేకుండా అతడు ఈ రెండు సిరీస్‌లను అవమానకర రీతిలో ముగించాల్సి వచ్చింది.

ఇపుడు జింబాబ్వేతో సిరీస్‌
అనంతరం.. ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌లో శుబ్‌మన్‌ గిల్‌ సారథ్యంలోనూ టీమిండియా ఓటమిపాలైంది. ప్రత్యర్థికి 1-2తో సిరీస్‌ను సమర్పించుకుంది. ఇక ఇప్పుడు భారత జట్టు జింబాబ్వేలో అడుగుపెట్టింది. ఈ పర్యటనలో భాగంగా ఆతిథ్య జట్టుతో మూడు టీ20 మ్యాచ్‌లు ఆడనుంది.

ఈ నేపథ్యంలో శ్రేయస్‌ అయ్యర్‌ బృందం ఎలాగైనా ఈసారి గెలుపు ఖాతా తెరిచి.. సిరీస్‌లో విజయం సాధించాలని పట్టుదలగా ఉంది. అయితే, అదేమీ అంత తేలిక కాదు. ఐరిష్‌ జట్టు వంటి పసికూన చేతిలో ఓడిన టీమిండియాకు.. జింబాబ్వే కూడా కఠిన సవాలు విసురుతోంది.

అసాధారణ విజయాలు
ఇటీవలి కాలంలో ఆ జట్టు సాధించిన విజయాలే ఇందుకు నిదర్శనం. టీ20 ప్రపంచకప్‌-2026లో అనూహ్య రీతిలో మాజీ చాంపియన్‌, పటిష్ట ఆస్ట్రేలియా జట్టునే జింబాబ్వే మట్టికరిపించింది. ఏకంగా 23 పరుగుల తేడాతో ఓడించి గ్రూప్‌ దశలోనే ఆసీస్‌ను ఎలిమినేట్‌ చేసింది. ఆ తర్వాత శ్రీలంక, బంగ్లాదేశ్‌లపై కూడా విజయాలు సాధించింది.

ఇక ఇటీవల బంగ్లాదేశ్‌ జట్టు తమ దేశంలో పర్యటించగా ఏకైక టెస్టులో బంగ్లాను ఏకంగా ఇన్నింగ్స్‌ 85 పరుగుల తేడాతో జింబాబ్వే మట్టికరిపించింది. ఆ తర్వాత వన్డే సిరీస్‌ను 2-1తో కైవసం చేసుకుంది. 

అయితే, టీ20 సిరీస్‌ను మాత్రం 1-2తో బంగ్లాకు కోల్పోయింది. ఏదేమైనా ఇటీవల అన్ని ఫార్మాట్లలో చెప్పుకోదగ్గ విజయాలతో జింబాబ్వే పూర్తి ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగుతోంది.

టీమిండియా ఫేవరెట్‌ కాదు
ఈ నేపథ్యంలో తాజా టీ20 సిరీస్‌లో టీమిండియా హాట్‌ ఫేవరెట్‌ కదా అన్న ప్రశ్నకు జింబాబ్వే కెప్టెన్‌ సికిందర్‌ రజా ఇచ్చిన సమాధానం వైరల్‌గా మారింది. ‘‘అదేం లేదు. ఈ సిరీస్‌లో గెలిచేందుకు ఇరుజట్లకు సమాన అవకాశాలు ఉన్నాయి.

ఏదేమైనా నేనొక విషయం కచ్చితంగా చెప్పగలను. జింబాబ్వే ఇటీవలి కాలంలో అత్యంత నిలకడగా ఆడుతూ క్రికెట్‌లోని అసలైన మజాను అందిస్తోంది. ఈ సిరీస్‌ ద్వారా కూడా జింబాబ్వే కావాల్సినంత వినోదాన్ని పంచుతుంది.

వార్‌వన్‌ సైడ్‌ కానే కాదు
ప్రస్తుతం టీమిండియా సంధి దశలో ఉంది. జింబాబ్వే పరిస్థితి కూడా అంతే. కాబట్టి ఈ సిరీస్‌ ఎంతమాత్రం ఏకపక్షంగా ఉండబోదని చెప్పగలను’’ అని రజా పేర్కొన్నాడు. కాగా టీమిండియా- జింబాబ్వే మధ్య జూలై 23, 25, 26 తేదీల్లో మూడు టీ20 మ్యాచ్‌ల నిర్వహణకు షెడ్యూల్‌ ఖరారైంది. ఇందుకు హరారే స్పోర్ట్స్‌ క్లబ్‌ వేదిక.

 

చదవండి:  iND vs ENG: ప్రపంచంలోనే బెస్ట్‌.. అతడిని ఎందుకు ఆడించలేదు?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement